Saturday, January 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమనుస్మృతి అమలే బీజేపీ లక్ష్యం

మనుస్మృతి అమలే బీజేపీ లక్ష్యం

- Advertisement -

మహిళా హక్కులకు తీవ్ర విఘాతం
వారిపై పెరుగుతున్న హింస
చిన్నపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు
మైనార్టీలపై అదే పనిగా దాడులు
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిందే : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారతదేశంలో మనుస్మృతి అమలే బీజేపీ అసలు లక్ష్యమని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే హెచ్చరించారు. దీనివల్ల దేశంలో మహిళలు సర్వహక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశంలో మహిళలపై హింస పెరిగిపోయిందని చెప్పారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ఐద్వా 14వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆమె శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆమెతో పాటు ఐద్వా జాతీయ అధ్యక్షులు పి.కె.శ్రీమతి టీచర్‌, కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, జాతీయ సహాయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కేంద్ర కమిటీ సభ్యులు షెర్బానీ, రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.అరుణజ్యోతి, సహాయ కార్యదర్శులు కె.ఎన్‌.ఆశాలత, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరియం ధావలే మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో దేశంలో మహిళలపై హింసతో పాటు పిల్లలపై లైంగికదాడులకు సంబంధించిన పోక్సో కేసులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ క్రైమ్‌ బ్యూరో రికార్డు ప్రకారం 2022-24లో పోక్సో కేసులు 90 శాతం పెరిగాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుస్మృతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదనీ, అంటరానితనం, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులర్‌ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

పేదరికం గుర్తింపులోనూ వివక్షే
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రభావం మహిళపై ఎక్కువగా పడుతున్నదని వివరించారు. పేదలుగా గుర్తించేందుకు రోజువారీ, నెలవారీ ఆదాయాన్ని తక్కువగా నిర్ణయించి 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్రం బుకాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం వద్ధి రేటు సాధిస్తే, పేదరికం, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, ఉపాధి దొరకని పరిస్థితులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దేశంలో 80 శాతం మందికిపైగా తమకు కావాల్సిన క్యాలరీల మేరకు పౌష్టికాహారం కొనుగోలు చేసే శక్తిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరిగి ఆదాయం, జీవనోపాధి తగ్గిందని గుర్తుచేశారు. బీజేపీ పలు రంగాల్లో అనుసరిస్తున్న విధానాల దుష్ప్రభావం ప్రజలపై పడుతున్నదనీ, మహిళలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నదని చెప్పారు. వైద్యం ఖరీదుగా మారుతుండటంతో ఇండ్లలో రోగులను చూసుకోవడానికే మహిళలను పరిమితం చేస్తున్నారని తెలిపారు.

అటవీ చట్టాల ఉల్లంఘన
అటవీ హక్కుల చట్టం తదితర చట్టాలను ఉల్లంఘించి అక్కడి సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని చెప్పారు. ఫలితంగా అటవీ ఆధారంగా జీవనం గడుపుతున్న ఆదివాసీ గిరిజన మహిళలు ఉపాధి కోల్పోయి, వలసల బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పనిని హక్కుగా గుర్తించే నరేగా చట్టాన్ని తొలగించడం ద్వారా గ్రామీణ మహిళలు ఉపాధి కోసం వలసలు వెళ్లే అనివార్యతను తెస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారిగా జాతీయ ఆహార భద్రత నిధులు కేటాయించకుండా కేంద్రం చేతులెత్తేసిందన్నారు. పౌష్టికాహార లోపంతో రక్తహీనత కలిగిన వారి సంఖ్య పెరిగిపోతుంటే వారిని కాపాడకుండా, మరింత దుర్మార్గమైన విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు.

హంతకులకు వత్తాసు
ఉత్తరాఖండ్‌లో అంకిత భండారీని చంపిన హంతకులెవరో చెప్పడం లేదని మరియం ధావలే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులోనూ నిందితులుగా బీజేపీ నాయకులే ఉన్నారని గుర్తుచేశారు. బిల్కిస్‌ బానో లైంగిక దాడి కేసులో 11 మంది శిక్షపడ్డ వారిని విడుదల చేస్తే మహిళల పోరాటం తర్వాత జైలుకు పంపించారని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సమాన హక్కులతోనే సమాజానికి మేలు : ఎస్‌.పుణ్యవతి
మహిళల హక్కులే మానవ హక్కులనీ, వారికి సమానంగా హక్కులు దక్కినప్పుడే సమాజం బాగుంటుందని ఐద్వా కోశాధికారి ఎస్‌.పుణ్యవతి తెలిపారు. మహిళలకు అవకాశం వస్తే పురుషులకు ధీటుగా పాలన చేయగలుగుతారనీ, ఐద్వా నాయకుల్లో పలువురు వివిధ హోదాల్లో ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని వ్యతిరేకించాలనీ, నేడు మదురోను ఎత్తుకెళ్లిన ట్రంప్‌ మన వరకు రాకముందే మేల్కోవాలని సూచించారు. స్త్రీలకు స్వాతంత్య్రం కావాలనీ, మనువాద శాసనాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోరాటాల ఫలితంగానే బీజేపీ సూత్రప్రాయంగానైనా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభలో ఆమోదించిందని గుర్తుచేశారు. మరోవైపు మహిళలకున్న ఓటు హక్కును తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదనీ, ఇప్పటికే బీహార్‌లో పెద్ద ఎత్తున తొలగించారని విమర్శించారు. ఓటు హక్కు కావాలంటే పుట్టింటికి వెళ్లి బర్త్‌ సర్టిఫికెట్‌ తేవాలంటూ కొర్రీలు పెడుతూ వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలోని మహిళలందరి సమస్యలపై చర్చిస్తాం : మల్లు లక్ష్మి
దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిల భారత మహాసభల్లో చర్చిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. ఐద్వా పోరాటాల ఫలితంగా ఇప్పటికే మహిళల కోసం అనేక చట్టాలను సాధించామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సాధించిన విజయాలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపైనా సమీక్ష నిర్వహిస్తామన్నారు. మహాసభలకు ఐద్వా జాతీయ నాయకత్వంతో పాటు జాతీయ ప్యాట్రన్‌ బృందాకారత్‌ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికీ మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణింపబడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకిచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేస్తామని తెలిపారు. మహిళల వస్త్రధారణను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌, అశ్లీల చిత్రాలు, పోర్న్‌సైట్లను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

కేరళలో సాధ్యమైతే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు కాదు? : పి.కె.శ్రీమతి టీచర్‌
కేరళలో వామపక్ష ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి టీచర్‌ తెలిపారు. అక్కడ మహిళలపై ఏదైనా నేరం జరిగితే ప్రభుత్వం వెంటనే న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వేల సంఖ్యలో మూతపడుతుంటే, కేరళలో ప్రభుత్వ విద్య ప్రయివేటు కంటే మెరుగ్గా ఉందని తెలిపారు.

నిరుద్యోగ మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నారని తెలిపారు. ఎలాంటి పెన్షన్‌ లేని వారిని గుర్తించి మొత్తం 62 లక్షల మందికి నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయమందుతుందని చెప్పారు. అతి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందని గుర్తుచేశారు. ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో లేకపోవడానికి అక్కడి ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. మహిళలు, దళితులు, మైనార్టీల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లో నన్స్‌పై దాడి చేశారని, మరో చోట దళిత మహిళపై దాడులు చేశారని గుర్తుచేశారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినా అమలు చేసేందుకు బీజేపీ ముందుకు రావడం లేదని ఆక్షేపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -