Saturday, January 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసంస్థాన్‌లో 'మద్యం' రగడ

సంస్థాన్‌లో ‘మద్యం’ రగడ

- Advertisement -

మద్యం షాపులు మూయించిన ఎమ్మెల్యే అనుచరులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్‌ యజమానులు
పోలీసుల బందోబస్తుతో తెరిపించిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు


నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
నల్లగొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో మద్యం దుకాణాల సమయపాలనపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఆదేశాలు అమలు పరచాల్సిందే అంటూ ఆయన అనుచరులు వాటిని బంద్‌ చేశారు. రెండ్రోజుల నుంచి మద్యం షాపులను బంద్‌ చేయిస్తున్నారు. ‘పార్టీ, గీర్టి జాంతానై రాజన్న ఆదేశించిండు.. అంతే అమలుపరుస్తాం’ అనే చందంగా ఆయన అనుచరులు చర్చ చేశారు. దుకాణాదారుల ఫిర్యాదుతో ఎక్సైజ్‌ అధికారులు వాటిని తెరిపించారు. మునుగోడు నియోజకవర్గం సంస్థాన్‌ నారాయణపురం లో కొన్ని రోజులుగా మద్యం షాపు యజమానులకు, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అనుచరులకు మధ్య గొడవ జరుగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించిన విధంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వైన్స్‌ షాపులు తెరవాలని, సాయంత్రం ఆరు గంటల నుంచి మాత్రమే సిట్టింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు మద్యం షాపులను దౌర్జన్యంగా మూసేశారు.

దాంతో నిర్వాహకులు ఎక్సైజ్‌ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్యే అనుచరులపై వైన్స్‌ షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శక్రవారం ఎక్సైజ్‌ అధికారుల తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది రంగంలోకి దిగింది. షాపులకు రక్షణ కల్పిస్తూ ఉదయం 10 గంటలకు తెరిపించారు. ఎమ్మెల్యే అనుచరులు మధ్యాహ్నం 12 గంటలకు వైన్స్‌ షాపుల వద్దకు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షాపులు మూసేయాలన్నారు. ఎంతకాలం షాపులకు సెక్యూరిటీ ఇస్తారని అధికారులను నిలదీశారు. వినకపోతే గ్రామసభల ద్వారా గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో మద్యం షాపులు నిర్వహించాలని తీర్మానం చేస్తామని, మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపడతామని బెదిరించారు. రేపటి నుంచి ఒంటిగంటకు ముందే షాపులు తెరిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని వార్నింగ్‌ ఇచ్చారు.

నష్టాల పాలవుతున్నాం : షాపు యజమానులు
ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మేము నష్టాలపాలవుతాం. దాంతోపాటు ఎక్సైజ్‌ అధికారులతో ఇబ్బందులు తప్పడం లేదు. మేము బలవంతంగా ఎవరినీ తాగమని చెప్పడం లేదు. కొద్ది మంది మాత్రమే ఒంటిగంటలోపు మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒంటిగంట తర్వాతే షాపులకు వస్తున్నారు. అధికారుల నుంచి మాకు ఇబ్బందులు కలిగించొద్దు. నాయకులు అర్థం చేసుకోవాలి.

ప్రభుత్వ పాలసీని అమలు చేస్తాం
ప్రభుత్వ పాలసీనే అమలు చేస్తాం. ఎవరైనా దౌర్జన్యా లు, దాడులకు పాల్పడితే ఉన్నతాధికారుల సూచన మేరకు చట్టపర మైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి పొందిన షాపు యజమానులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. పై అధికారుల ఆదేశాల మేరకే రక్షణ కోసం ఇక్కడికి వచ్చాం. మా విధులు నిర్వహిస్తున్నాం. ఆటంకాలు కల్పిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. -బాలాజీ నాయక్‌ ఎక్సైజ్‌ సీఐ రామన్నపేట

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -