Saturday, January 24, 2026
E-PAPER
Homeఆటలుసూర్య, ఇషాన్‌ షో

సూర్య, ఇషాన్‌ షో

- Advertisement -

అర్థ సెంచరీలతో ధనాధన్‌ జోరు
7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
న్యూజిలాండ్‌ 208/6, భారత్‌ 208/3

సూర్యకుమార్‌ యాదవ్‌ (82 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (76) దంచికొట్టారు. ఓపెనర్ల నిష్క్రమణతో 6/2తో ఒత్తిడిలో పడిన భారత్‌ను ఇషాన్‌ కిషన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. శివం దూబె (36 నాటౌట్‌)తో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ ధనాధన్‌ షో కొనసాగించాడు. అసమాన బ్యాటింగ్‌తో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ 15.2 ఓవర్లలోనే ఊదేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

నవతెలంగాణ-రాయ్ పూర్‌
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ ఛేదనలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (82 నాటౌట్‌, 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (76, 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో దంచికొట్టారు. శివం దూబె (36 నాటౌట్‌, 18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) తనదైన జోరుతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 15.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మరో 28 బంతులు ఉండగానే విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (44, 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిచెల్‌ శాంట్నర్‌ (47 నాటౌట్‌, 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఛేదనలో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మూడో టీ20 ఆదివారం గువహటిలో జరుగుతుంది.

ఇరగదీసిన ఇషాన్‌
లక్ష్యం 209 పరుగులు. భారత స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (6) బౌండరీ లైన్‌ దగ్గర జీవనదానం లభించినా.. తర్వాతి బంతికే వికెట్‌ పారేసుకున్నాడు. 6 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన దశలో భారత్‌ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో ఇషాన్‌ కిషన్‌ (76) అద్భుతంగా ఆడాడు. కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన కిషన్‌ పవర్‌ప్లేలో ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మిచెల్‌ శాంట్నర్‌ వేసిన ఓవర్లో తొలి మూడు బంతులకు ఒక్క పరుగు చేయకపోయినా.. తర్వాతి మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. 21 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన కిషన్‌.. భారత ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నడిపించాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు సాధించాడు. కనీసం రెండు బంతులకు ఓ బౌండరీ బాదిన కిషన్‌.. 32 బంతుల్లోనే 76 పరుగులు పిండుకున్నాడు. మరో షాట్‌కు వెళ్లి సోధి ఓవర్లో నిష్క్రమించాడు. కిషన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అప్పటికే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చింది.

సూర్య ప్రతాపం
రారుపూర్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏడాదిగా అర్థ సెంచరీ సాధించని సూర్యకుమార్‌.. రెండో టీ20లో నెమ్మదిగానే ఆరంభించాడు. ఓ దశలో 10 బంతుల్లో 10 పరుగులే చేశాడు. జాక్‌ ఫౌల్క్స్‌ ఓవర్లో బ్యాట్‌ ఝులిపించిన సూర్య ఒకే ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో ఫిఫ్టీ లేని లోటును రారుపూర్‌లో 23 బంతుల్లో అర్థ సెంచరీతో పూరించాడు. ఆ తర్వాత సూర్య దూకుడు రెట్టింపు అయ్యింది. కిషన్‌ నిష్క్రమించినా.. శివం దూబె (36 నాటౌట్‌)తో కలిసి దంచికొట్టాడు.

నాల్గో వికెట్‌కు అజేయంగా 37 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 82 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ అజేయ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. శివం దూబె సైతం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. టాప్‌-5 బ్యాటర్లలో ఇద్దరు నిరాశపరిచినా.. మరో ముగ్గురు మెరవటంతో భారత్‌ 209 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. 15.2 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. మరో 28 బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ (1/41), జాకబ్‌ డఫ్ఫీ (1/38), ఇశ్‌ సోధి (1/34) తలా ఓ వికెట్‌ పడగొట్టారు. జాక్‌ ఫౌల్స్క్‌ (67/0) కివీస్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

అక్షర్‌కు గాయం
భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం బారిన పడ్డాడు. గాయంతో అక్షర్‌ పటేల్‌ రెండో టీ20కి దూరమయ్యాడు. పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రాకు రెండో మ్యాచ్‌లో విశ్రాంతి లభించింది. అక్షర్‌ పటేల్‌ స్థానంలో హర్షిత్‌ రానా, బుమ్రా స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ తుది జట్టులో నిలిచారు. న్యూజిలాండ్‌ సైతం రెండో టీ20 తుది జట్టులో మూడు మార్పులు చేసింది. టిమ్‌ సీఫర్ట్‌, మాట్‌ హెన్రీ, జాక్‌ ఫౌల్క్స్‌లను తుది జట్టులోకి తీసుకుంది. భారత స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా మూడో, ఐదో టీ20లు ఆడనుండగా.. నాల్గో మ్యాచ్‌కు సైతం విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -