Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై స్టేకు నిరాకరణ

గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై స్టేకు నిరాకరణ

- Advertisement -

హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై స్టే జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేయటం చెల్లదని..అందువల్ల ఎన్నికలపై స్టే ఇవ్వాలనే మధ్యంతర అభ్యర్థనను తిరస్కరించింది. వార్డుల పునర్విభజన జీవో 7ను సవాల్‌ చేస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ విజయ్ సేన్‌రెడ్డి గురువారం విచారించారు. చేపట్టారు. మల్లనసాగర్‌లో ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, బంజర్‌పల్లి, వేములఘాట్‌, నాగారం తాండాకు చెందిన ముంపు గ్రామస్తులకు పునరావాసం కింద గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లో కలపడం అన్యాయమనే వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఏడు ముంపు గ్రామాలు భౌతికంగా లేవని ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిటిషనర్లు కోరినట్టుగా మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది.

గీతం విద్యుత్‌ బకాయిల్లో రూ.54 కోట్లు చెల్లించాలి
విద్యుత్తు బకాయిలు రూ.108 కోట్లకుగాను రూ.54 కోట్లు చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు మూడు వారాలు గడువు విధించింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరాపై టీజీఎస్పీడీసీఎల్‌ చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. విద్యుత్తు బకాయిలు రూ.118 కోట్లు చెల్లించాలని లేదంటే సరఫరా నిలిపివేస్తామంటూ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ గీతం ట్రస్టు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి గీతం పిటిషన్‌ విచారణార్హమేననీ, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ టీజీఎస్పీడీసీఎల్‌ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన బెంచ్‌ గురువారం విచారణ చేపట్టి పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం సబబే
హైదరాబాద్‌ నాంపల్లిలోని హనుమాన్‌ ఆలయం మఠం కాదనీ, అది ఆలయమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు 1989లోనే ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసిందని గుర్తు చేసింది. 1989లోనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలయంగా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని తెలిపింది. నోటిఫికేషన్‌ను పిటిషనర్‌ సవాలు చేయలేదని తెలిపింది. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

విచారణ వాయిదా
ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై కేసుల విషయంలో సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాల్మియా సిమెంట్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407 హెక్టార్ల భూమి లీజును అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు ఇచ్చిందనీ, ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్‌ జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ వాదించింది. దీనిపై విచారణను కోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -