కూటమి ఐక్యతకు ఇరాన్ సంక్షోభం భారీ పరీక్ష
అమెరికా-ఇజ్రాయిల్ చర్యలను ఖండించే సంయుక్త ప్రకటన కోరుతున్న టెహ్రాన్
ఇరాన్‌కు భిన్నంగా యూఏఈ వంటి దేశాల ప్రయోజనాలు
న్యూఢిల్లీ సమావేశంలో సభ్య దేశాల విభిన్న వ్యూహాత్మక ప్రయోజనాలు బహిర్గతం
ఏకాభిప్రాయం కష్టమేనంటున్న అంతర్జాతీయ నిపుణులు
అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్‌కు పెద్ద సవాల్
న్యూఢిల్లీ : ఇరాన్ సంక్షోభం బ్రిక్స్ ఐక్యతకు ఒక భారీ పరీక్షగా నిలుస్తోంది. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయిల్ దుశ్చర్యల నేపథ్యంలో బ్రిక్స్ కూటమి ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన కీలక రాజకీయ పరీక్షను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఆర్థిక సహకార వేదికగా ప్రారంభమైన ఈ కూటమి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ సంక్షోభాలపై ఏకాభిప్రాయంతో స్పందించగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం సమావేశంపై స్పష్టంగా కనిపిస్తోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా వంటి పాత సభ్యులతో పాటు ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి కొత్త సభ్య దేశాలు కూడా చర్చల్లో పాల్గొంటున్నాయి. అధికారికంగా ‘గ్లోబల్ సౌత్’ ఆర్థిక సహకారమే ప్రధాన అంశమని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి ఇరాన్ సంక్షోభమే చర్చల కేంద్రబిందువైందని అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
అమెరికా-ఇజ్రాయిల్ చర్యల ఖండనపై
ఏకగ్రీవ ప్రకటన కోరుతోన్న ఇరాన్
ఈ సమావేశానికి వచ్చిన ఇరాన్ ప్రధాన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ బ్రిక్స్ నుంచి ఏకగ్రీవ ప్రకటన వెలువడాలని టెహ్రాన్ కోరుతోంది. పాశ్చాత్య ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ శక్తిగా బ్రిక్స్‌ను చూపించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో తన ఒంటరితనాన్ని తగ్గించుకోవడమే కాకుండా, ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు మారుతు న్నాయనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది. అయితే ఇరాన్ ఆశలు బ్రిక్స్ అంతర్గత వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ కూటమి ఒకే విధమైన వ్యూహాత్మక ప్రయోజనాలు కలిగిన దేశాల సమూహం కాదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పరస్పర విభిన్న రాజకీయ, భద్రతా, ఆర్థిక ప్రయోజనాలు కలిగిన దేశాల కలయికగా బ్రిక్స్ మారిందని చెప్తున్నారు.
కూటమిలో కీలకంగా మారిన యూఏఈ-ఇరాన్ సంబంధాలు
బ్రిక్స్‌లో కొనసాగుతున్న సంకటస్థితి, విభేదాలకు స్పష్టమైన ఉదాహరణ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇరాన్ మధ్య సంబంధాలు. ఇరాన్… బ్రిక్స్ నుంచి బలమైన అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రకటన కోరుతుండగా, యూఏఈ మాత్రం గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా భిన్న వ్యూహాత్మక స్థితిలో ఉంది. ఒకే కూటమిలో భిన్న ప్రయోజనాలు కలిగిన ఈ రెండు దేశాలు ఉండటం బ్రిక్స్ ఎదుర్కొంటున్న రాజకీయ సమన్వయ పరిమితులను బయటపెడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
భారత్‌కు పెద్ద సవాల్
ఈ పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన సంయుక్త ప్రకటన తయారు చేయడం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్.. కూటమిలో ఐక్యతను ప్రదర్శించాలనుకుంటూనే, ఇరాన్, గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య శక్తులతో తన వ్యూహాత్మక సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. తుది ప్రకటన కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అందరికీ ఆమోద యోగ్యమైన ‘తటస్థ భాష’ రూపొందించడం కష్టమని భారత అధికారులు అంతర్గతంగా అంగీకరిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం భారత్ అత్యంత సున్నితమైన సమతుల్య రాజకీయాన్ని అనుసరిస్తోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అదే సమయంలో బ్రిక్స్‌లో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ… కూటమి బహిరంగంగా చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా భారత్‌పైనే ఉందని వారు అంటున్నారు.
పాశ్చాత్య దేశాలకు సందేశం
పంపాలని భావిస్తున్న రష్యా
రష్యా మాత్రం ఈ సమావేశాన్ని వేరే కోణంలో చూస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల తరువాత మాస్కో బ్రిక్స్‌ను బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థకు కీలక వేదికగా ప్రోత్సహిస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్వయంగా హాజరుకావడం ద్వారా, పాశ్చాత్య దేశాలు రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిచేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని చూపించాలని మాస్కో భావిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సమతుల్యతను పాటిస్తున్న చైనా
చైనా పాత్ర కూడా ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశానికి హాజరు కాలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన కారణంగా షెడ్యూల్ సమస్యలు ఏర్పడటంతో ఆయన రాలేకపోయారు.ఇందులో చైనా రాయబారి మాత్రమే పాల్గొన్నారు. ఈ పరిణామం కీలక చర్చల సమయంలో బీజింగ్ ప్రత్యక్ష ప్రభావాన్ని కాస్త తగ్గించిందని విశ్లేషకులు చెప్తున్నారు. చైనా ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు గల్ఫ్ అరబ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కూడా సమతుల్యం చేస్తోందని వివరిస్తున్నారు.
బ్రిక్స్ విస్తరణతో పెరిగిన సమస్యలు!
బ్రిక్స్ విస్తరణతో సమస్యలు మరింత పెరిగాయని విశ్లేషకులు చెప్తున్నారు. కొత్త సభ్య దేశాల చేరికతో కూటమి ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం పెరిగినా, అంతర్గత విభేదాలు కూడా విస్తరించాయని అంటున్నారు. ఆర్థిక వేదికగా ప్రారంభమైన ఈ కూటమి ఇప్పుడు భౌగోళిక రాజకీయ వేదికగా మారాలని ప్రయత్నిస్తుండగా, ఇరాన్ సంక్షోభం ఆ మార్పు ఎంత క్లిష్టమో చూపిస్తోందని చెప్తున్నారు. గల్ఫ్ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి దేశాలకు పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిడికి దారితీస్తున్నాయి. కొన్ని సభ్య దేశాలు ఇప్పటికే సబ్సిడీలు, వ్యూహాత్మక నిల్వల వినియోగం, ధర నియంత్రణ చర్యలు చేపట్టినా, ఇవి తాత్కాలిక పరిష్కారాలేనని నిపుణులు అంటున్నారు.
న్యూఢిల్లీ సమావేశంతో
కీలక విషయం బహిర్గతం
ఇక న్యూఢిల్లీ సమావేశం చివరికి ఒక సంయుక్త ప్రకటన వెలువడే అవకాశం ఉన్నప్పటికీ… అది బలహీనమైన, జాగ్రత్తగా రూపొందించిన భాషతో ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఇప్పటికే ఒక పెద్ద వాస్తవాన్ని బయటపెట్టిందని చెప్తున్నారు. ఇక బ్రిక్స్ కేవలం పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయ వేదిక మాత్రమే కాదనీ, పరస్పర విభిన్న ప్రయోజనాలున్న దేశాలు నిజమైన అంతర్జాతీయ సంక్షోభాల నడుమ రాజకీయ సమన్వయం సాధించగలవా అన్న పరీక్షను ఎదుర్కొంటున్న కూటమిగా మారిందని అంతర్జా తీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.



