Sunday, January 25, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీరాజ్యాంగంలో మహిళ?

రాజ్యాంగంలో మహిళ?

- Advertisement -

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య, ప్రగతిశీల రాజ్యాంగాల్లో ఒకటిగా చెప్పుకుంటున్నాం. కోట్లాది మంది స్త్రీ పురుషుల దీర్ఘకాల పోరాట ఫలితం మన రాజ్యాంగం. శతాబ్దాలుగా వివక్ష, దోపిడీ, అణచివేతకు గురైన మహిళలను సమాన పౌరులుగా గుర్తిస్తూ, వారి హక్కులను స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచింది. సమానత్వం, స్వేచ్ఛ, గౌరవంతో జీవించే హక్కు మహిళలకు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రారంభం అయినా ఐద్వా అఖిల భారత మహాసభలు ఈ రాజ్యాంగ స్ఫూర్తి నందుకుని మహిళా హక్కుల సాధనకు పునరంకితం కానున్నాయి.

మహిళలు, పురుషులు సమానమే
1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 చట్టం ముందు సమానత్వాన్ని హామీ ఇస్తుంది.
నిన్న మొన్న ఒక బ్యాంకు మేనేజర్‌ కట్నం కోసం భార్యను చంపాడు. స్త్రీ పురుషులు సమానమే అయితే ఆస్తి హక్కు కాకుండా వరకట్న దురాచారం ఎందుకు సాగుతుంది? అయినా పోలీసులు కేసు పెడితే అతని ఉద్యోగం పోతుందనే పేరిట రాజీకి ప్రయత్నం చేస్తూ కేసు నమోదు చేయలేదు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే వరకు. లైంగిక నేరాల్లో పోలీస్‌ ఫిర్యాదులు తీసుకోకపోవడంలో పురుష పక్షపాతం కన్పిస్తుంది. ప్రభావ వంతులైన (ఆర్థికంగా, కులం కారణంగా) నిందితులకు అనుకూలంగా కేసులు నీరుగార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తున్నారు. పేద, దళిత, ఆదివాసీ మహిళలపై వివక్షతో వ్యవహరించడం అడుగడుగునా కన్పిస్తుంది. సమానత్వం చట్టాల్లో ఉంది, అమలులో లేదు.

2) ఆర్టికల్‌ 15(1) లింగ ఆధారిత వివక్షను నిషేధిస్తే, 15(3) మహిళల అభివద్ధి కోసం ప్రత్యేక చట్టాలు చేయడానికి రాష్ట్రానికి అధికారం ఇస్తుంది. ఆర్టికల్‌ 16 ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పిస్తుంది. లింగ ఆధారంగా వివక్ష కూడదు.. మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. అందువలనే విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి. అయినా కొన్ని సందర్భాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నా మహిళలు గనుక మీరు చేయలేరని ఉద్యోగాలు ఇవ్వకుండా ఆటంకాలు పెట్టారు. ఇప్పటికీ పెడుతున్నారు.



పదోన్నతుల్లో పురుషులకు ప్రాధాన్యం ఉంటుంది.
గ్రామీణ మహిళలకు ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర అలక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు ఉపాధి చట్టం కింద 100 రోజుల పని హక్కు ఉన్నా ఎక్కడా అమలు చేయక పోవడం మనం పరిశీలించవచ్చు. విద్యా, ఉద్యోగాలు, ఆస్తులు, వేతనాలలో ఇప్పటికీ సమానత లేదు. ఆడపిల్లలు గర్భం లోనే చంపి వేయబడుతున్నందున సెక్స్‌ రేషియో తగ్గిపోతుంది.
3) ఆర్టికల్‌ 21 జీవించే హక్కు మాత్రమే కాకుండా, గౌరవంగా, భద్రతతో జీవించే హక్కును కూడా మహిళలకు కల్పిస్తుంది.
అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగాయి.
గహహింస, కుల-మత ఆధారిత అణచివేతలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలకు న్యాయం దక్కకుండా, నేరస్తులను కాపాడే రాజకీయ సంస్కతి బలపడుతోంది.
మన దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు రక్షణ కల్పించిన కొన్ని ముఖ్యమైన సందర్భాలు చూద్దాం…
1) ఉన్నావో అత్యాచార కేసు — కుల్దీప్‌ సేంగార్‌ (ఉత్తరప్రదేశ్‌) బాధితురాలి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిందిత ఎమ్మెల్యేపై చర్యలు లేవు. బాధితురాలి తండ్రిని కొట్టి చంపారు. సాక్ష్యుల పై ఒత్తిడి చేశారు. చివరికి శిక్ష పడినప్పటికీ, అప్పీల్‌ సమయంలో శిక్ష నిలిపివేసి ‘నిందితులకు అనుకూలం’గా కోర్టులు కూడా వ్యవహరించాయి.
2) కథువాలో చిన్నారి అసిఫాను అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితులకు మద్దతుగా బీజేపీ మద్దతుదారులు చివరకు న్యాయవాదులు కూడా ర్యాలీలు జరిపారు.
3) బిల్కిస్‌ బానోను (గుజరాత్‌) గ్యాంగ్‌రేప్‌ చేసిన నిందితులకు శిక్ష పూర్తికాకముందే విడుదల (రిమిషన్‌) చేశారు. వారికి పూల దండలతో స్వాగతం పలకడమే కాదు వారు బ్రాహ్మణులని, సంస్కారులని పేర్కోనడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించింది.
4) హాథ్రాస్‌ కేసు (ఉత్తరప్రదేశ్‌) బాధితురాలి మరణానంతరం విచారణలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారు.
కుటుంబాన్ని ఒంటరిగా ఉంచారు, మీడియా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. అర్దరాత్రి దహనం చేయడం ద్వారా నిందితులను కాపాడే ప్రయత్నాలు చేశారు. దళిత అమ్మాయిలు ఆవారాగా తిరుగుతారని బీజేపీ ఎం.పి. నిందితులకు మద్దతుగా ఉన్నారు. కేసు బలహీనపర్చి నిందితులను రక్షించారు.
5) బీజేపీ ఎం.పీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పైన మహిళా క్రీడాకారులు ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఆందోళన చేస్తున్న క్రీడాకారులను అరెస్టు చేసి స్వయంగా ప్రధాన మంత్రే నిందితుడికి మద్దతు ఇచ్చారు.
6. కలకత్తాలో ఆర్‌.జే కర్‌ ఆసుపత్రిలో అత్యాచారానికి హత్యకు గురైన దారుణ సంఘటనలో ప్రభుత్వ మద్దతుతో సాక్ష్యాలు నాశనం చేశారు.
7. క్యాంపస్‌లలో/ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అంతర్గత ఫిర్యాదు కమిటీల (ICC) నివేదికలను పక్కన పెట్టి నిందితులపై చర్యలు తీసుకోకపోవడం సర్వ సాధారణం అయింది.



బాధితులనే బదిలీ చేయడం వంటి ఘటనలు అనేక చోట్ల వెలుగుచూశాయి.
ఈ ఘటనలన్నింటా రాజకీయ వత్తిడి, అధికార దుర్వినియోగం, పోలీసు, పరిపాలనా వైఫల్యం వల్ల లైంగిక నేరాల కేసుల్లో నిందితులకు రక్షణ ఇవ్వడం ద్వారా మహిళలు గౌరవంగా జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు.
గహ హింసను ఇప్పటికీ ”కుటుంబ విషయం” అంటూ తేలికగా తీసుకోవడం, సర్దుకుని భరించాలని చెప్పడం సర్వ సాధారణం. మహిళలపై జరుగుతున్న నేరాలలో 34% గహ హింస కేసులే! పైగా బాధితురాలినే ప్రశ్నించడం, నిందారోపణలు చేస్తారు.
ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఆర్థిక వ్వవహారాలు భర్త అజమాయిషీలోనే ఉంటాయి. సామాజిక అవమానం కారణంగా హింసను భరిస్తూనే సంసార బాధ్యతలను నెరవేర్చవలసి వస్తుంది.
4.ఆర్టికల్‌ 39(డి) సమాన పనికి సమాన వేతనాన్ని నిర్దేశిస్తుంది. మహిళల శ్రమకు తగిన వేతనం లేదు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు అత్యంత దోపిడీకి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.
స్త్రీలు పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగంలో పని చేస్తున్నందున మహిళలకు తక్కువ జీతం లేదా కూలీ ఇస్తారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో మహిళలకు తక్కువ వేతనం. ఆశా, అంగన్‌వాడీ, మిడ్‌డే మీల్‌ వర్కర్లను ‘సేవకులు’గా చూపి కార్మిక హక్కులు నిరాకరిస్తున్నారు. లక్షలాదిగా ఉన్న ఇంటి పనివారికి అసలు చట్టమే లేదు. ఇంటి పని పని గానే గుర్తింపు లేదు.

5) రాజకీయ హక్కులు డ ప్రాతినిధ్యం:
రాజకీయాల్లో సమాన భాగస్వామ్యం వచ్చేందుకు స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం ద్వారా రాజకీయ భాగస్వామ్యాన్ని రాజ్యాంగం నిర్ధారించింది. మహిళలు ప్రజా ప్రతినిధులుగా పని చేస్తున్న చోట పురుషుల కంటే బాగా పని చేస్తున్నట్లు వివిధ సర్వేలు తెలియ చేస్తున్నాయి.
కానీ ఆచరణలో పంచాయతీల్లో స్థానిక సంస్థల్లో మహిళలు పేరుకే ప్రజాప్రతినిధులు. వాస్తవ అధికారాలు పురుషుల చేతుల్లోనే! అతి కొద్ది చోట్ల మినహా.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ చట్టం డీలిమిటేషన్‌తో ముడిపెట్టి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.
6) సామాజిక న్యాయం (ఆర్టికల్‌ 38, 46) సామాజిక, ఆర్థిక న్యాయం ఆచరణలో ఉల్లంఘించ బడ్తున్నది.
విద్య, ఆరోగ్యం, పోషణ వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వల్ల మహిళల జీవన స్థితిగతులు మరింత దెబ్బతింటున్నాయి.
సంక్షేమ పథకాల తగ్గింపు ప్రైవేటీకరణ వల్ల మహిళలపై భారం పెరుగుతున్నది.
1) ప్రభుత్వ విద్యా నాణ్యత తగ్గడం, కళాశాలలకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గడం, ప్రైవేటీకరణ, ఫీజుల పెంపుతో మహిళలపై భారం పెరుగుతుంది. పేద కుటుంబాల్లో ముందుగా ఆడపిల్లల చదువే ఆగిపోవడం చాలా సహజమైన ప్రభావం.



చదువు మధ్యలో ఆగిపోతే బాల్యవివాహాలు పెరుగుతాయి. విద్య తక్కువ కావడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతాయి.
పాఠశాల విద్య ఖర్చు మొత్తం బడ్జెట్‌లో 3.16% నుండి 1.55% నికి పడి పోయింది.ఉన్నత విద్యా ఖర్చు కూడా 1.26% నుంచి 1% నికి పడిపోయింది. సమాన విద్యావకాశాలు లేక పోవడం ద్వారా అసమానత కొనసాగుతుంది.
2) ఆరోగ్య రంగం, ప్రభుత్వ వ్యయం తగ్గింపుతో ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు బలహీనపడుతున్నాయి.
ఔషధాలు, పరీక్షల కొరత వలన ప్రైవేట్‌ ఆసుపత్రులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
గర్భిణీ, పాలిచ్చే మహిళలకు సరైన వైద్యం అందదు, కుటుంబ ఆరోగ్య సంరక్షణ మొత్తం మహిళల బాధ్యతగా మారుతుంది.
చికిత్స ఖర్చుల కోసం అప్పుల బారిన పడుతున్నారు. మహిళలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
మహిళల ఆరోగ్యం చివరి ప్రాధాన్యంగా మారుతుంది.
ఆరోగ్య రంగానికి జీడిపి లో కేటాయింపు సుమారు 1.9% నుండి 2% మాత్రమే గతంలో 2.31% ఉండేది. 60% మహిళలు సరైన, సులభమైన వైద్య సేవలను పొందడం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5లో తేలింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా రక్తహీనతకి గురవుతున్నారు.
ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తే, మహిళ శరీరమే దాని భారం మోయాలి
3) ICDS బడ్జెట్‌: సమగ్ర పోషణ కొరకు 42,000 కోట్లు అవసరం. కానీ 21,200 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. ఇది తల్లీబిడ్డల పోషకాహార లోపానికి దారి తీసింది.

అంగన్వాడీ సిబ్బందికి తక్కువ వేతనాలు కొనసాగుతున్నాయి. వారికి పని భారం పెరుగుతుంది. తక్కువ గౌరవం, హక్కుల్లేని ‘వాలంటీర్లు’ గా ఉండవలసి ఉంటుంది. చిన్నపిల్లల పోషణ బాధ్యత పూర్తిగా తల్లులపై పడుతుంది.
ప్రభుత్వ పాత్ర తగ్గితే నీరు, ఇంధనం, ఆరోగ్యం, విద్య… అన్నీ కుటుంబ బాధ్యతలుగా మారతాయి.
సంక్షేమ చర్యలను తగ్గించడం, విద్య, ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం, పిల్లలు, వద్ధులు, అనారోగ్యుల సంరక్షణ బాధ్యతలతో మహిళలపై ఉచిత శ్రమ (లెక్కించని) పెరుగుతుంది. బడ్జెట్‌ కోతలు లింగ పక్షపాతం కలిగి ఉంటాయి. సామాజికంగా మహిళల స్థితిని బలహీన పరుస్తాయి.
రాష్ట్రం తన బాధ్యతల్ని తగ్గించుకుని బడ్జెట్‌ తగ్గిస్తే ఆ ఖర్చు మహిళల శరీరం, శ్రమ, సమయం ద్వారా భర్తీ చేయడం అవుతుంది. దళిత, ఆదివాసీ, మైనారిటీ మహిళలపై ఈ దోపిడి మరింత ఎక్కువ. రాజ్యాంగ లక్ష్యాల సాధనకు ప్రభుత్వ పాలసీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
7) శాస్త్రీయ భావజాలాన్ని పెంచడం, స్త్రీలపై అశ్లీలతను నిరోధించడం వంటివి ఆదేశిక సూత్రాలలో పొందు పరిచారు. కానీ మనువాద పాలకుల నేతత్వంలో మతం, సంప్రదాయం పేరుతో మహిళల స్వేచ్ఛపై దాడులు మరింతగా పెరిగాయి. దుస్తులు, ఆహారం, వ్యక్తిగత ఎంపికలపై నియంత్రణ పెరుగుతోంది. రాజ్యాంగ విలువల స్థానంలో మనువాద, స్త్రీ వ్యతిరేక ఆలోచనలు ప్రోత్సహించ బడుతున్నాయి. మహిళకు తన శరీరం, జీవితం మీద పూర్తి అధికారం ఉండాలనేది రాజ్యాంగ భావన. కానీ ఇప్పటికీ 18% బాలికలకు బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

స్త్రీ ఇష్టంతో నిమిత్తం లేకుండానే బలవంతపు గర్భధారణ, ఆడ పిల్లైతే గర్భస్రావాలు చేయిస్తున్నారు. ఇటీవల స్త్రీల వస్త్రధారణపై చాలా చర్చ జరిగింది. సినిమాలలో ఐటమ్‌ సాంగ్స్‌, పండగలలో రికార్డు డాన్సులతో మహిళలను అంగాంగ ప్రదర్శన చేస్తుంటారు. స్త్రీని ఆట బొమ్మగా మార్చి, వారినే వేలెత్తి చూపడం నేటి సమాజపు ద్వంద్వ విలువలకు నిదర్శనం. కుటుంబం, సమాజపు ఒత్తిళ్ల కారణంగా సామాజిక జీవితంలో స్త్రీలు తీవ్రమైన ఒత్తిడికి, ట్రోల్స్‌కు గురికాబడ్తున్నారు.
మగవాడిని ఈ సమాజం ప్రశ్నించదు. స్త్రీలను మాత్రం బిడ్డలను ఎవరికి కన్నారన్న ప్రశ్నను అతి తేలికగా వేస్తారు. రాజ్యాంగం స్థానంలో సంప్రదాయాల పేరిట స్త్రీలను అణచివేసే పితస్వామ్య మనువాద భావజాలం పై చేయిగా ఉంది.
8. ప్రతి మహిళకు న్యాయం పొందే హక్కు ఉంది. కానీ ఆచరణలో అడగడుగునా ఉల్లంఘనే! కేసులు ఏళ్ళ తరబడి సాగుతూనే ఉంటాయి. ఉచిత న్యాయ సహాయం ఆచరణలో అందదు. సాక్షులను బెదిరిస్తారు. బలవంతంగా రాజీ చేయించడం జరుగుతుంది. అత్యాచారం కేసులలో కూడా ‘జరిగిపోయింది ఏమిచేస్తాము? డబ్బు తీసుకుని బాగా బతకండి’ అంటూ వత్తిడి చేసి అత్యధిక కేసులలో నిందితులను రక్షిస్తారు. రాజ్యాంగం మహిళలకు హక్కులు ఇచ్చింది.
కానీ ఆచరణలో అవి క్రమంగా కాలరాయ బడుతున్నాయి.



మహిళల ముందున్న కర్తవ్యం…
మొదటిగా, రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలి. రాజ్యాంగం మన రక్షణ కవచం అన్న విషయాన్ని ప్రతి మహిళ గుర్తించాలి.
రెండవది, సంఘటిత పోరాటాలు బలపరచాలి. వ్యక్తిగతంగా కాదు, సంఘాలుగా, మహిళా ఉద్యమాలుగా, ప్రజా ఉద్యమాలుగా పోరాడాల్సిన అవసరం ఉంది.
మూడవది, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మహిళల ప్రధాన బాధ్యత. ఓటు హక్కును, అభిప్రాయ స్వేచ్ఛను, నిరసన హక్కును వినియోగించుకోవాలి.
నాలుగవది, స్త్రీ, పురుష సమానత్వాన్ని సామాజికంగా నిర్మించాలి. కుటుంబం నుంచి పని ప్రదేశం వరకు, ప్రతి చోట వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలి. ఐక్య పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలపర్చుకోవాలి. నిరసన, అభిప్రాయాలను ప్రకటించడం, ఓటుహక్కును సరిగా వినియోగించడం… అన్ని మార్గాలను మహిళలు చురుకుగా ఉపయోగించాలి.
రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితం కావద్దు. అవి అమలవ్వాలంటే మహిళల చైతన్యం, పోరాటమే ప్రధాన ఆయుధం. సమానత్వం, గౌరవం, స్వేచ్ఛతో జీవించే సమాజాన్ని నిర్మించడం మహిళల పోరాటాల ద్వారానే సాధ్యం. దయతో మహిళ విముక్తి సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని, విలువలను కాపాడుకోవడం అంటే మహిళల హక్కులను కాపాడుకోవడమే. అదే నేటి కాలంలో మహిళల చారిత్రక కర్తవ్యం.
రాజ్యాంగ రక్షణే నేడు మహిళా విముక్తికి తక్షణ కర్తవ్యం.

డి. రమాదేవి
9490098620

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -