Sunday, January 25, 2026
E-PAPER
Homeమానవిసామాజిక మార్పుతోనే స్త్రీ విముక్తి

సామాజిక మార్పుతోనే స్త్రీ విముక్తి

- Advertisement -

‘వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పోరాటానికీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)కు మధ్యన ఎంతో అనుబంధం ఉంది. దోపిడీని వ్యతిరేకిస్తూ, సమానత్వ సాధన కోసం భారతీయ మహిళా ఉద్యమాలు పోరాడాయి. అలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించిన మొదటితరం నాయకులలో అహల్యా రంగేకర్‌, ఇలా భట్టాచార్య, కనక ముఖర్జీ, లక్ష్మీసెహగల్‌, మల్లు స్వరాజ్యం, మంగళేశ్వరి దేవ్‌వర్మ, మంజరి గుప్త, మెటూరు ఉదయం, పంకజ్‌ ఆచార్య, పాపా ఉమానాథ్‌, సుశీలా గోపాలన్‌, విమల రణదివె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు’ అంటారు ‘ధిక్కార స్వరాలు’కు తన ముందు మాటలో ఐద్వా సీనియర్‌ నాయకులు బృందా కరత్‌. ఐద్వా అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాసిన ఆ పుస్తక పరిచయం మానవి పాఠకుల కోసం…

రాజ్యం అనుసరిస్తున్న విధానాలు, సామాజిక-ఆర్ధిక వ్యవస్థలకూ స్త్రీల అణచివేతకూ పూర్తి సంబంధం ఉంటుందని నాటి మహిళా నాయకులు గుర్తించారు. అందువల్లనే స్వాతంత్య్రానంతరం సామాజిక మార్పును కోరుతూ జరుగుతున్న ఉద్యమాలతో మమేకమై పనిచేశారు. తద్వారా మాత్రమే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని భావించారు. మన ఉద్యమ లక్ష్యాలు, ఎత్తుగడలన్నీ ఈ దృష్టి కోణం నుండే నిర్మితమయ్యాయి. భారతదేశ మహిళా ఉద్యమాల విశిష్టత ఇదే. అందువల్లనే పలు పాశ్చాత్య స్త్రీవిముక్తి ఆందోళనల వలె సైద్ధాంతిక – వ్యవస్థాగత గందరగోళాలకు దూరంగా మన ఉద్యమాలు ముందుకు సాగగలిగాయి. కేవలం సమానలక్ష్యాల పేరిట ఉద్యమాల్ని రూపొందించినంత మాత్రాన అవి స్త్రీల ఉన్నతిని సాధించజాలవు. దేశాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద పేదల వ్యతిరేక ఆర్ధిక విధానాలు, సాంస్కృతిక విచ్ఛిన్న శక్తులు, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఒకప్పుడు సామ్యవాదదేశాలు పోరాడేవి. ఈ కూటమి నేడు అంతర్ధానమైపోయింది. ఈ నేపథ్యం నుండి చూసినప్పుడు కేవలం సమాన స్వేచ్ఛ కోసం మాత్రమే స్త్రీ విముక్తి ఆందోళనలు కొనసాగిస్తే అవి అసంపూర్తి ఉద్యమాలుగానే మిగిలిపోతాయి.

మహిళల పట్ల చిన్నచూపు
పరజాతి పాలన నుండి దేశాన్ని విముక్తంగావించిన స్వాతంత్య్రోద్యమ ఆందోళనల్లో సాహసభరితంగా పాలుపంచుకున్న అనేకమంది మహిళల్ని 1947 తర్వాత రాజకీయ పార్టీలు చిన్నచూపు చూశాయి. మహిళా మణిరత్నాల ప్రతిభను అవి ఉపయోగించుకోలేకపోయాయి. 1952న జరిగిన తొలి పార్లమెంటరీ ఎన్నికల్లో లోక్‌సభకు కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. మన రాజకీయాల్లోని పితృస్వామిక అధిపత్య ధోరణులకు ఈ ఉదాహరణ అద్దంపడుతుంది. స్వాతంత్య్రానంతరం వామపక్ష మహిళా సంఘాలు మాత్రమే జాతీయోద్యమ లక్ష్యాలు, ఆశయాల సాధనకోసం అలుపెరుగని పోరాటాలు జరుపుతున్నాయి. సమరశీల రాజకీయాలు నడుపుతున్నాయి. స్వాతంత్య్రం అరుదెంచిన కొత్తల్లోనే హిందూకోడ్‌ బిల్లు సంస్కరణల్ని వ్యతిరేకించిన ఛాందసవాదులతో ఇవి పోరాటం జరిపాయి.

1960వ దశకాన ఇండియా- చైనాల మధ్యనున్న వివాదాల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డిమాండు చేస్తూ అనేకమంది వామపక్ష మహిళా కార్యకర్తలు అరెస్టయ్యారు. 1975న దేశంలో విధించిన అత్యవసర పరిస్థితుల్ని దనుమాడుతూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోరుతూ జరిగిన పోరాటాలలో వారు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అనేకమంది జైలు పాలయ్యారు. భారతదేశ వామపక్ష, ప్రజాతంత్ర మహిళా ఉద్యమాల్లో అత్యంత కీలక పాత్రను నిర్వహించిన ఆ నాయకురాళ్ల సేవల్ని మనం గుర్తించి గౌరవించాల్సి ఉన్నది. మొత్తంగానే దేశ స్త్రీ విముక్తి ఆందోళనల్లోనే వీరు గురుతర పాత్రను పోషించారు. వీరి అనుభవాలు, నిశిత పరిజ్ఞానమూ ‘ఐద్వా’కు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి.

ఐద్వా ఏర్పాటు…
1981 చెన్నై మహాసభలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం రూపుదిద్దుకుంది. వాస్తవానికి స్వాతంత్య్రానికి పూర్వం నుండే వివిధ రాష్ట్రాల్లో మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిని ఏకం చేస్తూ ఒక జాతీయస్థాయి సంస్థను 1981న ప్రారంభించామన్న మాట. భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న స్త్రీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక రాష్ట్రాల్లోని మహిళాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఎమర్జెన్సీ అనంతరం ఇటువంటి సంస్థలన్నింటినీ ఒకే తాటికిందికి తీసుకురావలసిన అవసరాన్ని ఉద్యమకారులు గుర్తించారు. ఐద్వా వ్యవస్థాపకులంతా అప్పటికే వివిధ రాష్ట్రాల ఉద్యమాల్ని సమన్వయం చేస్తూ పనిచేస్తున్నారు. విమలారణదివె, అహల్యారంగేకర్లు 1943న బొంబాయిలో పారెల్‌ మహిళాసంఘాన్ని స్థాపించారు. అనంతరం ఇది శ్రామిక మహిళాసంఘంగా రూపాంతరం చెంది ఐద్వాకు అనుబంధ సంస్థగా మారింది.

సుశీలాగోపాలన్‌ 1968న ఏర్పడిన కేరళ మహిళాసంఘం వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. 1951న త్రిపురలో గణతాంత్రిక్‌ మహిళా సమితి తొలి మహాసభలు జరిగాయి. మంగళేశ్వరి దేవ్‌ వర్మ, ఇలా భట్టాచార్యలు దీనికి హాజరయ్యారు. ఈ సమితి మొదటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో వీరిరువురూ సభ్యులు. 1942న ప్రారంభమైన మహిళా ఆత్మరక్షణ సమితిలో కనకముఖర్జీ క్రియాశీలకంగా పనిచేశారు. ఆంధ్ర మహిళా సభలో (1942) మల్లు స్వరాజ్యం చురుకైన కార్యకర్త. మోటూరు ఉదయంతో కలిసి ఆమె 1952న ఆంధ్రప్రదేశ్‌ మహిళాసంఘాన్ని ఏర్పరిచారు. జానకి అమ్మాళ్‌ స్ఫూర్తితో పాప ఉమానాథ్‌ చిరుప్రాయంలోనే తమిళనాడు మహిళా ఉద్యమాల్లో పనిచేయటం ఆరంభించారు. ఇలా ఐద్వా తొలి కార్యవర్గ సభ్యులంతా తమ తమ రాష్ట్రాల్లో ఉద్యమానుభవం ఉన్నవారే కావటంతో సంఘానికి అదెంతో ఉపకరించింది.

యవ్వన ప్రాయంలో…
బ్రిటీష్‌ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే పైన చెప్పిన నాయకులంతా రాజకీయరంగ ప్రవేశం చేశారు. అప్పటికందరూ యవ్వనప్రాయంలో ఉన్నారు. విమలా రణదివే పన్నెండేండ్ల వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొని కఠిన కారాగారశిక్షకు గురయ్యారు. దాదాపుగా వీరందరి రాజకీయ పయనం కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రారంభమైంది. ఆరోజుల్లో మహిళలు ఇళ్ల నుండి బయటకు వచ్చి పోరాటాలలో పాలుపంచుకోవటం చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ 1930వ దశకాన కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన పలు ఆందోళనల్లో వేలాదిమంది స్త్రీలు పాల్గొన్నారు. తర్వాతికాలంలో వీరిలో కొద్దిమంది మాత్రమే పూర్తిస్థాయి రాజకీయ కార్యకర్తలుగా ఉండిపోయారు.

కమ్యూనిస్టు పార్టీకి చేరువై…
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడిచిన సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో వేలాదిమంది సామాన్య ప్రజలు పాల్గొన్నారు. 1930వ దశకాన గాంధేయ ఉద్యమాలు, సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఆందోళనలు మూడింటిలోనూ స్వాతంత్య్రం కాంక్షించే వారు పాలుపంచుకునేవారని కనకముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో పనిచేస్తున్నా నాయకురాళ్లందరూ పేదలు, కార్మికవర్గ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. బ్రిటీష్‌ వలసవాదంతో రాజీపడుతున్నదని భావించి కాంగ్రెస్‌ పార్టీ పట్ల వారు అసంతృప్తి చెందారు. అలాంటి వారంతా కమ్యూనిస్టు పార్టీకి చేరువయ్యారు. బొంబాయి, తిరుచిరాపల్లి (మద్రాసు రాష్ట్రం)ల్లో ఈ నేతలు కార్మికవర్గాన్ని సంఘటితం చేశారు. ఇంకా కేరళ, హైదరాబాదు రాష్ట్రాల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.

అలుపెరుగని ఆందోళనలు
సాంఘిక సంప్రదాయాల్ని కాలదన్ని మహిళా మణులు ఎందరో రాజకీయ రంగంలోకి అడుగిడారు. తమ కుటుంబం నుండి వచ్చిన వ్యతిరేకతను సైతం పలువురు కాలదన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలుగా కార్మిక, రైతు ఉద్యమ నిర్మాణాలలో ప్రధాన భూమికను నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఉద్యమాలలోకి స్త్రీలు వచ్చేలా ఆకట్టుకున్నారు. స్వరాజ్య సాధన, కార్మికహక్కుల పరిరక్షణ కోసం తమ తమ రాష్ట్రాల పరిధుల్లో పనిచేశారు. పట్టుదల, ప్రేరణలతో అలుపెరుగని ఆందోళనలు నిర్వహించారు. సమాజంలో స్త్రీలు అన్నిరకాలుగా వివక్షకు గురవుతున్నారు. ఈ నేపథ్యాన సమానత్వ సాధన, సమస్యల పరిష్కారం కోరుతూ మహిళా సంఘాలు నిర్మించారు. అలాగే ఎప్పటికప్పుడు ఎదురవుతున్న రాజకీయ, ఆర్థిక అంశాలపైన ఆందోళనలు జరిపారు.

సాహసంతో భరించారు
ప్రజల కోసం పని చేసిన ఆ నాయకుల జీవితంలో వ్యక్తిగత, రాజకీయ రంగాల్ని వేరుపరిచి చూడలేదు. జీవితమంటేనే రాజకీయ జీవితమని తలపోశారు. ఉద్యమాల్లో పనిచేస్తున్నందువల్ల ఎక్కువమంది అనేక కష్టనష్టాల్ని ఎదుర్కొన్నారు. అనేకసార్లు జైలుపాలయ్యారు. వీటన్నింటినీ సాహసంతో భరించారు. నాయకులు జైలుకు వెళ్లినప్పుడు వారి పిల్లల్ని కుటుంబాలు, పార్టీలో సహచరులు, మిత్రులు చూసుకున్నారు. అందువల్లనే వారు తమ అనుభవాల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయామే అన్న బాధ ధ్వనిస్తుంటుంది. అయినప్పటికీ తామెంచుకున్న మార్గం పట్ల వీరనారీమణులెవ్వరికీ అసంతృప్తి లేదు. అంతేకాదు ఎంపిక చేసుకునేందుకు రెండో అవకాశం లభించినా మళ్లీ రాజకీయాలవైపే మొగ్గుచూపారు. ఇలాంటి వారంతా నేటి తరం ఐద్వా నాయకులకు, కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తిదాయకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -