క్రిప్టో వెంచర్లు, కొత్త పరిశ్రమలతో జేబులు నింపుకుంటున్న కుటుంబం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సంపద కొండలా పెరిగిపోతోంది. క్రిప్టో వెంచర్లు, ఏఐ, రేర్ ఎర్త్స్ వంటి కొత్త పరిశ్రమలు, మీడియా ఒప్పందాలు, ప్రపంచ రియల్ ఎస్టేట్ లైసెన్సింగ్‌ల ద్వారా ట్రంప్ కుటుంబం 1.4 బిలియన్ డాలర్లు సంపాదించింది. గత సంవత్సరం అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ఓ సోషల్ మీడియా కంపెనీని స్థాపించారు. సహ వ్యవస్థాపకుడిగా క్రిప్టో వేదికను ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబం తాజాగా ఆయుధాలు, రేర్-ఎర్త్ మాగేట్స్, కృత్రిమ మేధ (ఏఐ), అంచనా మార్కెట్లు (భవిష్యత్ వ్యాపార ఫలితాలపై ప్రజలు తమ అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకుంటూ వాటి ఆధారంగా టోకెన్లను కొనుగోలు చేసి విక్రయించే వ్యవస్థ లేదా వేదిక) వంటి పరిశ్రమల్లో ప్రవేశించింది.
జేబులు నింపిన క్రిప్టో కరెన్సీ
క్రిప్టో కరెన్సీల ద్వారా ట్రంప్ కుటుంబ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కుటుంబం ఇప్పటికే 1.4 బిలియన్ డాలర్లు కూడబెట్టిందని బూమ్‌బర్గ్ అంచనా. ఇందుకు ట్రంప్ విధానాలు దోహదపడ్డాయి. క్రిప్టో బిల్లుపై సంతకం చేయడం, రెగ్యులేటర్ల నియామకం వంటి చర్యలు కుటుంబ ఆదాయాన్ని పెంచాయి. అయితే మొత్తంగా చూస్తే కుటుంబ నికర ఆస్తుల విలువ గత సంవత్సరంలో ఉన్నట్లుగానే 6.8 బిలియన్ డాలర్లుగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదిక ప్రకారం…ట్రంప్ తన అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని వివిధ పెట్టుబడులు, కాంట్రాక్టుల ద్వారా కనీసం 1.4 బిలియన్ డాలర్లు సంపాదించారు.
బ్లూమ్‌బర్గ్ చెబుతున్న దానిని బట్టి చూస్తే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టులు ట్రంప్ సంపదకు మూల స్తంభాలుగా మారాయి. ట్రంప్ కుటుంబం అనేక మార్గాలలో కాల్పనిక కరెన్సీల ద్వారా డబ్బు సంపాదించింది. క్రిప్టోతో సంబంధమున్న టోకెన్లు, ప్రభుత్వ-ప్రైవేటు కంపెనీలు కూడా ట్రంప్ కుటుంబం జేబులు నింపాయి. బాగా ప్రాచుర్యం పొందిన క్రిప్టో వెంచర్లు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, ట్రంప్ పేరిట ఉన్న మెమోకాయిన్, అమెరికన్ బిట్‌కాయిన్ కార్పొరేషన్‌లతో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయి. బూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ గత సంవత్సరం 390 మిలియన్ డాలర్లు సంపాదించింది. మెమోకాయిన్ 280 మిలియన్ డాలర్లు ఆర్జించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో…
ట్రంప్ మీడియా ఆ కుటుంబానికి అతి పెద్ద ఆస్తిగా నిలుస్తోంది. అయితే అది ఇంకా లాభాల బాట పట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కూడా ట్రంప్ కుటుంబం దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టవర్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర విలాసవంతమైన ఆస్తులకు సంబంధించిన లైసెన్సింగ్ ఒప్పందాల వ్యవహారాలను ట్రంప్ ఆర్గనైజేషన్ చూస్తోంది. వియత్నాం, రియాద్‌లలో ఉన్న గోల్ఫ్ కోర్సులు సహా వివిధ దేశాలలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ట్రంప్ పేరిట లైసెన్స్ ఇచ్చినందుకు ఆ కుటుంబం కనీసం 23 మిలియన్ డాలర్లను సంపాదించిందని ఎన్‌వైటీ నివేదిక ఇప్పటికే చెప్పింది. మెలనియా డాక్యుమెంటరీ హక్కుల నిమిత్తం అమెజాన్ సంస్థ ట్రంప్ కుటుంబానికి 28 మిలియన్ డాలర్లు అందజేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్స్, ఏబీసీ న్యూస్, మెటా, యూట్యూబ్, పారామౌంట్ సహా ప్రధాన మీడియా కంపెనీలు ఆ కుటుంబానికి 93.5 మిలియన్ డాలర్లు చెల్లించాయని ఎన్‌వైటీ నివేదిక వివరించింది.
వెంచర్ క్యాపిటల్ వ్యాపారంలో…
వెంచర్ క్యాపిటల్ వ్యాపారం కూడా ట్రంప్ కుటుంబానికి కలిసొచ్చింది. ట్రంప్ కుటుంబ కంపెనీ అయిన 1789 కాపిటల్‌కు ఈ వ్యాపారం ద్వారా కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ కంపెనీలో డోనాల్డ్ ట్రంప్ జూనియర్ భాగస్వామిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి ఈ కంపెనీలో ఇన్వెస్టర్లు రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారని బ్లూమ్‌బర్గ్ అంటోంది. ఈ సంస్థలో ట్రంప్ జూనియర్ ఎంత పెట్టుబడి పెట్టిందీ తెలియనప్పటికీ ఇలాంటి కంపెనీలలో భాగస్వామికి వాటాలు ఉండడం సహజమే. 1789 కాపిటల్ కంపెనీ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌లోనూ, మరికొన్ని చిన్న సంస్థలలోనూ పెట్టుబడి పెట్టింది. గత సంవత్సరం రేర్-ఎర్త్ మాగెట్ కంపెనీ అయిన వల్కన్ ఎలిమెంట్స్‌లో కూడా ట్రంప్ కుటుంబ కంపెనీ వాటాలు కొనుగోలు చేసింది.



