Sunday, January 25, 2026
E-PAPER
Homeకథకుక్కల రాజ్యం

కుక్కల రాజ్యం

- Advertisement -

సురేష్‌ ఓ వింత కేసులో విచిత్రంగా ఇరుక్కున్నాడు. ఇవ్వాళ్ల కోర్టులో దాని హియరింగ్‌ ఉంది. పదింటికే వచ్చి అడ్వొకేటుకు ముఖం చూయించి కోర్టు ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు గద్దెపై కూచున్నాడు.
కోర్టు కొనసాగుతోంది. జేబులోంచి ఫోన్‌ తీసి టైం చూశాడు. పన్నెండవుతోంది. ఫోన్‌ పాకెట్లో వేసుకుంటూ పక్కాయన వైపు చూశాడు. తన లాగే వచ్చిన మరో కోర్టు పక్షి అయ్యుంటాడు. ఆయన నొసటిపై చేతివేళ్ళతో రుద్దుకుంటూ ఔటాఫ్‌ మూడ్‌లో ఉన్నాడు. కోర్టు ఆవరణలో ఇలా కాక మరెలా ఉంటారనుకొంటూ ఆయనను పలకరించాడు.
‘కేసుందా సార్‌!’
భారంగా తల ఎత్తి సురేష్‌ వైపు చూస్తూ ఔనన్నట్లు తలూపాడు.
‘ఏం చేస్తుంటారు’
‘హోమ్‌ గార్డును’
‘అరె.. పోలీస్‌ డిపార్టుమెంటా.. మీపై కేసేముంటుంది. లాకప్‌ డెతా?’
‘ఛీ.. కాదు సార్‌.. కుక్కను చంపాను’
‘ఏమిటి.. ఇవ్వాళ్ళ అన్నీ జంతువుల కేసులేనా!’ అన్నాడు చిత్రంగా సురేష్‌.
బద్దకంగా కదులుతున్న కాలానికి కొంత హుషారు తోడయ్యింది.
‘అసలు విషయమేంటో క్లియర్‌గా చెప్పండి!’ అంటూ సురేష్‌ ఆయన దగ్గరగా జరిగాడు.
‘నేను హోమ్‌ గార్డ్‌గా చేయబట్టి ఐదేళ్లు అవుతోంది కాని కుక్కను చంపితే ఇంత పెద్ద కథ అవుతాదని తెలియనే తెలియదు. ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేశారు సార్‌!’ అన్నాడు దీనంగా.
‘అయ్యో.. ఎవరిదైనా పెంపుడు కుక్కనా?’
‘కాదు సార్‌ .. ఊరకుక్క’ అన్నాడు విసుగ్గా, దానికి కూడా అంత విలువనా అన్నట్లు.
‘ఔనా?’ అంటూ ఎంత కష్టమొచ్చే నీకు అన్నట్లు ఆయన వంక చూశాడు సురేష్‌.
‘ఏ కుక్కను చంపినా కేసేనట’ అన్నాడు ఆయన విచారంగా.
ఇంత చదువు చదివిన తనకే కేసు మీద పడే దాకా తెలియలేదు. ఈ చిరుప్రాణికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ ‘అసలు ఎందుకు చంపావు’ అని ఆయన ముఖంలోకి చూశాడు.
‘సార్‌.. అది దొంగ కుక్క. మాది జగద్గిరిగుట్టలో చిన్న కిరాయి ఇల్లు. దాని తలుపుకు చిన్న సందుంటుంది. ఎన్ని అట్టపెట్టెలు అడ్డంగా కట్టినా కుక్క తోసుకొని పోతోంది. డోర్‌ రిపేర్‌ చేయించమని ఓనర్‌కు చెబితే ఇప్పుడు అప్పుడు అంటూ దాటేస్తున్నాడు. ఇల్లు మారుదామంటే రెంట్స్‌ ఎక్కువ. నా భార్య స్కూల్లో ఆయాగా చేస్తుంది. ఇంట్లో ఇంకెవరు ఉండరు. నేను భోజనానికి వెళ్లే ముందే ఆ కుక్క లోపలికి వెళ్లి గిన్నెలు ఖాళీ చేస్తోంది. అలసి పోయి ఆకలితో ఇంటికొస్తే ఖాళీ గిన్నెలు అగుపడితే ఎంత బేజారైపోతాం సార్‌. ఓ రోజు నేను వచ్చే ముందే అది లోనకు వెళ్ళిందేమో.. తలుపు దగ్గరికి వెళ్ళగానే గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. కడుపుమంటతో కోపం నషాళానికి చేరింది కాని చంపాలనుకోలేదు. తలుపు తీయంగానే నా కాళ్ళసందులోంచి జారుకుని రోడ్డెక్కింది. తప్పించుకుందే అన్న కోపంతో చేతిలో ఉన్న తాళం కప్పను గట్టిగా దానివైపు విసిరాను. సరిగ్గా రాయితో కొట్టినట్లు తాళం దాని తలకు తాకింది. దెబ్బకు కుక్క గుండ్రంగా తిరిగి కింద పడిపోయి కాళ్ళు చాపేసింది. దగ్గరికెళ్లి చూస్తే దాని ఊపిరి ఆగిపోయి ఉంది. నలుగురు జమయ్యారు. కుక్కలు, పిల్లులను చంపినా నేరమేనట. ఎవరో వచ్చి ఠాణాలో చెప్పారు. నా గతి ఇట్లా మారిపోయింది. నేను కుక్కను చంపాను. నిజమే కానీ అది రోజు నా అన్నం తింటోంది. అది దొంగతనం కదా. దానికి శిక్ష ఎవరు వేస్తారు. మనుషుల దొంగతనానికి కోర్టులు, చట్టాలున్నాయి. చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు. అన్నీ ఒప్పుకుంటాను. కుక్కలను కూడా శిక్షించే కోర్టులు కూడా ఉంటే బాగుండు. అప్పుడు మనుషులు వాటిని రాళ్లతో, కర్రలతో కొట్టకుండా చక్కగా ఫిర్యాదు చేసేవాళ్ళు కదా!’ అన్నాడాయన విచారంగా.
సురేష్‌కు ఈయన లాజిక్‌ బాగానే ఉందనిపించింది.
‘మీరేం చేశారు సార్‌?’ అన్నాడు మీ కథ చెప్పమన్నట్లు కలుపుగోలుగా.
‘నాదీ మరీ దరిద్రమైన కేసు. నా వల్లే ఓ బుజ్జి కుక్క చచ్చింది కాని నీలా కొట్టి చంపలేదు’.
అంతా నా తల రాత అన్నట్లుగా ముఖం పెట్టాడు.
ఏమీ అర్థం కానట్లు అయ్యో పాపం అన్నట్లు మిశ్రమ స్పందననిచ్చాడాయన.
దాంతో తన కథ చెప్తున్నట్లుగా మొదలుపెట్టాడు సురేష్‌.
‘నేనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ని. హాస్టల్‌లో ఉంటా. నా ఫ్రెండ్‌ మధు వాళ్ళ అక్క ఇంట్లో యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. అనుకోకుండా వాడి అక్కనేమో డెలివరీకి వాళ్ళమ్మ దగ్గరికెళ్లింది. బావ నెల రోజులు ట్రైనింగ్‌ కోసం లక్నో వెళ్ళాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే సడెన్‌గా మధుగాడికి కూడా టూర్‌ పడింది. రెండు వారాల కోసం వాడు కంపెనీ పని మీద సింగపూర్‌ వెళ్లక తప్పలేదు. అప్పుడు వాడు నాకు ఫోన్‌ చేసి మా ఇంట్లో రెండు చిన్న కుక్కపిల్లలున్నాయి. వాటిని టూ వీక్స్‌ చూసుకోవాలి అన్నాడు. ఎవరైనా పక్క వాళ్ళకో, తెలిసినవాళ్లకో అప్పగించు అన్నాను. ట్రై చేశానురా.. ఎవరు హెల్ప్‌ చేసేలా లేదు, అందుకే నిన్నడుగుతున్నా అన్నాడు. నాకు కుక్కల గురించి ఏం తెలుసురా అన్నా. నీవు ఎట్లాగూ హాస్టల్లోనే గదా ఉండేది. ఈ పదిహేను రోజులు మా ఇంట్లోనే ఉండు. పొద్దున్నే వాటిని బయటికి తీసికెళ్ళి ఆఫీసుకు వెళ్లే ముందు పాలు అన్నం, బిస్కెట్లు గిన్నెల్లో ఉంచితే అవే తింటాయి. రాత్రి బుద్దిగా పడుకొంటాయి. నీకేం కష్టముండదు. ప్లీజ్‌ రా.. అన్నాడు. నేను సరే అన్నాను. వాడు సింగపూర్‌ వెళ్ళిపోయాడు. నేను వారి ఇంట్లోనే ఉంటూ పప్పీలను చూసుకుంటున్నాను. నాలుగో రోజు అనుకోకుండా ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వస్తుండగా నా బైక్‌ను వెనుక నుంచి ఓ కారు గుద్దింది. నేను ఎగిరిపడి రోడ్‌ డివైడర్‌ పై పడ్డాను. ఆ తాకిడికి పాత హెల్మెట్‌ బెల్ట్‌ తెగిపోయి తలకు దెబ్బ తగిలింది. ఎవరో హాస్పిటల్లో చేర్చారు. నాలుగో రోజు కళ్ళు తెరిచాను. హాస్పిటల్‌ లెక్క చూసుకొని బయటికి రాగానే కుక్క పిల్లలు గుర్తుకొచ్చాయి. హైరానాగా సరాసరి ఇంటికెళ్ళాను. అక్కడంతా జనం గుమిగూడి ఉన్నారు. ఇంటిలోంచి వాసనొస్తే పోలీసులకు ఫోన్‌ చేశారట. నన్ను చూడగానే తలుపు తెరవమన్నారు. రెండు కుక్కల్లో చిన్నది ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయినట్లుంది. వాసన వేస్తోంది. రెండోది కాస్త తట్టుకున్న నీరసంగా పడి ఉంది. వెంటనే దానికి నీళ్లు తాగించి బిస్కట్టు పెట్టాను. కొద్దిగా తేరుకుంది. పోలీసులు నన్ను స్టేషనుకు తీసికెళ్లారు. నా ఇల్లు కాదన్నాను. రిక్వెస్ట్‌ చేస్తే ఉంటున్నానన్నాను. ఓనర్స్‌ వచ్చేదాకా ఆగమన్నాను. ఏం చెప్పినా ఎంత బతిమిలాడినా వినలేదు. వీథిలో వాళ్లంతా చూశారు కాబట్టి కేసు తప్పదన్నారు. ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి.. దోషులెవరో తేలిపోతుంది అన్నారు. అడ్వొకేట్‌ నడిగితే నీ సంరక్షణ సమయంలోనే చనిపోయింది కాబట్టి కుక్క యజమాని ఎవరైనా తప్పు నీదే అవుతుంది. అయితే నీకు జరిగిన యాక్సిడెంట్‌ వల్ల ఇలా జరిగిందని రుజువులు చూయిస్తే జడ్జి ఏమైనా శిక్ష తగ్గించవచ్చు అన్నాడు’ అని ఏకబిగిన తన వత్తాంతం చెప్పిన సురేష్‌ నిట్టూర్చాడు.
అప్పుడే వీధికుక్క బాధితుడిని పేరును బంట్రోతు పిలవగానే గబా గబా ఆయన కోర్టు హాలులోకి వెళ్ళాడు. జడ్జి ఏమడుగుతాడు, ఈయనేం చెబుతాడో చూద్దామని మెల్లగా ఆయన వెనుకాలే వెళ్లి కోర్టు హాలులోకి వెళ్లి చివరి వరుసలో కూచున్నాడు సురేష్‌.
కోర్టు హాలులో జనం పలుచగా ఉన్నారు. బహుశా ఇవే చివరి కేసులేమో.
బోనులో నిలబడ్డ హోమ్‌గార్డ్‌ చెప్పిందంతా విని ఓ నిమిషం అటు ఇటు చూసి జడ్జి – ‘ఐ పి సి సెక్షన్‌ 428 , 429 ప్రకారం నీకు యాభై రూపాయలు జరిమానా. ఆఫీసులో కట్టేయి’ అని తీర్పు చెప్పాడు. ఓ క్లర్క్‌ వెంట ఆయన వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అదే బోనులో నిలబడగానే సురేష్‌ ‘మిలార్డ్‌.. నేను కూడా యాభై రూపాయలు కట్టేస్తాను’ అన్నాడు ఉత్సాహంగా.
జడ్జి అడ్వొకేట్‌ వైపు చూశాడు. సైలెంట్‌గా ఉండమన్నట్లు సురేష్‌ అడ్వొకేట్‌ సైగ చేశాడు.
‘మీ ఇద్దరిది ఒకలాంటి కేసు కాదు. ఊరకుక్కని చంపితే శిక్ష అదే కానీ పెంపుడు జంతువుని చంపితే మూడేళ్ల నుంచి అయిదేళ్ల జైలు శిక్ష పడుతుంది’ అన్నాడు జడ్జి.
సురేష్‌కు అటు నుంచి అటే జైలు కెళతానేమోనని భయమేసింది.
‘నా క్లయింట్‌ ఉద్దేశ్యపూర్వకంగా కుక్కను చంపలేదు మిలార్డ్‌. ఊహించని రీతిలో ఆయనకు రోడ్‌ యాక్సిడెంట్‌ అయ్యింది’ అని అడ్వొకేట్‌ సురేష్‌ చేతిలోని హాస్పిటల్‌ రిపోర్టులను జడ్జికి అందించాడు. ఆ కాగితాల్ని తిరగేసిన జడ్జికి ఈయన తెలిసి నేరం చేయలేదని అర్థమైంది.
సురేష్‌ వైపు చూస్తూ ‘ఇవ్వాళ్ల జులై ఏడు. ప్రపంచ క్షమాగుణ దినం. తీర్పుల ద్వారా నష్టపోయిన జంతువులకు ఏదైనా మేలు జరగాలి. నీవు జాబ్‌ చేస్తున్నావు కాబట్టి జైలు శిక్ష వేయకుండా జరిమానా వేస్తాను. సరేనా!’ అని అడిగాడు జడ్జి.
బ్రతికి పోయాను అనుకుంటూ ‘సరే!’ అన్నాడు.
వాతావరణం చల్లబడడంతో సురేష్‌ గొంతు సవరించుకున్నాడు.
‘శిక్షకు బదులు పెనాల్టీ వేసి వదిలేస్తున్నందుకు మీకు మెనీ మెనీ థాంక్స్‌. కేసు మీద పడ్డాక నేను ఎనిమల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ గురించి కొంత సెర్చ్‌ చేశాను. అందులో అన్ని సందేహాలే. వాటిని మీతో చెప్పుకోవాలి మిలార్డ్‌!’ అన్నాడు సురేష్‌ కాస్త చొరవగా.
ఏంటవి అన్నట్లు తలాడించాడు జడ్జి.
‘జంతువులను ఎవరూ కొట్టవద్దని, చంపవద్దని చట్టం తెచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ విషయం దేశంలో ఎందరికి తెలుసండి. అసలు పాటిస్తున్న వారెందరు? శిక్ష పడుతున్న వారెందరు. అసలు నాకర్థం కాని విషయమేమిటంటే కోడి, మేక, గొర్రె, పంది, పశువు లాంటి తినే జంతువులను కరకరా కోసేసి లోకమంతా నాన్‌ వెజ్‌ ఇష్టంగా తినేస్తున్నారు. పెంచేదే తినడానికి కదా అనేది అందరు ఒప్పుకొనే మాట. దాంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మరి తినని జంతువులను కొట్టినా, చంపినా శిక్ష వేస్తున్నారు. మన దేశంలో కుక్కల్ని, పిల్లుల్ని కూడా కోసుకొని తినే వారున్నారు. అది వారి ఆహారమని వదిలేయడమా.. పట్టుకొని శిక్షించడమా.. ఇదంతా చాలా తికమకగా ఉంది మిలార్డ్‌’ అన్నాడు సురేష్‌.
‘స్వతంత్ర భారతంలో దొరికితే దొంగ.. చిక్కితే శిక్ష.. దాన్ని వదిలేరు!’ అంటూ సురేష్‌ మాటలను తేలిగ్గా తీసుకుంటూ జడ్జి ‘పెనాల్టీగా ఒక నెల సాలరీ బ్లూ క్రాస్‌ సొసైటీకి డొనేట్‌ చేయాలి’ అని తీర్పు చెప్పాడు.
విచారణ అంతా వింటున్న ఒకాయన లేచి జడ్జితో ‘అయ్యా! నా మూడేళ్ళ మనవడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి’ అన్నాడు.
‘నీవెవరు?’ అన్నాడు జడ్జి.
‘నేను వేరే కేసు పని మీద కోర్టుకు వచ్చాను. కుక్కల చావుకు కారణమైన వారికి మీరు శిక్షలు వేస్తుంటే మాట్లాడాలనిపించింది. నాలాంటి వారికి న్యాయం దక్కాలంటే ఎవరిపై కేసు పెట్టాలి. కుక్కలపైనా.. మున్సిపాలిటీ పైనా.. జీవకారుణ్య సంస్థలపైనా?’ అన్నాడాయన బాధగా.
‘ఎవరిపైనా వేయరాదు’ అన్నాడు జడ్జి.
‘నా మనవడిని చంపిన కుక్కలను నేను చంపితే ఊర్కొంటారా!’ అన్నాడు కాస్త ఆవేశంగా.
‘అది నేరమే కదా!’
‘మనిషి కుక్కను చంపితే నేరమౌతుంది. కుక్క మనిషి చంపితే నేరం కాదు. శిక్ష లేదు. ఇదెక్కడి న్యాయం సార్‌!’ అన్నాడు.
ఆయన బాధ జడ్జికి అర్ధమైంది.
‘నీ ప్రశ్నకు చట్టంలో జవాబు లేదు పెద్దయ్యా! జంతువులను గాయపరచిన వారికి గొప్ప మానవతా దక్పథంతో శిక్షలు వేస్తున్నాం కాని జంతువులతో నష్టపోయిన వారికి ఏమి చేయలేక పోతున్నాం. చిన్న పిల్లల్ని కుక్కలు కండలు పీకి చంపడమంటే కన్నవారికి ఎంత కడుపుకోత. పెద్దల్లా పిల్లలు పరిగెత్తలేరు. రాయెత్తి బెదిరించలేరు. కుక్క కాటుకు గురైన వారికి చికిత్స అందించి, బాధితులకు ప్రభుత్వం జరిమానా చెల్లించాలని పంజాబ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌ హైకోర్టులు ప్రజలకు కుక్కల బెడద తప్పించమని ప్రభుత్వాలను ఆదేశించాయి. నీవు సాక్ష్యాలతో కేసు పెడితే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు’ అని చివరకు, కుక్క కాటుకు బలైన వారికి మీ సమాధానమేమిటో మూడు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు ఇంకా రాలేదు కానీ రాష్ట్రంలో గంటకు పద్నాలుగురిని కుక్కలు కరుస్తున్నాయనే వార్త మాత్రం పేపర్‌లో వచ్చింది.
– బి.నర్సన్‌ 9440128169

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -