సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.250కోట్లు
నాగోబా ఆలయానికి రూ.22కోట్లు కేటాయిస్తాం
అటవీ సమస్యల పరిష్కారానికి కృషి : దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నాగోబా ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు అత్యంతం ప్రాధాన్యతనిస్తోందని, గిరిజన జాతర్లకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు దేవాదాయ దర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతర సందర్భంగా గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన నిర్వహించిన గిరిజన ప్రజా దర్భార్‌లో మంత్రి పాల్గొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సమ్మక్క-సారలమ్మ, నాగోబా జాతరలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.250 కోట్లు కేటాయించిందని, త్వరలోనే నాగోబా ఆలయానికి రూ.22కోట్లు కేటాయిస్తుందని చెప్పారు.
నాగోబా దర్భార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గిరిజనుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల పోడు భూముల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. అటవీ సమస్యలు పరిష్కరించాలంటే దానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాల ప్రకారం అటవీ ప్రాంతంలో ఒక్క రాయి కూడా తీయలేమని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారంకాని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. అక్కడా కాకపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. పోడు పట్టాలు పొందిన గిరిజనులకు వారసత్వ పట్టాలు మంజూరు చేస్తున్నామని, అర్హులైన వారికి సైతం పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
విద్యా సంస్థల స్థాపనకు కృషి
గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యతను రూపుమాపటానికి విద్యా సంస్థలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి సురేఖ అన్నారు. ఐటీడీఏ పరిధిలో ఎక్కడ అవసరం ఉందో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపితే పరిశీలించి వాటిని మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం పోడు భూములకు సంబంధించిన వారసత్వ పట్టాలను 9మందికి అందజేశారు. నాగోబా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్, డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, అనపు ఎస్పీలు కాజల్‌సింగ్, మౌనిక, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.



