Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు

మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు

- Advertisement -

50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్‌
51 కేంద్రాల నుంచి రాకపోకలు
11 వేల మంది సిబ్బంది విధులు
గద్దెల వద్దకు ఆర్టీసీ బస్సులు
మేడారానికి ‘మహాలక్ష్మి’ పథకం అమలు : ఆర్‌ఎం విజయభాను

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి 4 వేల ఆర్టీసీ బస్సులను మేడారానికి నడపనుంది. గత జాతరకు 3,491 బస్సులను నడిపిన అధికారులు ఈసారి 4 వేల బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు ఆర్టీసీ ద్వారా రాకపోకలు సాగించే అవకాశమున్నట్టు ఆర్టీసీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022 మేడారం జాతరలో ఆర్టీసీ 2,392 బస్సులను ఏర్పాటు చేయగా, 10.80 లక్షల మంది భక్తులు ఆ సేవలను వినియోగించుకున్నారు.

2024 మేడారం జాతరకు 3,491 బస్సులను ఏర్పాటు చేయగా, 16.84 లక్షల మంది వినియోగించుకున్నారు. అలాగే, జాతర బస్సులను నిలపడానికి 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 1,355 ఆర్టీసీ సర్వీసులను మేడారం జాతరకు నడుపనున్నారు. వరంగల్‌ నగరంలోని వరంగల్‌, హనుమకొండ, కాజీపేట నుంచి అత్యధిక బస్సులను సిద్ధం చేశారు. 2024 మేడారం జాతరలో ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించారు. దాంతో 2022 నాటి కంటే 2024 జాతరకు 6 లక్షల మంది ప్రయాణీకులు పెరిగారు. ఈ జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రయివేటు వాహనాల్లో మేడారం చేరుకునేవారు పార్కింగ్‌ స్థలాల నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేరకు ఆటోల్లో మళ్లీ ప్రయాణించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

నిరంతరం రవాణా అందుబాటులో ఉండేలా
మేడారం జాతరలో భక్తులకు నిరంతరం రవాణా సౌకర్యాలను అందించడానికి 11 వేల మంది అధికారులు, సిబ్బంది విధులను నిర్వహించనున్నారు. ఇందులో 7 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్లు, 2 వేల మంది సపోర్టింగ్‌ సిబ్బంది ఈ విధుల్లో ఉండనున్నారు.

ట్రాఫిక్‌ జామ్‌ నిరోధానికి 15 మొబైల్‌ బృందాలు
జాతర రహదారిలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు ఉత్పన్నమైనా అక్కడికి వెళ్లి ట్రాఫిక్‌ జామ్‌ను పరిష్కరించడానికి 15 మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో ఎక్కడైనా మరమ్మతులు అవసరమైనా ఈ బృందాలు వెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించనున్నట్టు తెలిపారు.

ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది : ఆర్‌ఎం విజయభాను
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణం అత్యంత సురక్షితమైనది. అంతేకాదు ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు నేరుగా మేడారంలోని వీరవనితల గద్దెల సమీపానికి చేరుకునే అవకాశముంది. ప్రయివేటు వాహనాల ద్వారా వెళ్లే వారు మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి మేడారం గద్దెలకు చేరుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. మహాలక్ష్మి పథకం అమలవుతుంది. ఆర్టీసీ డ్రైవర్లకు ఇప్పటికే జాతరకు సంబంధించి ప్రత్యేక శిక్షణనిచ్చాం. ప్రయాణీకులు సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ప్రధాన కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -