”సంకల్పం గట్టిదయితే కొండలు కూడా పిండిగా మారిపోతాయి” అన్న మాటను అక్షరాల నిజంచేసే మహోన్నతులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో నిజాయితీ, నిబద్ధత, సంకల్పసిద్ధి అనే శ్వాసగా జీవించిన ప్రజా నాయకుడు, వెనుకబడిన వర్గాల ఉద్యమ నాయకుడు, అత్యంత ప్రభావిత వ్యక్తి కర్పూరీ ఠాకూర్. ఎందరో ఉద్యను ముఖ్య మంత్రులకు, ఉద్యమకారులకు స్పూర్తి ప్రదాతగా నిలిచారు. ఎందరితో సమయం, అవకాశం వచ్చినా చేయని పనిని దొరికిన ఆ కొంచెం అవకాశాన్నే జనం మేలుకోసం ఉపయోగించాడు. అనుకున్నది సాధించి ఎందరో ఉద్యమకారులకు దారిదీపమయ్యాడు. మాకూ ఉన్నది పాలించే ప్రతిభ అని నిరూపించాడు. తనకు దక్కిన మూడేండ్ల ముఖ్యమంత్రి రెండుదఫాల అవకాశాన్ని క్షణం కూడా వృథా పోనివ్వకుండా కాలంపై స్వారీచేసి అనుకున్నది సాధించాడు.
కర్పూరీ ఠాకూర్ బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిలా పతాంజి గ్రామంలో 1924 జనవరి 24న నాయీబ్రాహ్మణ కులంలో జన్మించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమం రగిలించిన వేడి భారతీయ వెనుకబడిన తరగతుల, కులాల చైతన్యానికి రాజ్యాధికారానికి ఇందనంగా పనిచేసింది. ఆ ఆశయమే అతన్ని 1970-71, 1977-79 మధ్య కాలాల్లో బీహార్ రాష్ట్ర ముఖ్య మంత్రిని చేసింది. భారత రాజ్యాంగం, అంబేద్కర్ స్ఫూర్తితో తాను ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి చూయించాడు. తాను ముఖ్యమంత్రిగా కేవలం తక్కువే కాలమే అధికారంలో ఉన్నప్పటికీ ముంగేరి రాత కమిషన్ చూయించిన విధంగా బీసీ రిజర్వేషన్ పూర్తి కోటాను దేశంలో మొట్టమొదట తమ రాష్ట్రంలో అమలు చేసి చూపించాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాడు. పదవ తరగతిలో అవసరం లేని ఆంగ్లభాషను రద్దు చేశాడు. రైతులకు మేలుచేయని పన్నులను రద్దుచేసి రైతు బాంధవుడు అనిపించుకున్నాడు. ఇన్నిగొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ప్రజల మనిషికి ‘జననాయక్’ అనే బిరుదు ఇచ్చి గౌరవించారు.సొంత ఇల్లులేని నిస్వార్థజీవి, తాను అత్యున్నత పదవులు చేపట్టినా తన కుటుంబాన్ని, కులాన్ని ఏనాడు చిన్నచూపు చూడని, నిర్లక్ష్యం చేయని నిరాడంబర జీవి. దేశంలో ఆయన తర్వాత ఉద్యమనాయకులైన లాలూ ప్రసాద్‌యాదవ్, మూలాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ తదితరులకు సిద్ధాంత భూమిక అందించిన గొప్ప ఉద్యమకారుడు. కర్పూరీ ఠాకూర్ నిజాయితీ, నిస్వార్థ సేవకు భారత ప్రభుత్వం 2024లకు గాను ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు ప్రదానం చేసింది. ఒక్క పదేళ్లు అతనికి కాలం అవకాశమిస్తే భారతదేశ బడుగు బలహీన వర్గాలం జీవితాల రూపరేఖలు మారిపోయేవి. 1988లో ఆయన మరణించినా ఇప్పటికీ ఇతని ఉద్యమ బీజం దేశమంతా శాఖోపశాఖలుగా విస్తరించింది. వెనుకబడిన తరగతుల ఉద్యమ వృక్షానికి తల్లివేరులాంటి వాడు కర్పూరీ ఠాకూర్.
డా|| ఉదారి నారాయణ
9441413666
‘జన నాయక్’ కర్పూరీ ఠాకూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



