హైడ్రా కూడా…
ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం
ప్రజాసమస్యలపై ఫోకస్..
గ్లోబల్ సిటీకి మార్చేందుకు ఏర్పాట్లు
జలమండలికి ఆర్థిక కష్టాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. అదే తరహాలో ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టేందుకు, హైదరాబాద్‌ను మరింత గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ 300 వార్డులుగా విస్తరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అదే తరహాలో జలమండలిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ సమస్యలను సూక్ష్మ స్థాయిలో గుర్తించి పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అధికారులు అంటున్నారు. జలమండలిని విస్తరణ ద్వారా తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.
నగరంలో 9వేల కిలో మీటర్ల రోడ్లలో 5వేల కిలో మీటర్ల ప్రధాన రోడ్లుండగా, దాదాపు 10వేల కిలో మీటర్ల మేర వర్షం నీటి డ్రైన్లు అవసరం ఉంది. కానీ గ్రేటర్‌లో వెయ్యి కిలో మీటర్లే వర్షం నీటి డ్రైన్‌లు ఉన్నాయి. అయితే రోజురోజుకూ కబ్జాలు పెరగడం.. మరో వైపు రోడ్లను విస్తరిస్తున్న క్రమంలో డ్రెయిన్ వాటర్ లైన్లు కనిపించకుండా పోతున్నాయి. ఇక అభివృద్ధి పేరుతో అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు షాపింగ్ మాల్స్ ఇలా తదితర వాణిజ్య వ్యాపార భవంతులు వెలుస్తుండటంతో చినుకు పడితే సిటీ రోడ్లన్నీ చెరువులుగా తలపిస్తున్నాయి. కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. వీటన్నిటినీ కట్టడి చేసేందుకు ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దించింది. హైడ్రాకు వస్తున్న సత్ఫలితాలతో జలమండలి, జీహెచ్‌ఎంసీ విస్తరణను వేగవంతం చేసింది.
తక్కువ సమయంలోనే..
కబ్జాదారుల నుంచి నగరాన్ని కాపాడి రాబోయే తరాల వారికి మంచి వాతావరణం, అభివృద్ధితోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం హైడ్రాను 2024, జూన్ 18న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే దేశంలో ఏ సంస్థకు ఇంతలా ప్రచారం కాలేదని మేధావులు, రాజకీయ నాయకులు, పండితులు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైడ్రా పనితీరుతో ప్రతి ఒక్కరిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చింది.
ఇప్పుడు పార్కులు, నాలాలు, చెరువులకు కబ్జా చేయాలన్నా, అక్రమ నిర్మాణాలు చేపట్టాలన్నా వణుకు పుట్టించారు. అయితే హైడ్రా ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీహెచ్‌ఎంసీని మూడు మహానగర పాలక సంస్థలుగా చేయాలనే ఆలోచన ఉన్నదని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే మహానగర పాలక సంస్థలుగా విభజించే దిశగా ప్రక్రియ వేగం పుంజుకుంది. అధికారికంగా మూడు కార్పొరేషన్లుగా ప్రకటించకపోయినా, ఆ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే నెల 10వరకు ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ఉండటంతో అప్పటిలోపు సిబ్బంది, ఇతరాత్ర విభజన ప్రక్రియను పూర్తి చేయాలనే స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం అందడంతో దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది.
కొత్త అధ్యాయానికి నాంది
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో హైదరాబాద్ పురపాలనలో ప్రభుత్వం నగర పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ విలీనంతో జీహెచ్‌ఎంసీ 300 కార్పొరేషన్లు, 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించిందని ప్రచారం జోరందుకుంది.
ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన హైడ్రా తరహాలోనే జీహెచ్‌ఎంసీని విస్తరించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అంతా సిద్దమవుతోంది. అందులో భాగంగానే ఉన్నతా ధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందిని మూడు కార్పొరే షన్‌లకు విభజన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే జోన్లకు జోనల్ కమిషనర్లను నియమించిన ప్రభుత్వం, 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జోన్‌లకు పరిపాలన, ఆర్థిక, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలకు అధికారులు, సిబ్బంది బదిలీలు చేస్తున్నారు.
జలమండలిదీ అదే దారి
హైడ్రా, జీహెచ్‌ఎంసీ తరహాలోనే జలమండలిని విస్తరిస్తున్నారు. జోన్లు, సర్కిళ్లు, సబ్ డివిజన్లు, వార్డులుగా సెక్షన్లగా విస్తరిస్తున్నారు. 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విస్తరించే అవకాశముంది. 1450.2చ.కి.మీ. నుంచి 2,053.2చ.కి.మీ వరకు సేవలను అందిం చనున్నారు. తాగునీటి నల్లా కనెక్షన్లు 14,43,136, 9055.29 కి.మీ మురుగు నీటి పైపులైన్స్, 4,80,269 మాన్‌హోళ్ల్లుండగా ప్రస్తుతం 583 ఏంజీడీల తాగునీరు సరఫరా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించిన అనంతరం నివేదిక తయారు చేయనున్నారు. విస్తరణలో భాగంగా ఐదు జోన్ల(సర్కిల్)కు అదనంగా కొత్తగా ఏడు జోన్లను ఏర్పాటు చేశారు.
59 సర్కిల్స్ (సబ్‌డివిజన్) ఉండగా కొత్తగా మరొకటి ఏర్పాటు చేశారు. 192 వార్డులు (సెక్షన్) ఉండగా అదనంగా మరో 108 ఏర్పాటు చేశారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాల వరకు ఉన్న పరిధిని ప్రస్తుతం ఓఆర్‌ఆర్ వెలుపల కూడా విస్తరించారు. జోనల్ అధికారులుగా చీఫ్ జనరల్ మేనేజర్లు(సీజీఏం) బాధ్యతలు చేపట్టనున్నారు. జోన్ పరిధిలో నాలుగు నుంచి ఆరు సర్కిళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. జోనల్ కార్యాలయంలో ఇద్దరు చొప్పున జనరల్ మేనేజర్లు (జీఏంలు) ఉంటారు. ఒక్కో జీఎం రెండు నుంచి మూడు సర్కిళ్లను పర్యవేక్షిస్తారు. సర్కిళ్లలో సర్కిల్ అధికారిగా డిప్యూటీ జనరల్ మేనేజర్లు (డీజీఏంలు) బాధ్యతలు చేపట్టనున్నారు. వారు నాలుగు నుంచి ఐదు వార్డులను పర్యవేక్షించనున్నారు. వార్డు ఆఫీసర్లుగా మేనేజర్లు బాధ్యతలు తీసుకోనున్నారు.
ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక కష్టాలు
హైదరాబాద్ మహానగర విస్తరణ జలమండలికి కొత్తగా ఆర్థిక కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రతి నెలా రూ.130కోట్ల లోటుతో నడుస్తున్న జలమండలికి కొత్త ప్రాంతాలను తీసుకురావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు జలమండలి పరిధి అధికారికంగా 1450.2 చదరపు కిలోమీటర్లు. తాజా విస్తరణతో 2,053.2 చదరపు కిలోమీటర్లు కానుంది. విలీనమైన ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జలమండలికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. కొత్తగా విలీనమవుతున్న ప్రాంతాల్లో పటిష్టమైన తాగునీరు, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు అందించాలి. లేకపోతే ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు.



