– కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
– రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్ నిజామాబాద్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టు…రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. ప్రతి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, కేవలం 16 మంది మాత్రమే జిల్లా జట్టుకు ఎంపికవుతారని, అటువంటి ప్రతిభావంతులు ఇక్కడికి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈనెల 21 నుండి 23 వరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ అండర్-17 బాలబాలికల టోర్నమెంట్ లో విజేతలుగా నిజామాబాద్ జట్లు నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుకు 60 శాతం, క్రీడలకు 40 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా క్రీడల వల్లే వస్తుందన్నారు. ఓటమి గెలుపులు సమానమని, ఓడినవారు కుంగిపోకుండా గెలిచినవారు పొంగి పోకుండా క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు.కమ్మర్ పల్లిలో రాష్ట్రస్థాయి క్రీడలు, జాతీయ స్థాయి సెలక్షన్స్ నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. మునుముందు జాతీయ క్రీడలని నిర్వహిస్తామని, అందుకు మా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎన్.వి హనుమంత్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతోని ఆడాలని, నెగిటివ్ థాట్స్ ఉండకుండా మంచి ఆలోచనలతోనే ముందుకు వెళితే కచ్చితంగా విజయం వరిస్తుందన్నారు.క్రీడలు అంటే ఓటమి గెలుపులు సమానమని, సక్సెస్ అంటే చదువు ఆటలు సమానంగా ఉండాలన్నారు. ఎదురు దెబ్బలు తగిలితే వాటిని తట్టుకునే శక్తి క్రీడల ద్వారా వస్తుందని తెలిపారు.ఆటల ద్వారా శారీరిక, మానసిక స్థైర్యం వస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలు ఆడేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి, ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, స్టేట్ అబ్జర్వర్స్ నాగరాజు, వీరేశం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగ భూషణం, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎం.సుజాత, చిప్ప నవీన్, వ్యాయమ ఉపాధ్యాయులు రమేష్, స్వప్న, దేవ సుకన్య, వీణ, జోష్ణ, నరేష్, అనికేత్, ప్రీతి, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు విక్రమ్, సీనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాకారుడు రాహుల్, తదితరులు పాల్గొన్నారు.



