ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఆసిఫాబాద్
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో భాగంగా తెలుసుకున్న ప్రతి సమస్యనూ పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రాష్ట్ర ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ దండే విటల్, ఎమ్మెల్యే వేడుమ బొజ్జు, ఆసిఫాబాద్ కలెక్టర్ హరితతో కలిసి జైనూర్ మండలంలోని జంగాంలో ఇందిరమ్మ లబ్దిదారులకు డిప్యూటీ సీఎం పత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు వడ్డీ లేని రాయితీ రుణాల చెక్కును అందించారు. భూసిమెట్టలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ కోసం రూ.30 లక్షలు మంజూరు చేసి, ధరణితో పట్టాలు కోల్పోయిన వారికి భూభారతితో పట్టాలు అందిస్తామని తెలిపారు. కెరమెరి మండలం మోడీలో లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాలను అందించారు. జిల్లాలోని లింగాపూర్, ధనోర, గూడెం, వావుదాం గ్రామాల్లో రూ.11.25 కోట్లతో నిర్మించే సబ్ స్టేషన్‌లకు శంకుస్థాపనలు చేయడంతోపాటు రూ.కోటి 70 లక్షలతో నిర్మించే విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి, రూ.కోటితో నిర్మించే విద్యుత్ స్టోర్ రూమ్‌కు కలెక్టరేట్‌లో శంకుస్థాపన చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సఫారీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పాదయాత్ర చేసినప్పుడు తనకు భోజనం పెట్టిన గంగుబాయి కుటుంబాన్ని భోజనానికి ప్రజాభవన్‌కు ఆహ్వానించారు. ఓజ తెగకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయం అందజేయడంతోపాటు వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కలిగిస్తామని హామీ ఇచ్చారు.
గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయడంలో భాగంగా ఇందిరమ్మ సౌర గిరిజల వికాస పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఆర్థిక పంటలవైపు గిరిజనులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. అందరికీ రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అసిఫాబాద్ ఉట్నూర్ రహదారి, అనార్‌పల్లి బ్రిడ్జి, ఇతర సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు సుగుణ, మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మెన్ విశ్వనాథ్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.



