Friday, January 23, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ సొమ్ముకు భారీ గండి కొడుతున్న కాంట్రాక్టర్ 

ప్రభుత్వ సొమ్ముకు భారీ గండి కొడుతున్న కాంట్రాక్టర్ 

- Advertisement -

ఎటువంటి అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం 
సొమ్ము ప్రభుత్వానిది – సోకు కాంట్రాక్టర్ ది..
అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్ము దోపిడి 
చోద్యం చూస్తున్న మండలాధికారులు 
సీపీఐ(ఎం) చొప్పట్లపాలెం శాఖా కార్యదర్శులు
చలమల అజయ్ కుమార్, బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ నిర్వాహకం సొమ్ము ప్రభుత్వానిది, సోకు మాత్రం కాంట్రాక్టర్ ది కావటం విశేషం. ప్రభుత్వ సొమ్ముకు ఓ కాంట్రాక్టర్ లక్షల్లో గండి కొడుతున్నాడు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్ము దోసుకుంటున్నారని విషయం తెలిసి కూడా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవటం మరో విశేషం. స్థానిక ప్రజా ప్రతినిధులు మండలాధికారులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు, స్పందిస్తూ స్పందిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) నాయకులు మండల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నా మైనింగ్, మండల రెవిన్యూ అధికారులు చోద్యం చూడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు.

ఈ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు ప్రారంభం నుంచి అనేక అవకతవకలకు పాల్పడుతూనే ఉన్నాడని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం మరో విశేషం. ఈ సంఘటన ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో కాదు, సాక్షాత్తు జిల్లాలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన బోనకల్లు మండల పరిధిలో ఈ సంఘటన కావటం విశేషం. మండల పరిధిలోని సీపీఐ(ఎం) చొప్పకట్లపాలెం గ్రామ కమిటీ కన్వీనర్ చలమల అజయ్ కుమార్, శాఖా కార్యదర్శులు బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం నుంచి చింతకాని మండల పరిధిలోనే నాగులవంచ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం నుంచి సదరు కాంట్రాక్టర్ రైతులకు తీవ్ర నష్టం కలిగించే విధంగానే వ్యవహరిస్తూ అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ తీరుపై మండల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని తెలిపారు. సుమారు ఈ  బీటీ రోడ్డు విస్తరణ పనులకు గాను ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు.

ఈ ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు విస్తరణ పనులు గత కొన్ని నెలలుగా సాగుతున్నాయి. ఇటీవల బీటీ వేశారు. బీటీ వేసిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఎర్ర మట్టి తోలవలసి ఉంది. మంజూరైన నిధులనుంచే సదరు కాంట్రాక్టర్ ఎర్రమట్టి బీటి రోడ్డుకు ఇరువైపులా తోలవలసి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ మంజూరైన నిధుల నుంచి కాకుండా తన తెలివితేటలను అధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ భూమిపై కన్నివేశాడు. చొప్పకట్లపాలెం రెవెన్యూ పరిధిలోనే సర్వేనెంబర్ 222లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి నుంచి ఎర్రమట్టి తోలాలంటే మైనింగ్ అధికారుల, మండల రెవెన్యూ అధికారుల అనుమతి కచ్చితంగా తీసుకోవలసి ఉంది. బీటీ రోడ్డుకు ప్రభుత్వ భూమి నుంచి ఎట్టి పరిస్థితులలోనూ ఎర్రమట్టితోలే అధికారం కాంట్రాక్టర్లకు లేదు. అయినా సదరు కాంట్రాక్టర్ అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎర్రమట్టి తోలుతున్నాడు. పైగా కనీసం ఎటువంటి అనుమతులు ఏమి తీసుకోకుండానే అక్రమంగా ప్రభుత్వ స్థలములో ప్రోక్లైన్ పెట్టి గత రెండు రోజులుగా బీటి రోడ్డుకు రెండు వైపుల ఈ ఎర్ర మట్టి తోలుతున్నాడు.

ప్రభుత్వ భూమి నుంచి సదర కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తోలుతున్నాడని తాము మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయం తెలిసి చొప్పకట్లపాలెం ఉపసర్పంచ్ పల్లా కొండలరావు, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి బోయినపల్లి పున్నయ్య సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. ఆ వెంటనే మండల అధికారులకు చొప్పకట్లపాలెం జిపిఓ కృష్ణమూర్తికి వారు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో జిపిఓ కృష్ణమూర్తి స్పందించి సంఘటన స్థలానికి వచ్చినట్లు తెలిపారు. జిపిఓ వచ్చేసరికి ప్రభుత్వ భూమిలో విలువైన ఎర్రమట్టి తోలుతున్న సంఘటన ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. అయినా జిపిఓ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రోక్లైన్ వదిలేసి వచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ అక్రమంగా కొల్లగొడుతుంటే సంఘటనా స్థలానికి వచ్చి కూడా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ కు అనుకూలంగా వ్యవహరించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ కాంట్రాక్టర్ కు ప్రభుత్వ అధికారులకు ఉన్న సంబంధం ఏమిటో బహిర్గతం చేయాలని వారి డిమాండ్ చేశారు. రోడ్డుకు మంజూరు చేయవలసిన నిధులనుంచే అతను ఎర్రమట్టి తోలవలసి ఉన్న విషయం అధికారులకు తెలుసునని, కానీ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి నుంచి మట్టి తోలుతుంటే చర్యలు ఎందుకు తీసుకోకుండా ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలని అధికారులను వారు డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్న సదర్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్న తీరు తమకు తీవ్ర అభ్యంతరకరమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మాణ పనులు చేయాలని అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -