ఇది కార్మికవర్గంపై ప్రత్యక్షదాడి
కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర: ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్
జర్నలిస్టులపైనా తీవ్ర ప్రభావం : మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్‌రెడ్డి
లేబర్ కోడ్‌లతో సమ్మె హక్కుకు తూట్లు : ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల్ని కట్టుబానిసత్వంలోకి నెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తీసుకొస్తున్నదని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ విమర్శించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనివిధానాన్ని రద్దు చేస్తూ యాజమాన్యాలు ఇష్టానుసారంగా పని గంటలు పెంచుకునే వెసులుబాటు కల్పించడాన్ని తప్పుబట్టారు. గురువారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గల సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ లేబర్ కోడ్‌లు- కార్మికవర్గంపై వాటి ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. లేబర్ కోడ్‌లను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ.. ప్రధాన కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని కేవలం నాలుగు కోడ్స్‌గా మార్చడం సంస్కరణ కాదనీ, అది కార్మిక హక్కులపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు.
‘వేతనం’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా అలవెన్సులు తగ్గిపోతాయనీ, దాని ప్రభావం పీఎఫ్, గ్రాట్యూటీ, రిటైర్ ప్రయోజనాలపై తీవ్రంగా పడుతుందని అన్నారు. అనేక నిబంధనల పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిని తగ్గించడంతో కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుందని వాపోయారు. గిగ్, ప్లాట్ వర్కర్లకు భద్రత ఉంటుందన్న ప్రభుత్వ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. కార్మికులు సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్య హక్కులు – కార్మిక హక్కులు’ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయనీ, వాటిని కాపాడుకునేందుకు కార్మిక వర్గం రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు రక్షణగా ఉన్న ‘వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్’ను రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. ఇతర కార్మిక చట్టాలతో దానిని కలిపి ‘ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ చేర్చడం వల్ల జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు, రక్షణ పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేజ్ బోర్డుల వ్యవస్థ దెబ్బతింటే యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై జర్నలిస్టులు ఆధారపడాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత లేకుండా మీడియా స్వేచ్ఛ నిలబడబోదని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకపోతే స్వేచ్ఛగా వార్తలు రాయలేరనీ పేర్కొన్నారు. లేబర్ కోడ్‌లను తెలంగాణలో అమలు చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని కార్మిక సంఘాలను కోరారు.
ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ మాట్లాడుతూ..కొత్త కోడ్స్‌తో 1926లో ఆమోదించిన ట్రేడ్ యూనియన్ల చట్టం సమాధి కాబోతుందని హెచ్చరించారు. 60 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లాలనే నిబంధన కార్మికుల నిరసన గళాన్ని అణచివేయడమేనని అన్నారు. కొత్త లేబర్ కోడ్‌లు యజమానులకు అపరిమిత అధికారాలను కల్పిస్తూ ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని చట్టబద్ధం చేస్తున్నాయని విమర్శించారు. ఈ సదస్సులో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు బీవీ.విజయలక్ష్మి, సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ యూసుఫ్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి రాంబాబు, సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవరావు, నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు.
కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టేందుకే కోడ్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



