హాజరవుతున్న అగ్రనేతలు
ధవళవర్ణకాంతులీనుతున్న భాగ్యనగరం
సర్వాంగ సుందరంగా ముస్తాబు
మహిళాభ్యుదయానికి దిశానిర్దేశం చేసేలా జాతీయ మహాసభలు
దేశవ్యాప్తంగా వెయ్యిమంది అతిథులు హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రగతిశీల మహిళాభ్యుదయమే లక్ష్యంగా ‘ఐద్వా’ 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో ప్రారంభమవుతున్నాయి. ఈనెల 25 నుంచి 28 వరకు జరిగే ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అలాగే జిల్లాల్లోనూ మహాసభల స్ఫూర్తిని రగిలించేలా ప్రధాన కూడళ్లలో ధవళవర్ణ ఐద్వా పతాకాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. జాతీయ మహాసభలు జరిగే హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణమండపానికి తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రవేశద్వారాన్ని చారిత్రక వారసత్వ సంపదైన చార్మినార్ ఆకృతిలో రూపొందించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్న దాదాపు వెయ్యిమంది ప్రతినిధులకు హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. వీరందరికీ వేర్వేరు చోట్ల వసతి ఏర్పాట్లు సమకూర్చారు. అతిధులను స్వాగతించేందుకు వాలంటీర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఐద్వా’ ధవళవర్ణ పతాకాలతో రెపరెపలాడుతూ ఆహ్వానితులను స్వాగతిస్తున్నది. గతంలో ఎన్నడూ తెలుగురాష్ట్రాలో ఐద్వా జాతీయ మహాసభలు జరిగిన దాఖలాలు లేవు. తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో ఐద్వా రాష్ట్ర కమిటీ దీని నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిరకాలం గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు వెయ్యిమంది ఐద్వా కార్యకర్తలు మూడు నెలలుగా నిద్రాహారాలు లేకుండా ఈ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
రాష్ట్రంలో దాదాపు 50 వేల కుటుంబాలను స్వయంగా కలిసి, జాతీయ మహాసభల నిర్వహణ ప్రాధాన్యతను వారికి వివరించారు. మహాసభలు జరిగే ఆర్టీసీ కళ్యాణమండపం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, జూబ్లీహిల్స్, ఇమ్లీబన్,ఉప్పల్ బస్టాండ్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పరిసరాలు, ఇందిరాపార్కు, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, లక్డీకపూల్ సహా నగరంలో నలుదిక్కులు ‘ఐద్వా’ జాతీయ మహాసభల నిర్వహణ ప్రచార అలంకారాలు ఆకర్షిస్తున్నాయి. చౌరస్త్తాల్లో పెద్ద పెద్ద ఫెక్సీలు ఏర్పాటు చేశారు. తోరణాలతో సర్కిళ్లను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఏర్పాట్ల కోసం రాత్రివేళల్లో కార్యకర్తలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. మహాసభల నిర్వహణ బాధ్యతల్ని స్వచ్ఛందంగా తమ భుజస్కందాలపై వేసుకొని, ఉత్సాహంగా, ఉత్తేజంగా పనిచేస్తున్నారు.
వెయ్యిమంది ప్రతినిధులు
మహాసభలకు 26 రాష్ట్రాల నుంచి ప్రతినిధులతో కలుపుకుని మొత్తం వెయ్యి మంది వరకు హాజరవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వహణ ఏర్పాట్ల కోసం 22 కమిటీలను ఏర్పాటు చేశారు. రవాణా, సోషల్ మీడియా, ప్రచారం, ఎగ్జిబిషన్, వాలంటరీ సహా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి.
ఫోటో ఎగ్జిబిషన్
జాతీయ మహాసభల ప్రారంభానికి ఒక్కరోజు ముందు 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా స్ఫూర్తిదాయక పోరాటాల ఫోటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ (సీతక్క) ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్ కోసం ప్రత్యేక థీమ్‌లను ఎంచుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర, స్వాతంత్య్రోద్యమంలో మహిళలు, మాతా శిశువుల సంక్షేమం, మహిళలు-ఆరోగ్యం, మహిళలు-చదువు, మహిళలు-మీడియా ఇలా భిన్నమైన థీమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు, ఐద్వా ధృవతారలు, ఉద్యమాలు, ఐక్య ఉద్యమాలు, ఐలమ్మ ట్రస్ట్ కార్యకలాపాలు వంటి అనేక అంశాలతో ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకోనుంది.
సాంస్కృతికి కార్యక్రమాలు
బస్‌భవన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో సభికుల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు ప్రత్యేక సాంస్కృతిక బృందాలు కళాప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దీనికోసం ఇప్పటికే రిహార్సల్ జరుగుతున్నాయి. సభకు భారీగా మహిళలు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు. మొబైల్ మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమరులే స్ఫూర్తి
జాతీయ మహాసభలు జరిగే కాన్ఫరెన్స్ హాల్ వద్ద అమరవీరుల చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే మహాసభల్ని నిర్వహిస్తున్నారు. అలాగే మహాసభలను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో అభ్యుదయ స్ఫూర్తిని నింపేలా పాటల్ని రూపొందించి, వాటిని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటలు వైరల్‌గా మారాయి. మొత్తంగా జాతీయ మహాసభల నిర్వహణ తర్వాత రాష్ట్రంలో ఐద్వా ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.
రేపు ‘ఐద్వా’ భారీ మహిళా ప్రదర్శన, బహిరంగసభ
25వ తేదీ ఉదయం 9.30 గంటలకు జాతీయ మహాసభలు ఐద్వా పతాకావిష్కరణతో ప్రారంభమవుతాయి. అదే రోజు మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా బస్‌భవన్ గ్రౌండ్ వరకు భారీ మహిళా ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. దీనిలో ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.కె.శ్రీమతి టీచర్, మరియం ధావలే సహా పలువురు అగ్రనేతలు పాల్గొంటారు. విదేశీ ప్రతినిధులు ఇప్పటికే తమ సౌహార్ధ్ర సందేశాలు పంపారు.
మహిళా…కదలిరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



