జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దేశమంతటా త్రివర్ణ పతాకం రెప రెపలాడుతుంది. రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగుతాయి.అయితే ఇది మొక్కుబడి కార్యక్రమం కాకూడదు. రాజ్యాంగ లక్ష్యాలు సాధించగలగాలి. భావి పౌరులకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించగలగాలి. కానీ, ఆచరణ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. భారతదేశం ఒక సామాజిక సమ్మేళనం. దేశ ప్రజల ఆశయాలు, ఆశలు ప్రతిబింబించే విధంగా రాజ్యాంగ రచన జరిగింది. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం అనేది ప్రతి దేశంలో అత్యున్నత చట్టం. దీని ద్వారానే అన్ని వ్యవస్థలు ఏర్పడతాయి. అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలకు సైతం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు లభిస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని దేశ భవిష్యత్ విధాతగా పేర్కొంటారు. రాజ్యాంగం ఈ దేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా నిర్మించాలని చెప్పింది. అలాగే దేశ ప్రజలకు సామాజిక ,ఆర్థిక రాజకీయ న్యాయం కల్పిస్తామని ప్రకటించింది. ఆదేశిక సూత్రాలలో అందరికీ విద్య, ఆరోగ్యంతో పాటు మత్తు పదార్థాలు, మద్య నిషేధం వంటి అంశాలు రాజ్యాంగంలో పెద్దలు చేర్చారు. సహజ వనరులు, సంపద ప్రజలందరికీ చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా శ్రేయో రాజ్యస్థాపన జరగాలని నొక్కి చెప్పింది.
అయితే 75 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగిచూస్తే ఆచరణలో పై సంక్షేమం ఏది ప్రజలకు దక్కలేదు. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆదర్శాలకు- భౌతిక వాస్తవికతకు మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. భౌతిక వాస్తవికతను మార్చకుండా ఆదర్శాలు ఆచరణకు నోచుకోవు. ప్రస్తుతం దేశంలో పౌర రాజకీయ హక్కులను రాజ్యాంగ బద్దంగా, చట్టబద్ధంగానే హరించి వేస్తున్న సందర్భాలు నేడు నిత్యం జరుగుతున్నాయి. ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛను, ప్రాణాన్ని చట్టరీత్యా తప్ప ఇతర పద్ధతుల్లో తీసివేయడానికి వీలులేదు. కానీ ఆచరణ చూస్తే స్టాన్ స్వామి, ప్రొఫెసర్ సాయిబాబా వికలాంగుడు. ఉపా చట్టం కింద తొమ్మిదేండ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. చివరకు నిర్దోషిగా విడుదలై కొంతకాలానికి అనారోగ్యంతో చనిపోయాడు. నేడు చేయని నేరానికి శిక్ష అనుభిస్తున్నవారు చాలామందే ఉన్నారు. నేడు ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, మావోయిస్టులను కాల్చి చంపుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాణ రక్షణ హక్కు(ఆర్టికల్ 21) ఎక్కడ అమలవుతుంది? మరోవైపు నేరస్తులంతా స్వేచ్ఛగా తప్పించుకొని తిరుగుతున్న సందర్భాలు, ఉదాహరణలు అనేకం.ఉన్నావ్ బాలికపై లైంగికదాడి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు శిక్షపడినా, సరైన సాక్ష్యాధారాలు లేవని విడుదల చేస్తారు. ఇదేమి న్యాయం? అంటే చట్టం ముందు అందరూ సమానం కాదన్నమాట.
అలాగే ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రాలలో శాంతిభద్రతలు కాపాడటానికి కేంద్రం పారా మిలటరీ సైనిక బలగాలను మోహరింప చేయటానికి అవకాశం ఇస్తుంది. ఇవాళ ప్రత్యేకించి కాశ్మీర్, మణిపూర్ ఇతర ఈశాన్య భారతంలోని సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా అక్కడ ప్రజల హక్కులను ఎలా కాలరాస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇది కాంగ్రెస్ హయాం నుంచే మొదలైంది. 1975లో ఇందిరాగాంధీని రాజ్యాంగబద్ధంగానే, ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించింది, హక్కులను హరించింది. అందుకే, రాజ్యాంగాన్ని పాలకులు పావుగా వాడుకోకూడదు. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజ్యం వారి హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేేదు. కానీ, నేడు దేశంలో దశాబ్దకాలంగా నిత్యం ఉల్లంఘనలే జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే చర్యలు వేగంగా అమలవుతున్నాయి. దీనికి రాజ్యాంగాన్ని తప్పుపట్టడం కాదు, దాన్ని చేతుల్లోకి తీసుకుని, స్వతంత్రతకు భంగం కలిగించే పాలన ఏమాత్రం దేశానికి ఆమోదయోగ్యం కాదు.
ఇంకా లోతుల్లోకి వెళ్లి చూస్తే 1963-64లో సజ్జన్ సింగ్ -గోలక్‌నాథ్ కేసులో రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అదే 1973లో కేశవనంద భారతి కేసులో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు గాని, దాని మౌలిక స్వరూపాన్ని మార్చరాదని తీర్పుచెప్పింది. అలాగే ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు నిలుపుదల చేశాడు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించాడు. దీంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, న్యాయస్థానం చివరకు ఏం చేసింది? గవర్నర్, రాష్ట్రపతులకు బిల్లులు నిలుపుదల చేసే అధికారం లేదని, మూడు నెలల్లోగా నిర్ణయం తెలియజేయాలని గత ఏప్రిల్ 8న న్యాయమూర్తులు జె.బి పార్థివాల, ఆర్ .మహాదేవన్‌లతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి రివ్యూ పిటిషన్ వేయగా, ప్రధాన న్యాయమూర్తి గవారుతో కూడిన బెంచ్ ఇలా గడువు విధించటం రాజ్యాంగ సమ్మతం కాదని తీర్పు చెప్పింది.
”కర్ర విరగకుండా, పాము చావకుండా” ఉన్నట్టుంది తీర్పు. అంటే, ఇది పాలనా వ్యవస్థల మధ్య ఒక రాజీలాంటిది.ఈ కేసులు రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడి చట్టాలకు అనేక లొసుగులు ఉన్నాయి. వీటిలో ఏనుగులు సైతం దూరి వెళ్లిపోతాయి. అనేక నేరాలు చేసిన డేరాబాబా లాంటివారు పెరోల్‌పై అనేకసార్లు జైలు నుంచి బయటకు వస్తూ పోతూ ఉంటారు. జైలువారికి ఒక గెస్ట్‌హౌస్ లాంటిది. అదే ఉమర్ ఖాలీద్ లాంటి హక్కుల కార్యకర్తలు కనీసం విచారణకు కూడా నోచుకోకుండా, బెయిల్ కూడా దక్కకుండా అనేక సంవత్సరాలు తరబడి జైల్లో మగ్గిపోతు ఉంటారు. ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలోని ఈ వైరుధ్యాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయకపోతే, ప్రజలు తిరుగుబాటు చేస్తారని అంబేద్కర్ చాలా స్పష్టంగా ప్రకటించాడు.
”26 జనవరి 1950న మనం వైరుధ్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయరంగంలో సమానత్వం ఉన్నప్పటికీ ,సామాజిక ఆర్థిక రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ప్రతిఒక్కరికి ఓటు హక్కు ఉంది, ఒక విలువగా గుర్తించబడింది. కానీ సామాజిక ఆర్థిక రంగాలలో ఆ విలువ గుర్తించబడలేదు.ఈ వైరుధ్యాన్ని మనం ఎంతకాలం కొనసాగించగలం? సామాజిక ఆర్థిక జీవితంలో సమానత్వం లేకుండా ఎంతకాలం ఉండగలం? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎంత తొందరగా ఈ వైరుధ్యాన్ని రూపుమాపగలిగితే అంతమంచిది. అలా కాకపోతే అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితేఈ రాజ్యాంగ సభ రూపొందించిందో దాన్ని బద్దలు కొడతారు” అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించాడు. ఏదైనా రాజ్యాంగ పునాదులు కదులుతున్నాయి. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదనేది వాస్తవం. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని, వీలైతే మనుస్మృతి ని రాజ్యాంగంగా మలచాలని పావులు కదుపుతూ ఉంది. ఈ సమయంలో రాజ్యాంగాన్ని యధాతధంగా అమలు చేసేవిధంగా ప్రజలు చైతన్యం పొంది, పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి.
షేక్ కరీముల్లా
9705450705



