Friday, January 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫిబ్రవరి 12 సమ్మెతో సత్తా చాటుదాం

ఫిబ్రవరి 12 సమ్మెతో సత్తా చాటుదాం

- Advertisement -

బీజేపీ విధానాలు కార్మికవర్గ ఉనికికే ప్రమాదం
ప్రతిఘటనతోనే సమాధానం : సమ్మె సన్నాహక సదస్సులో కార్మిక సంఘాల నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”హక్కుల రక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేద్దాం. సమరశీల పోరాటాలతో కార్మిక వర్గంపై మోడీ ప్రకటించిన యుద్ధాన్ని పదునైన ఐక్య పోరాటాలతో ప్రతిఘటిద్దాం. మంత్రాలకు చింతకాయలు రాలవు. పోరాటమా? వెనకడుగు వేయటమా? ఇది కార్మిక వర్గం ముందున్న సవాల్‌. ఈ దేశం కార్మిక, రైతు, వ్యవసాయ, సబ్బండ ప్రజలదా? లేక అదానీ, అంబానీలదా? తేల్చుదాం. కార్మికవర్గం జోలికొస్తే.. ఉత్పత్తి స్తంభన జరుగుతుంది’అని మోడీకి సవాలు విసురుదాం అంటూ కార్మిక సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎం ఎస్‌, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో ‘కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 12న సార్వత్రిక సమ్మె’కు సన్నద్ధంగా సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్‌ యాదవ్‌, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ నర్సింహా, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపేందర్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబురావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం బరితెగించి హరిస్తున్నదని విమర్శించారు.

కార్పొరేట్లకు లాభాల కోసం వారికి అనుకూల విధానాలను నిర్లజ్జగా తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి12 సమ్మె సమాయత్తంలో భాగంగా శుక్ర, శనివారాల్లో సమ్మె నోటీసులు అందజేయాలనీ, ఫిబ్రవరి 2న జిల్లా సదస్సులు నిర్వహించాలనీ, కార్మికుల పని ప్రదేశాలతో పాటు, క్షేత్ర స్థాయిలో మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించాలనే తీర్మాన పత్రాన్ని ప్రవేశపెట్టగా సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ఐఎన్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జనక్‌ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలరాజు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు రెబ్బారామారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్‌, ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ వచ్చే నెల 12న కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తలపెట్టిన కార్మిక సమ్మె అవశ్యకతను వివరించారు. అక్టోబర్‌ 8న ప్రభుత్వం ‘డ్రాప్ట్‌ లేబర్‌ పాలసీ-శ్రమ శక్తి నీతి-2025 (కార్మిక వ్యతిరేక ముసాయిదా-2025)ను కార్మిక సంఘాలతో చర్చించకుండానే, నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలుకు పూనుకున్నదని విమర్శించారు.

కార్మిక సంఘాల పాత్రను నామమాత్రం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రమను హక్కుగా కాకుండా ధర్మంగా పరిగణించాలని ప్రచారం చేస్తున్నదని తెలిపారు. చట్టాల అమలు, నియంత్రణ బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని విమర్శించారు. ఉమ్మడి బేరసారాల హక్కును దెబ్బతీసేందుకు కుట్ర చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. త్రైపాక్షిక చర్చల పద్ధతిని విస్మరిస్తూ, యాజమాన్యాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాలను విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమతో ఉత్పత్తైన సంపదను కార్పొరేట్ల బొక్కసాలు నింపేందుకు మోడీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నదనీ, ఇది ఎంత మాత్రం కుదరదని సమ్మె ద్వారా కార్మిక వర్గం హెచ్చరిస్తున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌, ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షులు అనురాధ మాట్లాడారు.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా..
ప్రపంచంలో అమెరికన్‌ సామ్రాజ్యవాదం బరితెగించి వ్యవహరిస్తున్నదని నిరసనకారులు విమర్శించారు. వెనిజులా అధ్యక్షులు మదురో, అతని సతీమణిని కిడ్నాప్‌ చేయటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. అమెరికా దురహంకారాన్ని నిరసిస్తూ డబ్ల్యూఎఫ్‌టీయూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా డబ్ల్యూఎఫ్‌టీయూ భాగస్వామ్య సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె సదస్సు అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఇతర కార్మిక సంఘాలూ పాల్గొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -