ఒక్కసారిగా రూ.4 వేలకు తగ్గిన ధర
రైతుల ఆందోళన
నవతెలంగాణ-గాంధీ చౌక్
ఖమ్మం మిర్చి మార్కెట్‌లో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులను దోచుకుంటున్నారు. వారం రోజులుగా తమకు ఆర్డర్లు ఉన్నాయని రోజుకు కొంత ధర పెంచుకుంటూ మిర్చి జెండా పాటను రూ.21,500 వరకు చేసి మిగతా సరుకు కొనుగోళ్లను పరుగుళ్ళు పెట్టించడంతో రైతులకు కొంత మేర ఊరట కలిగింది. దాంతో ఇవే ధరలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని రైతులు ఆశించారు. అయితే వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వ్యాపారస్తులు శుక్రవారం జెండా పాటను రూ.21,100 చేసినప్పటికీ మిగతా సరుకును ఎక్కువగా రూ.15,000 నుంచి రూ.17,000 మధ్యనే కొనుగోలు చేశారు. దాంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కాగా, శుక్రవారం మార్కెట్‌కు సుమారు 25 వేల బస్తాలు వచ్చాయి. ఏసీ మిర్చి 900 బస్తాల శాంపిల్‌తో 75 వేల బస్తాల మిర్చి అమ్మకాలు జరిగింది. ఏసీ మిర్చి క్వింటా ఒక్కొక్కటికి రూ.20,100 ధర పలికింది. కాగా, రైతుల ఆందోళనతో మార్కెట్‌లో రెండు గంటల పాటు క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి.
చర్చలు జరిపిన మార్కెట్ చైర్మెన్, ఉన్నత శ్రేణి కార్యదర్శి
రైతులు ఆందోళనతో మార్కెట్ కమిటీ చైర్మెన్ వై. హనుమంత రావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పీ. ప్రవీణ్ రైతుల పక్షాన వ్యాపారస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ.. పైన మార్కెట్‌లో ఆర్డర్లు లేనందున తాము అంతకు మించి కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పారు. మిర్చి దిగుబడి లేని సమయంలో కూడా ఆర్డర్లు లేకపోవడమేమిటని రైతులు ప్రశ్నించారు. వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చైర్మెన్, సెక్రటరీ వ్యాపారస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తాము కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పడంతో రైతులు తమ మిర్చిని కోల్డ్ స్టోరేజీలకు తరలించారు. మరికొంత మంది రైతులు తెచ్చిన సరుకును వెనక్కు తీసుకెళ్లలేక.. వచ్చిన ధరకే అమ్ముకున్నారు.



