Sunday, January 25, 2026
E-PAPER
Homeసోపతిదక్షిణాది తెరపై మహిళా టార్జాన్‌ తవమణి దేవి

దక్షిణాది తెరపై మహిళా టార్జాన్‌ తవమణి దేవి

- Advertisement -

సినిమాలు వచ్చిన తొలి రోజుల్లో ఉన్నత వర్గాల రాజకీయాలు ఉన్నత కుల, వర్గాలకు చెందిన ‘మర్యాదగల’ మహిళలు సినిమా హాళ్లకు వెళ్లడాన్ని నిషేధించాయి. సినిమా హాళ్లకు వెళ్లడమే నిషేధమైతే, సినిమాలలో నటించడం వారికి ఊహించరాని విషయం. ఆ పరిస్థితులలో సిలోన్‌ నుండి మద్రాసుకు వచ్చి మోడరన్‌ థియేటర్‌ చిత్రాలలో నటించిన నటి తవమణి దేవి. 1930వ దశకంలో మర్యాదగల కుటుంబాలకు చెందిన మహిళలు తమ సంకోచాన్ని వదిలి సినిమాలలో నటించాలని ఒక విజ్ఞప్తి చేసింది ఆమె. ఈ విజ్ఞప్తికి స్పందిస్తూ, ఒక తమిళ పత్రిక ఆమె స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్‌లో ఉన్న ఫొటోను ప్రచురించి, దానికి ఇలా శీర్షిక పెట్టింది. ”సిలోన్‌ నుండి వచ్చి పతివ్రత అయిన అహల్యగా నటించిన నటి తవమణి దేవి మర్యాదగల కుటుంబాలకు చెందిన మహిళలు సినిమాలలో నటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు”. ఆ తర్వాత సినిమా రంగంలోని పెద్ద మనుషులుగా చెప్పుకునే వాళ్ళు మహిళల నైపుణ్యం, ప్రతిభలను తప్పుగా చిత్రీకరించడాన్ని ఆకాలంలోనే తవమణి దేవి ధైర్యంగా అడ్డుకున్నారు.

తమిళ సినిమా చరిత్రలో ఎంజీఆర్‌ సినీ జీవిత కాలాన్ని చరిత్రకారులు గోల్డ్‌ స్టాండర్డ్‌గా పరిగణిస్తారు. తమిళ సినిమాల విషయానికి వస్తే, ఎంజీఆర్‌ (1917-1987) ను ఒక ధ్రువతారగా పరిగణిస్తారు. ఆయన సమకాలీనుల కెరీర్లను కొలవడానికి ఆయన సినీ జీవిత కాలాన్ని ఒక ప్రమాణంగా పేర్కొంటారు. ఈ ప్రకారంగా రంగస్థలంపై, సినిమాలలో ఎంజీఆర్‌తో సంబంధం ఉన్న కథానాయికలు, ఇతర మహిళా నటీమణులను మూడు వర్గాలుగా విభజించవచ్చు.
మొదటి తరం(1936-47): ఎంజీఆర్‌ అగ్రస్థానానికి చేరుకోవడానికి ముందే అప్పటికే తారలుగా ఉన్నవారు. ఉదాహరణకు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, టి.ఆర్‌. రాజకుమారి, టి.ఎ. మధురం, పి. కన్నాంబ, పి. భానుమతి.
సమకాలిన తరం (1947-55): ఎంజీఆర్‌తో పాటు అగ్రశ్రేణికి ఎదిగిన వారు. ఉదాహరణకు వి.ఎన్‌. జానకి, మాధురి దేవి, బి.ఎస్‌. సరోజ, లలిత, పద్మిణి, రాగిణి.
తర్వాతి తరం (1956 నుండి): ఎంజీఆర్‌ సూపర్‌స్టార్‌ అయిన తర్వాత ఆయనతో నటించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు. సావిత్రి, లలిత, పద్మిణి, రాగిణి, బి సరోజాదేవి, దేవిక, వంటి వారు లెక్కలేనంత మంది.
వీరిలో తవమణి దేవి మొదటి వర్గానికి చెందినవారు. ఆమె ఎంజీఆర్‌ నటించిన రెండు సినిమాలలో నటించారు. మొదటిది ‘సీతా జననం’ లేదా ‘వేదవతి’ (1941). 17 ఏళ్ల తవమణి దేవి సీత పాత్రలో కథానాయికగా నటించగా, 24 ఏళ్ల ఎంజీఆర్‌ చిన్న ఇంద్రజిత్‌ పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి రెండు నెలల ముందే, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలై’ (1940) విడుదలై పెద్ద విజయం సాధించింది. ‘శకుంతలై’లో తవమణి దేవి మేనక పాత్రను పోషించింది.



తరువాత, 30 ఏళ్ల ఎంజీఆర్‌ మొదటి హీరోగా నటించిన ‘రాజకుమారి’ (1947) చిత్రంలో తవమణి దేవి విలన్‌ పాత్ర పోషించింది. ఈ సినిమాలో తెలుగు నటి కె.మాలతి నాయకగా నటించినప్పటికీ, తవమణి దేవి తెరపై తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది.
తవమణి దేవిగా ప్రసిద్ధురాలైన ఆమె ఇంటిపేరు కత్తిరేసు. ప్రతిభావంతులైన కళాకారిణి, నటి, నత్యకారిణి, గాయని. ఆమె 1940వ దశకంలో భారతీయ సినిమా అభిమానులకు సుపరిచితమైన పేరు. ఇంకా చెప్పాలంటే ఆమె సింహాళ దేశం నుండి మద్రాసుకు వచ్చి సినిమాల్లో నటించిన మొదటి మహిళ.
తవమణి దేవి తండ్రి తమిళుడైనప్పటికీ, ఆమె తల్లి సింహళీయురాలు. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగ కారణంగా ఇద్దరూ జాఫ్నాలో నివసించేవారు. 1992లో ఆనంద వికటన్‌ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పినట్లుగా – ”తవమణి దేవి మేనమామ కతిరవేట్‌పిళ్లై బాలసింగం 1910-20ల్లో సిలోన్‌ శాసనమండలిలో సభ్యుడు. సింహళ భాషలో అనర్గళంగా మాట్లాడటం, సింహళ పాటలు పాడటం వల్ల తవమణి దేవి సింహళీయురాలు కాదు. ఎంజీఆర్‌ ఆత్మకథలో, ఇతర రకాలుగా సేకరించిన సమాచారం తవమణి దేవి జాఫ్నాలోని ఇనువిల్‌ స్థానికురాలు మాత్రమే. నిజానికి ఆమె పూర్తిగా తమిళురాలే.
తమిళ సినిమాలలో స్విమ్‌ సూట్‌లో కనిపించి, బికినీ సూట్‌లో (మహిళా టార్జాన్‌ పాత్ర) నటించిన మొదటి సినిమా తార తవమణి దేవి. చెన్నైలో ఆమె తండ్రి మరణించిన తర్వాత, 1940ల చివరలో, 1950ల ప్రారంభంలో తమిళ సినిమా పరిశ్రమలో సర్వసాధారణంగా ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌ ప్రలోభాలకు తవమణి దేవి తొలి బాధితురాలిగా చరిత్రకి ఎక్కింది. తమిళ సినిమా రంగంలోని కొందరు ఆమె పట్ల కక్షపూరితంగా వ్యవహరించి, ఆమెను వేధించి, చెన్నై నుండి తరిమివేశారు. ఇది తమిళ సినిమా చరిత్రపై ఒక చెరగని మచ్చ వంటిది.

1992లో ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తవమణి దేవి తన సినీ జీవితాన్ని గురించి ఇలా గుర్తుచేసుకున్నారు… ”మేము అప్పుడు కొలంబోలో నివసించేవాళ్ళం. మా స్వస్థలం జాఫ్నా. మేము బ్రాహ్మణ సమాజానికి చెందినవాళ్ళం. మా నాన్నగారు కత్తిరేసు సుబ్రమణ్యం. కొలంబోలో న్యాయమూర్తిగా పనిచేసేవారు. మా తల్లిదండ్రులకు ఐదుగురు కుమారులు. వారు తమ ఇంట ఒక ఆడ కూతురు పుట్టాలని అనేక తీర్థయాత్రలు చేసిన ఫలితంగా పుట్టిన (1925) నాకు తవమణి దేవి (పూజాఫలంగా పుట్టిన ఆభరణం) అని పేరు పెట్టారు. చాలా గారాబంగా పెరిగాను. నేను పాఠశాలలో ఉన్నప్పుడు, ఉదయప్ప అనే అబ్బాయితో నాకు స్నేహం ఉండేది. అతను పాడటంలో, నాట్యం చేయడంలో ప్రతిభావంతుడు. అతను నాకు తమిళ పాటలు నేర్పించాడు. భక్తి గీతాలు పాడుతూ, గ్రామఫోన్‌లో ప్రసిద్ధ సింహళ గాయకుడు కిట్టప్ప పాటలు వింటూ నేను సంగీత పరిజ్ఞానాన్ని సంపాదించాను. నా అభిరుచిని చూసిన మా అమ్మానాన్న ఇంట్లోనే సంగీత శిక్షణ ఏర్పాటు చేశారు. నేను ‘దశరథ రాజా కుమారా…’ వంటి పాటలను కంఠస్థం చేసి మధురంగా పాడేదాన్ని. ఒక రోజు పాఠశాలలో జరిగిన పోటీలలో నేను అప్పట్లో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాచుర్యం పొందిన ఒక పాటను పాడాను. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి, ‘కొలంబోలో ఇలాంటి పాటలు పాడితే, బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలిస్తే నిన్ను అరెస్టు చేయవచ్చు’ అని నన్ను మందలించారు. అదష్ట వశాత్తూ, అలాంటిదేమీ జరగలేదు.

నేను సింహళ భాష చదవడం, రాయడం కూడా నేర్చుకుని సింహళ పాటలు కూడా పాడేదాన్ని. నాకు రేడియో సిలోన్‌లో పాడే అవకాశం లభించింది. ఆ పాటలు జనాదరణ పొంది ‘సిలోన్‌ కోకిల’ (సింగళతు కుయిల్‌) అనే బిరుదునిచ్చారు. ఈ వార్త వార్తాపత్రికలలో వచ్చినప్పుడు, సాంప్రదాయ వాదులైన మా బంధువులు ‘మా కుటుంబ గౌరవానికి మచ్చ వచ్చింది’ అని కలత చెందారు. మా నాన్నగారు వారిని చాకచక్యంగా ఎదుర్కోన్నారు. అప్పుడే, ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ బృందం కచేరీల కోసం సిలోన్‌ను సందర్శించారు. మేం ఆ కచేరీకి హాజరయ్యాం. కచేరీ ముగింపులో అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారితో బాటు నేను కూడా వెళ్ళాను. మేం భాగవతార్‌ను మా ఇంటికి ఆహ్వానించాం. అప్పుడు నేను అతని ముందు పాడాను. భాగవతార్‌ మా నాన్నగారిని అనుమతి అడిగారు. ‘నాన్నా… తంగచ్చి (చెల్లెలు) బాగా పాడుతోంది. నేను ఆమెను తీసుకువెళ్లి సినిమా తారను చేస్తాననా’్నరు. నాన్న ఆ అభ్యర్థనను సున్నితంగా కాదన్నారు”
శ్రీలంకలో ఉన్నప్పుడే త్యాగరాయ భాగవతార్‌ గారి తండ్రి చనిపోయినప్పుడు తవమణి దేవి తండ్రి చాలా రకాలుగా వెంట ఉండి తోడ్పడ్డాడు. ఈ సంఘటన తరువాత, భాగవతార్‌, తవమణి దేవి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి.

ఇంకా ఆమె… ”నాకు సుమారు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, మోడరన్‌ థియేటర్స్‌ యజమాని టి.ఆర్‌. సుందరం నా గురించి విని, తన సినిమాలో నటించడానికి కాంట్రాక్టు కోసం తన సహాయకుడిని పంపారు. మొదట మా నాన్న నిరాకరించారు. ఆ సహాయకుడి పట్టుదలకు మా నాన్న అంగీకరించారు. ఆయన 10,000 రూపాయల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. మేం తమిళనాడుకు వచ్చాం. మొదటి రోజు సెట్స్‌పై నేను ఉద్వేగంతో చెప్పిన డైలాగులకు, టి.ఆర్‌. సుందరం సంతోషించారు. ‘సతీ అహల్య’ సినిమాకు నన్ను కథానాయికగా తీసుకున్నారు. ‘సతీ అహల్య’ (1937) తర్వాత, నాకు ‘శ్యామ్‌ సుందర్‌’, ‘సీతా జననం’ సినిమాలకు కాంట్రాక్టులు వచ్చాయి. ‘సతీ అహల్య’ మోడరన్‌ థియేటర్స్‌ వారి మొదటి సినిమా. మా అమ్మగారి మరణం తర్వాత, మా నాన్నగారి పదవీ విరమణ అనంతరం నేను మా నాన్నగారు చెన్నైలో స్థిరపడ్డాం” అంటూ వివరించారామె.
సుందరం తన నిర్మాణ సంస్థ ప్రారంభాన్ని ప్రకటించడానికి పత్రికా విలేకరులను ఆహ్వానించి, తవమణి దేవి స్విమ్‌సూట్‌లో ఉన్న ఫోటోను విడుదల చేసినప్పుడు, అది ఆ కాలానికి చాలా గ్లామరస్‌గా భావించబడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి, తమిళ సినిమాలలో కథానాయికల మధ్య గ్లామర్‌ ట్రెండ్‌ను ప్రారంభించింది దేవియే. ఆ తర్వాత టి.ఆర్‌. రాజకుమారి, మాధురి దేవి వంటి నటీమణులు దీనిని అనుసరించారు.
మద్రాసు వచ్చిన తర్వాత ఆమె నటించిన మరో విజయవంతమైన చిత్రం ‘విద్యాపతి (1946)’. ఈ చిత్రంలో తవమణి దేవి దేవదాసి మోహనాంబాల్‌ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె పాశ్చాత్య శైలి నత్యాలు పాటలు పాడింది. 1947లో వచ్చిన ‘రాజకుమారి’ లో ఆమె ఎంజీఆర్‌తో కలిసి నటించింది, దీనికి కరుణానిధి సంభాషణలు రాశాడు. ఈ చిత్రం ఆమెకు గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది. రాజకుమారి చిత్రంలో తవమణి దేవి హీరోని మోహింపజేసే రాణి పాత్రను పోషించింది. శాంటో, చిన్నప్పదేవర్‌ ఆమె అంగరక్షకురాలిగా నటించారు.

ఫిలిం న్యూస్‌ ఆనందన్‌ తమిళ సినిమాల డైరెక్టరీ ప్రకారం 1937 – 1949 మధ్య తవమణి దేవి నటించిన మొత్తం 11 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ వరుసగా : ‘సతీ అహల్య’ (మోడరన్‌ థియేటర్స్‌) – మార్చి 10, 1937న విడుదలైంది. ‘శకుంతలై’ (1940, రాయల్‌ టాకీస్‌ – చంద్రప్రభ సినీటోన్‌), శ్యామ్‌ సుందర్‌ (1940, లక్ష్మి సినీటోన్‌), కష్ణ కుమార్‌ (1941, సేలం సాధన ఫిల్మ్స్‌), వన మోహిని (1941, సౌత్‌ ఇండియన్‌ యునైటెడ్‌ ఆర్టిస్ట్‌ కార్పొరేషన్‌), సీతా జననం/ వేదవతి (1941 -శ్యామల పిక్చర్స్‌), భక్త కాళతి (1945 -పద్మ పిక్చర్స్‌), అరవల్లి-సూరవల్లి (1946 -సదరన్‌ థియేటర్స్‌), విద్యాపతి, (1946 – జూపిటర్‌ పిక్చర్స్‌), రాజకుమారి(1947 – జూపిటర్‌ పిక్చర్స్‌) నాటియ రాణి (1949 – భాస్కర్‌ పిక్చర్స్‌). ఈ 11 సినిమాలతో పాటు ఎల్లిస్‌ డంగన్‌ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘వాల్మీకి’ (1945లో) కూడా నటించింది. ఇందులో సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులుతో పాటు తవమణి దేవి నటించింది. ఈ సినిమాకి సంగీతం చేసినవాడు మాస్టర్‌ వేణు.
కాస్టింగ్‌ కౌచ్‌కు తవమణి దేవి ఎలా బలైయిందో వచ్చేవారం తెలుసుకుందాం.
(వ్యాసకర్త సినీ చరిత్రకారుడు)
– హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -