ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్‌మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు.
నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ, ‘ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం’ అని అన్నారు. ‘ఎకో సిస్టమ్‌లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురూ బాలేదు. కంటెంట్ లేక శ్రీరాములు లాంటి థియేటర్ ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారు.
ఎగ్జిబిటర్లు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. ఇలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా చిత్రీకరణ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము.
కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, ‘మనంలో మనం ఇలా కొట్టుకోవడం వల్ల లోకువ అయిపోతాం. సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం వెళ్ళట్లేదు. ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి కూడా మీటింగ్ లు జరిగాయి. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే, అలా ఏక పక్షంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో మాకు అర్థం కావడంలేదు’ అని తెలిపారు. ‘20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా?. సినిమా నడిస్తేనే మనందరికీ మనుగడ. లేకపోతే అందరం నష్టపోతాం’ అని అన్నారు.
సినిమా నడిస్తేనే మనందరికి మనుగడ
- Advertisement -
- Advertisement -



