Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంనీట్‌ ‌ప్రశ్నాపత్రం దొంగలు.. బీజేపీ యువనేతలే

నీట్‌ ‌ప్రశ్నాపత్రం దొంగలు.. బీజేపీ యువనేతలే

- Advertisement -
  • రాజస్థాన్‌‌లో బిజెవైఎం నేత దినేష్‌ బిన్వాల్‌ అరెస్టు
  • ప్రధాన ముద్దాయి నుంచి రూ.15 లక్షలకు కొనుగోలు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంలోకి నెట్టేసిన నీట్‌ ‌యుజిసి ప్రశ్నాపత్రం కుంభకోణంలో బీజేపీ నేతల పాత్ర బయటపడుతోంది. ఈ కేసులో రాజస్థాన్‌‌లోని సికార్‌ ‌ప్రాంతానికి చెందిన బీజేపీ యువజన మోర్చా నాయకుడు దినేష్‌ ‌బిన్వాల్‌ అరెస్టు ‌అయ్యారు. ఇతడికి రాష్ట్ర బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని, భారతీయ జనతా యువ మోర్చా (బీజెవైఎం)తో అతను క్రియాశీలక నేతగా ఉన్నారని రాజస్థాన్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, శ్రద్ధాపుర్‌ ఎమ్మెల్యే అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ‘నీట్‌ ‌పేపర్‌‌ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుడు దినేష్‌ ‌బిన్వాల్‌ ‌బిజెపి యువనేత. అందుకేనా రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌‌ను దాచిపెట్టడానికి ప్రయత్నించింది? అందుకేనా ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదు చేయంది? బీజేపీ ప్రభుత్వం ఎందుకని ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయడం లేదంటూ తాము ఈ నెల 11 నుంచి ప్రశ్నిస్తూనేవున్నాం. బీజేపీ ప్రభుత్వ మౌనం వెనుక రహస్యం దినేష్‌ బిన్వాల్‌ అరెస్టుతో బహిర్గతం అయ్యింది.’ అని గెహ్లాట్‌ ‌పేర్కొన్నారు. జైపూర్‌ ‌గ్రామీణ ప్రాంతంలో బిజెవైఎం జిల్లా కార్యదర్శిగా నిందితుడు దినేష్‌‌ చిత్రంతో వెలిసిన ఫోటోలను, అలాగే రాష్ట్ర మంత్రి రాజ్యవర్ధన్‌ ‌రాథోడ్‌‌తో వివిధ సందర్భాల్లో సన్నిహితంగా దిగిన చిత్రాలు ఇప్పుడు నెట్‌‌లో వైరల్‌‌గా మారాయి.

అయితే దినేష్‌ ‌బిన్వాల్‌‌కు పార్టీలో ఎలాంటి పదవి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దధిచ్‌ ప్రకటించారు. కానీ బీజేపీతో అతడికి ఉన్న సంబంధాలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం.

దినేష్‌ ‌బిన్వాల్‌ ‌నేపథ్యం ఇదీ !

ఇంటర్నెట్‌‌లో అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం.. జైపూర్‌‌లోని జమ్వరమ్‌‌గఢ్‌‌కు చెందిన బిన్వాల్‌.. ‌సికార్‌, జైపూర్‌ గ్రామీణ (జమ్వరమ్‌‌గఢ్‌‌తో సహా), అల్వార్‌ ‌తదితర ప్రాంతాల్లో అతను బిజైవైఎంలో చురుకుగా వ్యవహరిస్తుంటారు. బిజెపి పెద్దలు ఆయా ప్రాంతాల పర్యటనకు విచ్చేసినప్పుడు భారీ హోర్డింగ్‌‌లు, ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినట్లు చిత్రాలు నెట్‌‌లో వైరల్‌ అవుతున్నాయి. పోలీసులు బిన్వాల్‌‌తో పాటు అతడి సోదరుడినిక కూడా అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తమ పిల్లలు నిర్ధోషులు అని, దీనికెనుక వేరే పెద్దలుంటారని, వీరినే కావాలని ఇరికించారంటూ వారు వాపోయారు. దినేష్‌ ‌స్థానిక ఎమ్మెల్యేకు మంచి స్నేహితుడని ఆయన తల్లి ప్రభు దేవి తెలిపారు. ఆయన భార్య రజనీ మాట్లాడుతూ తన భర్త ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేరని, కుమారుడి నీట్‌ ‌పరీక్షల సన్నాహాల కోసం తాను ఇప్పుడు సికార్‌‌లో ఉన్నానని, ఈ కేసులో తన కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె తెలిపారు.

కాగా నీట్ యూజీ-2026 పరీక్ష పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించిన కేసులో సిబిఐ బుధవారం ఐదుగురు నిందితులను అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నిర్వహించిన నీట్ (యూజీ) 2026 పరీక్షను పేపర్ లీక్ ఆరోపణలతో మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్ కేసును రాజస్థాన్ పోలీసులకు చెందిన ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఒజి) దర్యాప్తు చేస్తున్నా ప్రతిపక్షాల నుంచి సమగ్ర దర్యాప్తునకు డిమాండ్‌ ‌పెరగడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఎస్‌ఒజి 150 మంది పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకోగా..వారిలో 20 మందిని విచారణ నిమిత్తం మంగళవారం రాత్రి సిబిఐకి అప్పగించారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు దినేష్‌ ‌సహా మరో ఐదుగురిని సిబిఐ అరెస్టు చేసింది.

కాగా ఈ వ్యహారంలో మహారాష్ట్రలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను చాలాసేపు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులకు అప్పగించారు. అయితే పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పేపర్‌ లీక్‌ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కార్యాలయం వెలుపల పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ప్రశ్నాప్రతం చేతులు మారిందిలా..

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణెకు చెందిన ఓ వ్యక్తి నుంచి నాశిక్‌కు చెందిన శుభం ఖైర్నార్‌ రూ.10 లక్షలు పెట్టి ప్రశ్నాపత్రం కాపీని కొన్నట్లు తెలిపారు. ఆ కాపీని రూ.15 లక్షలకు హరియాణా వాసికి శుభం అమ్ముకున్నాడు. అనంతరం పేపర్‌ సెట్‌లు హరియాణా, రాజస్థాన్‌లోని పెద్ద కోచింగ్‌ సెంటర్లతో పాటు జమ్మూకశ్మీర్‌, బిహార్‌, కేరళకు కూడా వెళ్లినట్లు తెలుసుకున్నారు. వీటిని ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా అమ్మినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు ప్రధాన నిందితుడి నుంచి ప్రశ్నాపత్రాన్ని బిజెవైఎం నేత దినేష్‌ ‌బిన్వాల్‌ ‌రూ.15 లక్షలకు కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -