Friday, January 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినూతనోత్తేజాన్ని నింపిన సింగరేణి మహాసభలు

నూతనోత్తేజాన్ని నింపిన సింగరేణి మహాసభలు

- Advertisement -

తెలంగాణాకు ఆర్థికంగా కీలకమైన ఆదాయ వనరుగా ఉంటూ ఉపాధి కల్పనలో, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి బొగ్గుగనుల పాత్ర అందరికి తెలిసిందే. కార్మికుల కష్టం, చెమట చుక్కల ధారపోతలో దినదినాభివృద్ధి చెంది లాభాల బాటలో పురోగమిస్తున్నది. గని కార్మికుల హక్కుల కోసం ఎందరో నాయకుల త్యాగాల చేసిన ఫలితంగా సంఘటిత ఉద్యమం రూపుదిద్దుకున్నది. పాలకవర్గాల తొత్తు సంఘాలు, సంస్కరణవాద సంఘాలకు బలమైన ప్రాతినిధ్యం ఉన్నా కార్మికుల పక్షాన నికరంగా నిస్వార్ధంగా మొక్కవోని దీక్షతో పోరాడుతున్న ఎర్రజెండా సంఘాలలో సీఐటీయూ పాత్ర నేడు కీలకంగా వుంది. 1978లో సింగరేణిలో పురుడు పోసుకుని దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ 2025 జనవరి 18న 17వ మహాసభలు మందమర్రి పట్టణంలో నిర్వహించుకుంది.

పాత, కొత్తతరం నాయకత్వాన్ని కలగలిపి ఎంపిక చేసుకొని నవనవోన్మేషంతో తొణికిసలాడుతున్నది. రానున్నకాలంలో సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల రక్షణ కోసం మరిన్ని సమర శీల పోరాటాలకు సిద్ధమైంది. 1978లో సింగరేణిలో సీఐటీయూ యూనియన్‌ కా||జార్జి, పర్సా సత్యనారాయణ, మంచికంటి కిషన్‌రావు, పి. రాజారావుల వంటి నాయకుల సారధ్యంలో ఏర్పడింది. నేటికీ పి.రాజారావు 85 ఏళ్ల వయస్సులో కూడా సంఘం నాయకత్వంలో ఉన్నారు. 35 ఏళ్ల వయసున్న యువరక్తంతో రాష్ట్ర నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం సింగరేణి భవిష్యత్‌ ఉద్యమాలకు సీఐటీయూ కొత్త వారసత్వాన్ని ఆవిష్కరించింది. సింగరేణిని ప్రయివేటీకరించాలనే పాలకుల పన్నాగాలను తిప్పికొట్టే ఉద్యమాలకు ఆ..నాయకత్వం సిద్ధమవుతోంది.

బొగ్గు రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
1973లో నాటి కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగంలో ప్రయివేటు కంపెనీలను జాతీయం చేస్తూ కోల్‌మైన్స్‌ (నేషనలైజేషన్‌)యాక్టును తీసుకు వచ్చింది. కోల్‌ ఇండియాను ఏర్పాటు చేసింది. బొగ్గు బావులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఆర్ధికాభివృద్ధికి తోడ్పడింది. ఉపాధి లభించింది. 2011 నాటికి ‘మహారత్న’ హోదా పొందింది. కోల్‌ ఇండియా నేటికి 2,20,000 మంది ఉద్యోగులతో ఉంది. 83 మైనింగ్‌ ప్రాంతాలలో 322 బొగ్గుబావులు కలిగివుంది. వీటిలో 138 అండర్‌గ్రౌండ్‌, 171 ఓపెన్‌ కాస్ట్‌, 13 మిక్స్‌డ్‌ మైన్స్‌ ఉన్నాయి. వీటిపైన అదానీ, వేదాంత, హిందాల్కో లాంటి బడా కార్పొరేట్‌ సంస్థల కన్నుపడింది. 2014లో దేశంలో మోడీ నాయకత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కోల్‌మైన్స్‌ (స్పెషల్‌ ప్రొవిజన్‌) యాక్టు 2015 తీసుకువచ్చి ప్రయివేటు వారికి బొగ్గు తవ్వుకోవడానికి అనుమతించింది. మినరల్‌ మైన్స్‌ (సవరణ) చట్టం 2020 ప్రకారం కమర్షియల్‌ మైనింగ్‌కు అవకాశమిచ్చింది. దీనివల్ల నేడు ఆదానీ ఛత్తీస్‌గడ్‌, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌ లో 17మైన్స్‌లో బొగ్గు తీస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు విస్తరించాడు. దేశంలో 170 కి||మీ|| పరిధిలో బొగ్గు తవ్వకాలకు అనుమతి పొందాడు.2020 నుండి నేటి వరకు 133 బొగ్గు బ్లాకులు వేలం వేశారు.

మరోపక్క రాష్ట్రం, కేంద్రం 51:49 వాటాతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని మన సింగరేణి కాలరీస్‌ సంస్థకు 105 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణాలో బొగ్గు తీయడానికి పుట్టిందే సింగరేణి సంస్థ. నేడు క్రమంగా ప్రయివేటు వారి చేతుల్లోకి వెళ్తున్నది. కేంద్ర బీజేపీ తీసుకు వచ్చిన విధానాల వల్ల తెలంగాణాలో బొగ్గు నిల్వలను తవ్వుకోవాలంటే వేలం పాటలో పాల్గొనవల్సిన దుస్థితి ఏర్పడింది.సత్తుపల్లి ఓసి-3, కోయగూడెం ఓసి -2 బ్లాకులు ప్రయివేటువారికి కట్టబెట్టినా నేటి వరకు ఒక్క మట్టి పెల్లతీయలేదు. మళ్లీ మణుగూరు ఓసి-2 ఎక్స్‌టెన్షన్‌ బ్లాకు, తాడిచెర్ల 2 బ్లాకులను వేలంపాటలో పెట్టబోతున్నారు. వీటివల్ల సింగరేణికే వస్తాయనే గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకం ప్రయివేటు వారికే అప్పగిస్తుంది. సింగరేణి తమ సంస్థ కార్మికులతోనే బొగ్గు తవ్వకాలు చేపట్టాలనేది సీఐటీయూ డిమాండ్‌. కేంద్రం తెలంగాణాలోని బొగ్గుబావులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలంలో ఉద్యమం చేసింది. సీపీఐ(ఎం) సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టింది. సీఐటీయూ అన్ని సంఘాలను కలుపుకొని రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టింది. మన రాష్ట్రానికి చెందిన జి.కిషన్‌రెడ్డి గనుల శాఖమంత్రిగా ఉన్నా తెలంగాణాకు ఒరిగిందేమీ లేదు. పైగా హైదారాబాద్‌ నుండే వేలం పాటలు ప్రారంభించారు.

సింగరేణి ప్రయివేటీకరణే పాలకుల లక్ష్యం!
రాబోయే కాలంలో పేరుకు సింగరేణి బోర్డు ఉంటుంది. బొగ్గు తవ్వకం, రవాణా ప్రభుత్వం చేతుల్లో ఉండదు. అంతా ప్రయివేటు చేతుల్లో ఉంటుంది. గోదావరి పరివాహక ఆరు జిల్లాల నిరుద్యోగులకు ఇక మొండిచెయ్యే! ఎందుకంటే, రానున్న పదేళ్లలో భూగర్భ బొగ్గు గనులన్నీ మూతపడుతాయి. పది వేల మంది కార్మికులు ఐదేళ్లలో మిగులు (సర్‌ప్లస్‌) తేలుతున్నారు. వారి భవిష్యత్‌ అగమ్యగోచరం. ఇప్పటికే ఓపెన్‌ కాస్టుల్లో బొగ్గుతవ్వకం, రవాణా అంతా ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు.అండర్‌ గ్రౌండ్‌లో బొగ్గు తవ్వే భారీ యంత్రాల నిర్వహణ ప్రయివేటు సంస్థలదే. పర్మినెంట్‌ మ్యాన్‌పవర్‌ ఒకనాడు లక్ష మందిపైన ఉంటే 2025 నాటికి 38వేలకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 27వేలకు పెరిగింది. బొగ్గు ఉత్పత్తి అనేకరెట్లు పెరిగింది. లాభాలు పెరిగాయి.

ఒడిస్సాలో తీసుకున్న నైని బ్లాక్‌లో మొత్తం కాంట్రాక్టీరణే. ఒక్కరు కూడా సింగరేణి కార్మికుడు కాదు. సింగరేణి విస్తరణ పేరుతో రాజస్థాన్‌, ఒడిస్సా, కర్నాటకలో సోలార్‌, బంగారం ప్రాజెక్టుల్లో పెట్టు బడులు పెడుతున్నారు. సింగరేణి పదేళ్లలో 80,643 కోట్లు కేంద్ర రాష్ట్రాలకు చెల్లించింది. సింగరేణికి మన రాష్ట్ర ప్రభుత్వం 48వేల కోట్ల బకాయి పడింది.రోడ్లు, డ్రెయినేజీలు, మెడికల్‌ కాలేజీలు, ఐఎఎస్‌ కోచింగ్‌లకు, మొక్కలకు, జాతరలకు సింగరేణి సొమ్ము వాడుతున్నారు. రానున్న కాలంలో అటు బొగ్గుబావులు కొత్తవి రాక, ఇటు బకాయిలు పెరిగి కార్మికులకు, ప్రజలకు తీవ్రం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు మాత్రం సింగరేణి సొమ్ముతో ధనవంతువులవుతున్నారు.

సింగరేణి రక్షణకు సీఐటీయూ పోరాటం
సీఐటీయూ నాయకత్వంలో కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది. కార్మిక సంక్షేమం ముఖ్యంగా కార్మికుల ‘సొంత ఇంటి కల’ నెరవేర్చాలని మూడేళ్లుగా సుదీర్ఘంగా పోరాడుతున్నది. సింగరేణి వ్యాప్తంగా భూములు, క్వార్టర్లు అన్యాక్రాంతమవుతున్నాయి. కార్మికులందరికి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.30 లక్షలు, లేదా నివాసం ఉన్న క్వార్టర్‌ ఇవ్వాలని డిమాండ్‌పై పోరాటంలో ముందుపీటన ఉంది. సంఘం నాయకులు టి.రాజిరెడ్డి ‘ఆమరణ దీక్ష’ ప్రభావితం చేసింది. నమూనా బ్యాలెట్‌ పెడితే 22వేల మంది కార్మికులు అనుకూలంగా ఓటు వేశారు. 2023లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు మూడో స్థానానికి వచ్చింది. స్థానిక సమస్యలపై కూడా పోరాడుతున్నది. కార్మికుల కాలనీలలో మంచినీటి సప్లయ్ కోసం పోరాడి రూ.20కోట్ల ఖర్చుతో ఫిల్టర్‌ బెడ్స్‌ సాధించింది. రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయించింది. హాస్పటల్స్‌లో మెరుగైన వైద్యంతో పాటు డాక్టర్లు, సిబ్బంది, యంత్రాలను ఏర్పాటు చేయించింది. సింగరేణి స్కూల్స్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌కై పోరాడింది. ఆర్‌.జి-2 ఏరియలో స్కూల్‌ సాధించింది.

పెర్క్స్‌ పై ఇన్‌కంటాక్స్‌ రద్దుకై పోరాడింది. సిఎంపిఎఫ్‌ వడ్డీ రేటు తక్కువ చెల్లిస్తే దానిపై పోరాడి రెండు వందల కోట్లు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించింది. గోదావరిఖని, భూపాలపల్లిలో పేద ప్రజల ఇళ్ల స్థలాల పోరాటంలో యూనియన్‌ ఇతర సంఘాలతో కలిసి పాల్గొన్నది. సీఐటీయూ పట్ల కార్మికుల విశ్వాసం రోజురోజుకు పెరుగుతున్నది. యువ కార్మికులు సంఘంలో విస్తృతంగా చేరుతున్నారు.ఈ నేపథ్యంలో 2025 జనవరి 18న మందమర్రి రాష్ట్ర మహాసభల్లో కార్మిక ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పది ఏరియాల నుండి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లకు నిరసనగా ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మెను సింగరేణలో సంపూర్ణంగా జయప్రదం చేస్తామని ప్రతినబూనారు. రానున్న కాలంలో సింగరేణి పరిరక్షణే ధ్యేయంగా సమరశీల పోరాటాలకు నాయకత్వం వహిస్తామని ‘లాంగ్‌ లీవ్‌ సీఐటీయూ’, ‘లాంగ్‌ లీవ్‌ వర్కింగ్‌ క్లాస్‌ యూనిట్‌’ అంటూ నినదించారు. మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి.

భూపాల్‌
94900 98034

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -