న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. చమురు ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన మోడీ సర్కార్ తాజాగా తన వర్గాలతో పెట్రో బాదుడుకు అనుగుణంగా ప్రకటనలు చేయిస్తోంది. చమురు కంపెనీలకు లక్షల కోట్ల నష్టం వస్తుందని ఇటీవల కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన చేయగా.. తాజాగా ఆర్‌బిఐ గవర్నర్ అదే తరహాలో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరికొంత కాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐఎంఎఫ్ సదస్సులో ఆయన ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలే ఆ భారాన్ని భరిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. అయితే యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఈ భారాన్ని ప్రభుత్వం ఎంతో కాలం మోయలేదన్నారు. పెరిగిన ధరలను వినియోగదారులపైకి బదలాయించక తప్పని పరిస్థితి రావచ్చన్నారు. దేశీయంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ ఇప్పటికే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ద్రవ్యోల్బణంపై యుద్ధం ప్రభావం
భారత్‌లో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 3.48 శాతంగా నమోదయ్యింది. సరఫరా గొలుసులో తలెత్తుతున్న అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం ద్రవ్య పరపతి విధానం సరిపోదని.. ప్రభుత్వ సమన్వయం కూడా అత్యంత కీలకమని మల్హోత్రా పేర్కొన్నారు.
జూన్ 5న ఆర్‌బిఐ సమీక్ష
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. వడ్డీ రేట్లను ప్రస్తుతం 5.25 శాతంగా కొనసాగిస్తున్నప్పటికీ.. జూన్ 5న జరగనున్న తదుపరి పరపతి సమీక్షా సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, మారుతున్న గణాంకాలను బట్టి ఆర్‌బిఐ తన తదుపరి కార్యాచరణను రూపొందిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. యుద్ధ ప్రభావం తాత్కాలికంగా ఉంటే పర్వాలేదు కానీ అది ఆర్థిక వ్యవస్థలో పాతుకుపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
పెట్రో బాంబ్ తప్పకపోవచ్చు..!
- Advertisement -
- Advertisement -



