కేంద్రం నోటిఫికేషన్ జారీ
పౌరహక్కుల సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ : డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ- నోమాడిక్ (డీఎన్‌టీ) కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే శాశ్వత నివాసం లేని ఈ వర్గాలకు ఆధార్ పొందడం కష్టమనీ, దీనితో నిజమైన లబ్దిదారులు పథకానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని పౌర హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భారత్‌లో మొత్తం 1262 డినోటిఫైడ్, నోమాడిక్, సెమీ-నోమాడిక్ సముదాయాలు ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్‌లోనే 40 వర్గాలు ఉన్నాయి. ఈ తెగలు ఎక్కువగా ఒక చోటు నిలకడగా నివసించకుండా, అడవులు లేదా తాత్కాలిక నివాసాల్లో జీవనం సాగిస్తుంటాయి. బ్రిటీష్ వలస పాలన కాలంలో వీటిని ‘క్రిమినల్ కాస్ట్స్’గా ముద్రవేశారు.
కాగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. డినోటిఫైడ్ తెగల కోసం అమలు చేస్తున్న ఆర్థిక సాధికారత పథకం(స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డినోటిఫైడ్, నొమాడిక్, సెమీ-నొమాడిక్-సీడ్)లో లబ్ది పొందాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. లబ్దిదారుడు ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలి (ఆధార్ బేస్డ్ అథంటికేషన్) లేదా ఆధార్ నెంబర్ చూపాలి. ఆధార్ లేకపోతే, కొత్తగా నమోదు చేసుకోవాలి. ఆధార్ కేటాయించే వరకు పాస్‌పోర్ట్, పదో లేదా 12వ తరగతి సర్టిఫికెట్లు, రేషన్ కార్డు వంటి ఇతర పత్రాలతో గుర్తింపు చూపవచ్చు. ఈ పథకం కింద డినోటిఫైడ్ తెగలకు పలు ప్రయోజనాలు అందిస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది. ఇందులో మంచి విద్యా సంస్థల్లో ప్రవేశానికి కోచింగ్ సహాయం, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక మద్దతు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ సదుపాయాలు వంటివి ఉన్నాయని పేర్కొన్నది.
కాగా ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌పై పౌర హక్కుల సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ”ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌తో ఇప్పటికే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలలో అనేక మంది నిజమైన లబ్దిదారులు తొలగించబడ్డారు. బలహీన వర్గాలకు సంబంధించిన డేటా నమోదు లోపాలు, పేరు లేదా వివరాల సరిపోలికలేమి కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి” అని లిబ్‌టెక్ ఇండియా సీనియర్ పరిశోధకులు చక్రధర్ బుద్ధా అన్నారు. శాశ్వత చిరునామా, స్థిరమైన నివాసం లేకపోవడం వల్ల ఆధార్ పొందడమే కష్టమైన పరిస్థితుల్లో.. ఆధార్‌ను తప్పనిసరి చేయడం డినోటిఫైడ్ తెగల సంక్షేమానికి విరుద్ధమని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో నిజమైన లబ్దిదారులు సంక్షేమ పథకాల నుంచి వెలివేయబడే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.



