జనగణనలో కొత్త సవాలు
వలస కార్మికులను ఎక్కడ లెక్కిస్తారు?
ఓటు ఒక చోట.. జీవనం మరోచోట
ఓటు హక్కుకు దూరమవుతున్న వైనం
ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ అమలుపైనా రాజకీయ రగడ
దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లలో కోత?
జనగణన-2027 భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనున్నది. ఇలాంటి తరుణంలో ఈ గణనతో పాటు పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వలసకార్మికులను ఎక్కడ లెక్కించాలి? వారు పుట్టిన జన్మభూమిలోనా, లేదా జీవనం సాగిస్తున్న కర్మభూమిలోనా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది ప్రజల నివాసం, ఉపాధి, ఓటు హక్కు మధ్య ఉన్న లోతైన అంతరాన్ని బయటపెడుతోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అంతేకాదు.. జనగణనతో ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్ అమలు అనేది కూడా చర్చకు దారి తీస్తున్నది. ఇక దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్ల సంఖ్యను నిర్ణయించేది కూడా ఈ జనగణనే కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది.
న్యూఢిల్లీ : భారత్ నేడు కోట్లాది మంది వలసకార్మికుల దేశంగా మారింది. పలు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లిన ప్రజలు బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబయి వంటి నగరాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సేవా రంగాన్ని నడిపిస్తూ గణనీయమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటున్నారు. అయితే నగరాల్లో పని చేస్తున్న ఈ కార్మికులు జనగణనలో మాత్రం బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తమ స్వస్థలాల్లో లెక్కించబడుతున్నారు.
హాస్పిటాలిటీ, విమానయాన రంగాల్లో ఈశాన్య రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో పని చేస్తోంది. దీంతో వీరంతా ఓటు హక్కుకు దూరమవుతున్నారు. ప్రజా ప్రయోజనాలకు నోచుకోలేకపోతున్నారు. ఇక వలసకార్మికుల విషయంలో ఒక వాస్తవాన్ని ఇప్పటికే ప్రాంతీయ రాజకీయ పార్టీలు గ్రహించాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీలు, ముంబయిలో శివసేన, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), పంజాబ్లో అకాలీదళ్.. ఇలా అన్ని ప్రాంతీయ పార్టీలూ ఒక విషయాన్ని అంగీకరిస్తున్నాయి. అదే.. వలసకార్మికులను అసురక్షితంగా భావిస్తే, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు నిలువవని.
జనగణన వర్సెస్ ఓటరు జాబితా
జనగణనలో ఒక వ్యక్తిని ఆ రోజు ఉన్న ప్రదేశం ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఓటరు జాబితా మాత్రం సాధారణంగా వ్యక్తి పుట్టిన ప్రదేశం లేదా చదువుకున్న ప్రాంతానికి అనుసంధానమై ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం… చట్టపరంగా ఆరు నెలలు నివసిస్తే ఓటరు నమోదు మార్చుకోవచ్చు. అయినా చాలామంది వలసకార్మికులు ఏండ్ల తరబడి వేరొక ప్రదేశంలో జీవనం సాగిస్తున్నప్పటికీ.. వారు తమ ఓటును స్వస్థలంలోనే కొనసాగిస్తున్నారు. దీని ఫలితంగా ఎన్నికల్లో ఓటు శాతం తగ్గిపోతున్నది. తమ స్వస్థలాలకు వెళ్లడం తీవ్రమైన ఖర్చుతో కూడుకున్నది. సమయాభావం కూడా. దీంతో చాలామంది వలస కార్మికులు ఓటు వేయడం మానేస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును దేశంలోని వలస కార్మికులు వినియోగించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నగర పాలనలో అసమతుల్యత
సాధారణంగా నగరాభివృద్ధి ప్రణాళికలు జనగణన ఆధారంగా జరుగుతాయి. వలస కార్మికులు కూడా ఆ జనాభా లెక్కలో ఉంటారు. కానీ వారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేరు. ఎందుకంటే ఓటరు నమోదు వేరే చోట (స్వస్థలాల్లో) ఉంటుంది. దీంతో నగర పాలనలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతున్నది. పాలక యంత్రాంగం వలస కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక గ్రామాలకు అక్కడ నివసించని ప్రజల (వలస కార్మికులు) పేరుతో నిధులు వెళ్తాయి. ఇది ప్రజాస్వామ్యంలో అతిపెద్ద సమస్యగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
కుల గణన.. క్రిమీ లేయర్ వివాదం
జనగణన-2027లో కులాల సంఖ్యలతో పాటు ఆదాయం, ఆస్తులు, సంపద వివరాలు కూడా సేకరించనున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిపై స్పష్టమైన డేటా లభించనున్నది. ప్రస్తుతం ఓబీసీలకు వర్తిస్తున్న ‘క్రిమీ లేయర్’ నిబంధనను ఎస్సీ, ఎస్టీలకూ వర్తింపజేస్తారన్న చర్చ ఊపందుకున్నది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్ గవాయి దీనికి మద్దతు తెలపడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ అంశంపై జనగణన డేటా కీలకంగా మారుతుందనీ, ఈ చర్చ తీవ్రమైన రాజకీయ ఘర్షణలకు దారి తీసే అవకాశాలూ ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. క్రిమీ లేయర్ విషయంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సదరు ప్రతిపాదనకు వ్యతిరేకంగా దళిత, గిరిజన సంఘాలు ఆందోళనలను కూడా నిర్వహిస్తున్నాయి.
తగిన పరిష్కారం అనివార్యం
మొత్తానికి జనగణన అంశం అనేది అనేక విషయాలతో ముడిపడి ఉన్నది. ఇది వలస కార్మికుల హక్కులు, రిజర్వేషన్ల భవిష్యత్తు, ఫెడరలిజం సమతుల్యతను నిర్ణయించే కీలక మలుపు. కాబట్టి ఈ విషయంలో సర్వత్రా చర్చలు తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగానూ తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ఇలాంటి తరుణంలో దేశ ఐక్యత, ప్రజాస్వామ్య న్యాయం కోసం ఒక సరైన పరిష్కారం అనివార్యమని మేధావులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర-దక్షిణ విభేదం.. నియోజకవర్గాల పునర్విభజన
జనగణన-2027తో మరో సున్నితమైన అంశం తెరపైకి వచ్చింది. అదే.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. ఈ విషయంలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. జనాభా నియంత్రణలో చక్కని ప్రదర్శనను కనబర్చిన తాము.. అదే జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలు తగ్గితే రాజకీయంగా నష్టపోతామని వాదిస్తున్నాయి. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల బలాన్ని తగ్గించేసి, తమ గొంతును నొక్కేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దక్షిణాది వాదనకు మేధావుల మద్దతు
దక్షిణాది రాష్ట్రాల వాదనను పలువురు మేధావులు సైతం సమర్థిస్తున్నారు. ”జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు బహుమతిగా సీట్లు పెంచితే.. భారత సమాఖ్యకు అర్థమేంటి?” అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జె.చలమేశ్వర్ ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డి. సుబ్బారావు అభిప్రాయం ప్రకారం… ”దక్షిణాది రాష్ట్రాలకు ఇది రాజకీయంగా, ఆర్థికంగా ‘డబుల్ దెబ్బ’. ఈ రాష్ట్రాలు పన్నులు ఎక్కువగా చెల్లించినా, నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోంది.” అని అన్నారు.



