Friday, January 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅడ్డుగోడలు!

అడ్డుగోడలు!

- Advertisement -

చైతన్యం నడిచే దారుల్లో ఎన్నో ముళ్లు
హద్దులేని మాటలు కెరటాలై లేచాక
మనిషి స్వేచ్చా గోడలు చీలిపోయాయి
అత్యున్నత స్థానమే పాతాళంలోకి
తొంగిచూసే స్థితి దాపురించినాక
నమ్మకం కొవ్వొత్తిలా కరిగిపోయింది

సమాంతర రేఖపై నిలవాల్సిన పదవి
బేధ భావాల పొదిలో ఇమిడిపోయాక
స్థాన చలనానికి ప్రాణం పోసినట్లైంది
మతాంతర గ్రహణాలు నీడను కమ్మేస్తూ
ఒకే వైపు వెల్తుర్ని వెదజల్లడం మొదలైనాక
లోపలున్న నమ్మిక ఆవిరైపోయింది

అడ్డుగోడల నిర్మాణమే తీర్మానమైనాక
ఆశకు చీకటి స్పర్శ తగిలినట్టైంది
ఉన్నతమైన ప్రదేశంలో నిలబడుతూనే
అంతరాలను సృష్టించే తీరు ధ్వజమెత్తాక
ముద్దరేసిన చేయి వణికిపోయినట్టయింది

ఒంటి కన్ను సామ్రాజ్యంలో ఒకవైపు
దుర్భిక్షం కనపడని ధీనావస్తను చూసి
ప్రాణం చిట్లిపోయినంత పనైపోయింది
కూలబడుతున్న బడుగుగోడల కింద
అట్టడుగు జీవితం నలిగిపోయినాక
ఉత్తుత్తి హామీల ఊబిలో పడినట్లైంది

సమభావంతో చూడాల్సిన చూపు
సన్నగిల్లిపోయినట్టు వ్యవహరించాక
వ్యవస్థ పైన నమ్మకం విరిగిపోయింది..

  • నరెద్దుల రాజారెడ్డి, 9666016636
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -