నేడు 11 గంటలకు హాజరు కావాలని ఆదేశం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చి తమ ఎదుట హాజరు కావాలని బీఎన్ఎస్ సెక్షన్ 160 కింద కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసం లో సాయంత్రం 4 గంటలకు సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నోటీసును బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జ్ సోమ భరత్ అందుకున్నారు. తాజాగా కేటీఆర్‌కు ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ వర్గాల్లో మరోసారి కలకలం రేగింది. రెండ్రోజుల క్రితమే బీఆర్ఎస్ కీలక నాయకుల్లో ఒకరైన హరీశ్‌రావును ఇదే కేసులో సిట్ అధికారులు ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్‌ను పిలవడంతో ఈ కేసు లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం సాగిన కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మునిసిపల్, ఐటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐ న్యూస్ ఛానెల్ సీఈఓ శ్రవణ్‌రావుతో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టై బెయిల్‌పై విడుదలైన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, బుజంగరావు, రాధాకిషన్‌రావుల విచారణ లో ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి వెల్లడించిన అంశాలను ముందు ఉంచుకొని కేటీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది. కాగా కేటీఆర్‌ను ప్రశ్నించే సందర్భాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కేటీఆర్‌ను విచారించే విషయమై సిట్ అధిపతి, నగర పోలీసు కమిషనర్ వి.సి సజ్జనార్ తమ విచారణ బృందంలోని అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ విచారణలో తమ టీంలోని ఏయే అధికారులు పాల్గొనాలన్న విషయమై శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.



