కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమయింది. జనాభా లెక్కల తొలిదశలో… గృహగణన కోసం ప్రశ్నావళిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రూపొందించింది. శుక్రవారం 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్‌ను శాఖ విడుదల చేసింది. ఇంటి వివరాలతో పాటు ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం, వాహన వినియోగం వంటి వివరాలు కూడా సేకరించాలని సూచించింది. కుటుంబంలో ఎవరెవరు ఏయే పనిచేస్తున్నారో స్పష్టమైన వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఏ విధమైన మరుగుదొడ్డి ఉంది.. స్నానాల కోసం ఏ తరహా బాత్‌రూం ఉపయోగిస్తున్నారు.. వంట గ్యాస్ కనెక్షన్ వివరాలు రికార్డుల్లో స్పష్టంగా సేకరించాలని అధికారులకు కేంద్రం సూచించింది. ఇంటి యజమాని ఎస్సీ, ఎస్టీ, ఇతర ఏ వర్గానికి చెందిన వారో… వివరాలు తప్పక నమోదు చేయాలని స్పష్టం చేసింది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జనగణనలోనే కులగణన కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన జరగనుంది.



