Saturday, January 24, 2026
E-PAPER
Homeజాతీయంమహిళలకు రక్షణ ఎక్కడ..?

మహిళలకు రక్షణ ఎక్కడ..?

- Advertisement -

అర్ధరాత్రి కాదు పగలే రక్షణ లేదు..!!

మహిళోద్యమాల్లో నాలుగున్నర దశాబ్దాలు

రేపటి నుండి ఐద్వా 14వ మహాసభలు

నవతెలంగాణ- నల్లగొండ టౌన్

మహిళా ఉద్యమ ప్రస్థానంలో 45 ఏళ్లు గడిచిపోయాయి. 46వ ఏడాదిలో అడుగుపెడుతున్న ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) 14వ మహాసభలకు అతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి 28 వరకు ఆర్టీసీ కల్యాణమండపంలో సభలు జరుగుతాయి. తొలిరోజు ఆదివారం బాగ్ లింగంపల్లి నుంచి బస్సు భవనం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు నుంచి సాయంత్రం 5 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారు. మరో మూడు రోజుల పాటు వేర్వేరు కార్యక్రమాలు ఉంటాయి.

1981 మార్చి 10 – 12 తేదీల్లో అప్పటి మద్రాసు నగరంలో మొదటి మహాసభ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఏర్పడింది. అంతకు ముందు అనేక రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే రకరకాల పేర్లతో సంఘాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం’గా, పశ్చిమబెంగాల్లో లో ‘పశ్చిమబంగా గణతంత్ర మహిళా సమితి’, మహారాష్ట్రలో ‘శ్రామిక మహిళా సంఘం’, త్రిపురలో ‘త్రిపుర గణతంత్ర మహిళా సమితి’ ఇలా రకరకాల పేర్లతో అనేక రాష్ట్రాల్లో సంఘాలు పనిచేస్తూ వచ్చాయి. అవన్నీ కలిసి దేశవ్యాప్త ఉద్యమానికి ఓ స్వరూపాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో అఖిల భారత స్థాయిలో ఈ సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలకు విద్య, సమాన హక్కులు, బాల్య వివాహాల నిషేధం, ఆస్తిహక్కు చట్టం, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపీసీ 498ఎ సెక్షన్, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ల ఏర్పాటు, గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లపై పోరాటం చేసింది.

నేరాల నియంత్రణకు చట్టాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో అమలు జరగట్లేదు. రాత్రి 10 దాటితే బస్, రైల్వేస్టేషన్లు, పని ప్రాంతాల నుంచి మహిళలు నిర్భయంగా ఇంటికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. పగలూ భద్రత లేదు. ఆరేళ్ల బాలికల నుంచి 60 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారమే ఇందుకు ఉదాహరణ. నేరాలకు కారణం అవుతున్న మద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూడొద్దు. ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకుని మద్యాన్ని నిషేధించాలి. స్త్రీలపై గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఝాన్సీలక్ష్మి, రాణిరుద్రమల మాదిరే చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవిల పోరాట చరిత్రలనూ పాఠ్యాంశాల్లో చేర్చాలి.

ప్రస్తుతం లోక్సభలో మహిళా ఎంపీలు 74 మందే ఉన్నారు. చట్టసభల్లో వారికి 33% రిజర్వేషన్లకు చట్టం చేసినప్పటికీ కేంద్రం అమలు చేయకపోవడం అప్రజాస్వామికం. నియోజకవర్గాల పునర్విభజనతో, జనగణనతో ముడిపెట్టకుండా 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలి. అప్పుడు లోక్సభలో మహిళల సంఖ్య 108కి చేరుతుంది.భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్లే ఈసారి జాతీయ మహాసభలను భాగ్యనగర్ లో నిర్వహించాలని జాతీయ కమిటీ ప్రతిపాదించింది. ఉమ్మడి ఏపీలో 2001లో ఐద్వా జాతీయ మహాసభలు జరిగినా తెలంగాణ తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. రాష్ట్రంలో ఐద్వాకు 3.75 లక్షల సభ్య బలముంది. ఇంటింటికీ వెళ్లి లక్ష కుటుంబాల్ని కలవాల సంకల్పంతో ఇప్పటికే 50% లక్ష్యాన్ని దాటాం. మహాసభల ఉద్దేశాలను వివరిస్తున్నాం. దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ మహాసభలకు తరలివస్తున్నారు.

ధరల పెరుగుదలను అదుపు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందింది. దాంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితులు నెలకొన్నా పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు కమిటీలు ఉన్నప్పటికీ సమర్థంగా పనిచేయడం లేదు. లేబర్ కోడ్ లతో పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడంతో మహిళా కార్మికులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. పనిభారం పెరగడంతోపాటు ఉద్యోగ భద్రత ఉండదు. హైదరాబాద్లో జరగనున్న ఐద్వా జాతీయ మహాసభలు… మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కుల సాధనకు దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన భవిష్యత్ ఉద్యమాలపై దిశానిర్దేశం చేస్తాయి. మహిళలకు అర్ధరాత్రి కాదు పగలే రక్షణ లేదు. మద్యం, డ్రగ్స్, అశ్లీల వెబ్సైట్ల కారణంగా పెరిగిన నేరాలు లేబర్ కోడ్లతో స్త్రీలపై అధిక పనిభారం 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -