మోడీని ప్రశ్నిస్తున్న కేరళ నెటిజన్లు
‘కేరళ ఆస్క్ మోడీ’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్
తిరువనంతపురం : ప్రధాని మోడీ తిరువనంతపురం పర్యటన సందర్భంగా.. కేరళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ వాటా గణనీయంగా తగ్గడంపై నెటిజన్లు సూటి ప్రశ్నలు సంధించారు. ‘కేరళ ఆస్క్ మోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఐదేండ్ల వరకు.. కేరళ తన మొత్తం ఆదాయంలో 55 శాతాన్ని స్వయంగా సమకూర్చుకోగా, మిగిలిన 45 శాతం కేంద్రం నుంచి వచ్చేది. కానీ ఇపుడు రాష్ట్రం తన ఆదాయంలో 70 శాతాన్ని స్వయంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. కేంద్ర వాటా 30 శాతానికి తగ్గింది. దీనితో పోలిస్తే, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయంలో 50-70 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతున్నాయి. ఈ తగ్గింపునకు 15వ ఆర్థిక సంఘం ఉపయోగించిన జనాభా ఆధారిత కేటాయింపుల సూత్రమే కారణం. ఇది 2011 జనాభా లెక్కలను ఆధార సంవత్సరంగా తీసుకుంది. ఈ విధానం కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలకు నష్టం కలిగించిందని, అయితే ఉత్తరప్రదేశ్ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు వాటా పెరిగిందని విమర్శకులు వాదిస్తున్నారు. 10వ ఆర్థిక సంఘం సమయంలో కేరళ పన్ను వాటా 3.8 శాతంగా ఉండగా, 14వ ఆర్థిక సంఘంలో 2.5 శాతానికి, 15వ ఆర్థిక సంఘంలో 1.92 శాతానికి తగ్గింది.
అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ వాటా 17.8 శాతం నుంచి 19.9 శాతానికి పెరిగింది. గత దశాబ్దకాలంలో.. కేరళ తన పన్ను వాటాలో సుమారు రూ.1.66 లక్షల కోట్ల కొరతను ఎదుర్కొంది. భారతదేశ మొత్తం జనాభాలో 2.8 శాతం జనాభా ఉన్నప్పటికీ, రాష్ట్రం పంపిణీ చేయదగిన నిధిలో కేవలం 1.9 శాతం మాత్రమే పొందుతోంది. కేంద్ర సెస్సులు, సర్‌చార్జీల వినియోగం పెరగడాన్ని కూడా నెటిజన్లు హైలైట్ చేశారు. వీటిని రాష్ట్రాలతో పంచుకోకపోవడం వల్ల కేరళ కేటాయింపులు తగ్గుతున్నాయి. అంతేకాకుండా, జాతీయ రహదారుల (ఎన్హెచ్ఏఐ) కోసం భూసేకరణకు కేరళ ప్రత్యేకంగా రూ. 6,000 కోట్ల భారాన్ని భరించింది, ఈ వ్యయాన్ని ఇతర రాష్ట్రాలలో ఎన్హెచ్ఏఐ పూర్తిగా భరిస్తుంది. ప్రభుత్వ రుణాల విషయానికొస్తే.. కేరళ అప్పులు జీడీపీలో 33.8 శాతంగా ఉన్నాయి. అయితే కేంద్రం అప్పులు 56.1 శాతంగా ఉన్నాయి. ఇది ఆర్థిక విషయాలలో తప్పుడు చిత్రణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేరళ జనాభా నిష్పత్తి, జాతీయ అభివృద్ధికి దాని సహకారం, కేంద్ర పథకాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, కేరళ ఎందుకు ఇటువంటి ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటోందో..? మోడీ వివరించాలని కేరళ నెటిజన్లు కోరుతున్నారు.
కేంద్రం కోతలు.. కీలక పథకాలపై ప్రభావం
కేంద్ర నిధులలో కోతలు కీలక పథకాలపై కూడా ప్రభావం చూపాయి. గతంలో 100 శాతం కేంద్ర నిధులు పొందిన 18 కార్యక్రమాలలో వాటా 60శాతానికి తగ్గింది. రెండు పథకాల నిధులు 50 శాతా నికి పడిపోయాయి. గతంలో 90:10 నిష్పత్తిలో ఉన్న మూడు పథకాలకు ఇప్పుడు 40 శాతం రాష్ట్ర వాటా అవసరం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే, ఐదు పథకాల నిధులలో మార్పులు జరిగాయి . పది పథకాలను ఉపసంహరించుకున్నారు. ప్రధానంగా ప్రభావితమైన పథకాలలో ఇవి ఉన్నాయి.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) : 100 శాతం నుంచి 60:40 కేంద్ర నిధుల కేటాయింపునకు మార్పు
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) : కేంద్ర వాటా 60 శాతం
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), ఇతర ఆరోగ్య పథకాలు : 60:40
సర్వ శిక్షా అభియాన్ , విద్యా పథకాలు: కేంద్ర వాటా 60 శాతం
సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్): కేంద్ర వాటా 60 శాతం
కేంద్ర పథకాలలో రాష్ట్ర వాటా 2015-16లో మొత్తం దేశీయ రాబడిలో 0.66 శాతం నుంచి 2021-22లో 0.43శాతానికి స్థిరంగా పడిపోయింది. 2014-2024 మధ్య, కేరళకు కేంద్ర పథకాల ద్వారా సుమారు రూ. 50,000 కోట్లు అందగా, అందులో కేవలం 30,000 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి. ఈ లెక్కన రూ.20 వేల కోట్లకు మోడీ సర్కార్ కోతపెట్టింది.



