మనకు జాతీయ పండుగలు రెండు. ఒకటి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవమైతే, రెండోది గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాం. నిజంగా ఈ రెండు పండుగల ప్రాధానత్యలు ఇప్పటి తరానికి మరింత ఎక్కువగా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలు, యోధులు, నాయకులు ఎన్ని త్యాగాలు చేసిందీ, జీవితాలను అర్పించిందీ కష్టాలు పడిందీ కొద్దికొద్దిగా మరుగున పడేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఎవరెవరు నిజమైన త్యాగధునులో, నాయకులో నేటి తరానికి తెలియకుండా చేస్తున్నారు. చరిత్రను కూడా వక్రీకరణకు గురిచేస్తున్నారు. అసలైన చరిత్రకు మసిపూసే ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ఈ పండుగల సందర్భంగా ఎవరిని స్మరించుకోవాలో, ఏ విషయాలను మననం చేసుకోవాలో అనేది కూడా మార్చేస్తున్నారు.
1950, జనవరి 26న, మనల్ని మనం పరిపాలించుకోవడానికి నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాము. ‘వురు ద పీపుల్ ఆఫ్ ఇండియా’ అని రాజ్యాంగం ప్రియాంబుల్‌లో మొదలవుతుంది వాక్యం. వురు ద పీపుల్ అంటే ఇప్పుడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ‘భారతీయులమైన మేము’ అని కదా అర్థం. ఇప్పుడు దేశంలో మనం భారతీయులమని రుజువు చేసుకుంటే తప్ప భారతీయులుగా గుర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలక్షన్ కమీషన్ కూడా వీళ్లు భారతీయులు కాదు అని తేల్చి ఓటరు జాబితా నుండి తొలిగిస్తున్నారు ‘సర్’ పేరుతో. అంటే రాజ్యాంగపు ప్రవేశికలో రాసుకున్నదే ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇకపోతే, రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అనేక హక్కులు కూడా అందరికీ అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్నాక, భావప్రకటనా స్వేచ్ఛను కలిగి వుంటాము. ప్రశ్నించడం, విమర్శించడం, ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం, భిన్నమైన ఆలోచనలను ప్రకటించడానికి ప్రతి పౌరునికీ స్వేచ్ఛ వుంటుంది. బహిరంగంగానే చూస్తున్నాము.. ఎవరు ప్రశ్న వేసినా, విమర్శించినా నిర్భందానికి గురిచేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహ కేసులూ, ఉపా కేసులూ మోపి భయపెడుతున్నారు. ఇదొక ప్రజాస్వామిక దేశమేనా! అనే అనుమానం కలుగుతున్నది. జర్నలిస్టులను, రచయితలను, కళాకారులను, ఉద్యమకారులను, ప్రత్యర్ధులనుకునే వారందరినీ నిరంకుశంగా అణచివేస్తున్న ఘటనలు హక్కుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాజ్యాంగ రచనలో ప్రధాన పాత్ర పోషించిన అంబేద్కర్‌ను కూడా పార్లమెంటు సాక్షిగా హోం మంత్రి అవమానపరిచాడు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈనాడు ఎదుర్కొంటున్నట్లు రాజ్యాంగంపై దాడిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. పేరుకే రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం అనుసరించడం లేదు. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతి ఆధారంగా పరిపాలన సాగాలని కోరుకున్న, అసలు రాజ్యాంగాన్నే తిరస్కరించిన ఆలోచనలు కలిగిన వారి వారసులే నేడు పరిపాలకులుగా వున్నారు. భారతదేశాన్ని హిందూదేశంగా, మత రాజ్యంగా ప్రకటించడం కూడా పరోక్షంగా చేస్తున్నారు. కుల, మతాల ఆధారంగా పరిపాలన సాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రాజ్యాంగం పేర్కొన్న లౌకిక వాదం, సామ్యవాదం అనే పదాలను కూడా తొలిగించాలనే ఆలోచనలు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమన్న భావననూ విస్మరించి కులాల వారీగా, మతాల వారీగా విభజించి, మొత్తం రాజ్యాంగ స్ఫూర్తినే విధ్వంసమొనరుస్తున్నారు. అనేక మతాలు, జాతులు, ప్రాంతాలు కలిసి పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం, గణతంత్రం ఈ రోజు పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. అందుకే మన రాజ్యాంగాన్ని వాటి విలువలను, హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలి.
గణగంత్ర ప్రతిజ్ఞ
- Advertisement -
- Advertisement -



