మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ శివారులోని పంట పొలాల మధ్యలో సుమారుగా 60 ఏళ్ళ క్రితం వెలిసిన సమ్మక్క-సారలమ్మ జాతర వేలాయింది. మేడారం మహజాతర నేపథ్యంలో ఈ నెల 28 నుంచే దుబ్బపేట జాతర ప్రారంభం కానుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరకు అధికారులు, పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నమ్మిన భక్తులకు కొంగుబంగారమవునని సందర్శకుల ప్రగాఢ నమ్మకం. పొలాల మధ్యలో మిని మేడారం దుబ్బపేట వద్ద మినీ జాతర ఎంతో వైభవంగా కొనసాగుతోంది.
ఈ జాతరకు తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, భూపాలపల్లి, మంథని నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం దేవాదాయశాఖ ఎండోమెంట్ ద్వారా రూ.1.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీని జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, నీడ కోసం టెంట్లు, గద్దెలను కలర్లు, విద్యుత్ వెలుగులు, ట్రాక్టర్ ద్వారా చెత్త, చెదారం తొలగింపు, దేవతామూర్తులకు రేకుల షెడ్డు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పనులు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ రవిందర్ నాయక్, ఆలయ చైర్మన్ కోట లక్ష్మయ్య తెలుపుతున్నారు.



