కోర్టు అనుమతి కోరిన అమెరికా ఎస్ఈసీ
న్యూయార్క్/న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌పై ఎదుర్కొంటున్న 265 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,200 కోట్లు) లంచం, మోసం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ అదానీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలకు నేరుగా ఇమెయిల్ ద్వారా నోటీసులు పంపేందుకు అనుమతించాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) అక్కడి కోర్టును కోరింది. గతేడాది కాలంగా దౌత్యపరమైన మార్గాల్లో సమన్లు అందజేయడానికి ఎస్ఈసీ ప్రయత్నించినప్పటికీ, భారత ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన లభించలేదని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. గతంలో ఎస్ఈసీ చేసిన రెండు అభ్యర్థనలను భారత్ తిరస్కరించినట్టు తాజా కోర్టు ఫైలింగ్స్ వెల్లడించాయి. ప్రస్తుత పద్ధతుల్లో సమన్ల ప్రక్రియ పూర్తి కావడం కష్టమని భావిస్తున్న అమెరికా నియంత్రణ సంస్థ నేరుగా వారి బిజినెస్ ఇమెయిల్ ఐడీలకు వీటిని పంపేందుకు అనుమతి ఇవ్వాలని న్యూయార్క్ కోర్టును ఎస్ఈసీ కోరింది.
తాజా పరిణామంపై అదానీ గ్రూప్ కానీ, భారత ప్రభుత్వం కానీ స్పందించలేదు. గతంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తూ.. ఇది ప్రయివేటు సంస్థలు, అమెరికా న్యాయ శాఖకు సంబంధించిన అంశమని పేర్కొంది. నవంబర్ 2024లో గౌతమ్ అదానీ, ఒక అమెరికన్ కంపెనీతో సహా ఇతరులు భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టును పొందేందుకు 250 మిలియ డాలర్ల లంచం ఇవ్వడంలో భాగస్వాములయ్యారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ విషయంలో అమెరికన్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారనేది ప్రధాన అరోపణ. మరోవైపు లంచం ఆరోపణలను తొలగించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి గతేడాది మే నెలలో అదానీ ప్రతినిధులు ట్రంప్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గౌతం అదానీ అరెస్టు అయ్యే ప్రమాదం ఉన్నందున ఆయన అమెరికాకు వెళ్లలేరని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అదానీకి ఇమెయిల్‌తో సమన్లు..!
- Advertisement -
- Advertisement -



