బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తికి సాగిన స్వాతంత్రోద్యమ పోరాటం అనేకమంది బలిదానాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో సుమారు మూడేళ్లు అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి 1950లో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ విధంగా ఇండియన్ యూనియన్ సర్వసత్తాక సార్వభౌమ, లౌకిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదాన్ని (సోషలిస్ట్) చేర్చడం జరిగింది. స్వతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని 1950 జనవరి 26న అధికారికంగా మొదటి రిపబ్లిక్ డే (గణతంత్ర) వేడుకను నిర్వహించారు. దేశానికి సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు గడిచాయి. 2026 జనవరి 26న 77వ గణతంత్ర ఉత్సవాల్ని జరుపుకోబోతున్నాం. కానీ, నేడు సర్వసత్తాక దేశ సార్వభౌమాధికారానికి, లౌకిక తత్వానికి, ఫెడరల్ విధానానికి హాని వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది.
146 కోట్ల దేశ జనాభాలో ఒక శాతం మంది కోసం, వందల్లో ఉన్న పారిశ్రామిక, వాణిజ్య వేత్తల ఖజానా కాపలాదారుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాబోయే కాలంలో మళ్లీ గద్దెనెక్కడానికి రాజ్యాంగ నిబంధనలకు, ఫెడరల్ విధానాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పెడుతున్నది. దేశ సార్వభౌమాధికారానికి, స్వావలంబనకు మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ పారిశ్రామిక సంస్థలను, ప్రజోపయోగ రైల్వే, రోడ్డు రవాణా, విమానయాన సంస్థలను, సేవా సంస్థలను బడా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి ఎలక్ట్రోల్ బాండ్ల అమ్మకాలతో కొట్లానుకోట్ల రూపాయల లబ్ది పొందింది. ఈ క్రమంలో లాభసాటిగా నడుస్తున్న జీవిత బీమా సంస్థను వదల్లేదు. ప్రజలు ప్రయివేటు సంస్థల నుంచి మోసపోకుండా ఉండడానికి, స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న వేర్వేరు ప్రయివేటు బీమా సంస్థలను, బ్యాంకులను అన్నిటినీ కలిపి జాతీయం చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా ఆయా సంస్థల్లో బడా వాణిజ్యవేత్తలకు వాటాలిచ్చింది. క్రమేణా ఆ సంస్థలు కార్పొరేట్ కుబేరుల జేబు సంస్థలుగా మారే ప్రమాదం దాపురించింది.
కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మీద రాష్ట్రాల అధికారాన్ని తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా 2020 నూతన విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా చరిత్రను వక్రీకరించే శాస్త్రీయ అంశాలను సిలబస్ నుంచి తొలగించే కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదలైంది. తాజాగా భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 పేరుతో ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తోంది. ఇది అమల్లోకి వస్తే, 1952లో ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారత సాంకేతిక విద్యా మండలి రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ” జీరాంజీ’ అనే కొత్త పేరు తగిలించి, కేంద్ర నిధులకు కోత పెట్టింది. ఈ పథకం విస్తరణను కుదించే విధంగా మార్చింది. దీనివల్ల కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కూలీల ఉపాధికి ఎసరు పెట్టింది. భారత రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్నది.
దిగజారిపోతున్న పాలనా వ్యవహారాలు, తమ నిరంకుశ పాలనను ప్రశ్నించే ప్రజాతంత్ర వాదులను, పార్టీ నాయకుల మీద అక్రమకేసులు బనాయించి ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లలో పెడుతున్నది. లైంగికదాడులు, హత్యలు చేసిన దుండగులను పెరోల్, క్షమాభిక్షలతో జైళ్ల నుంచి మళ్లీ జనం మీదికి వదులుతున్నది. పాలక పార్టీ తప్పుడు విధానాలను, దుర్మార్గాలను ప్రశ్నించడమే దేశద్రోహ నేరంగా పరిగణిస్తున్నది. లద్దాక్‌లో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్, ఢిల్లీలో ఉమర్ ఖలీద్‌ల జైలు నిర్భందం ఆ కోవలోకి చెందినవే. ఒక వైపు ప్రశ్నించే గొంతులను నొక్కుతూ మరో వైపు తమకు ఓట్లు వేయరని అనుమానం ఉన్న కోట్లాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నది. ఈ ప్రక్రియను అధికారికంగా నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర సర్వే(ఎస్‌ఐఆర్) పేరుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ మొదలు పెట్టింది. ఇప్పటికీ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పదికోట్ల మంది ప్రజలు ఓటు హక్కు కోల్పోవడం జరుగుతుందని ఒక అంచనా. ఎందుకంటే ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాలను నింపలేదని, పాత ఓటర్ల జాబితాలతో అనుసంధానం చేసుకోలేదని రకరకాల కారణాలు చెబుతున్నది. ఇలా ఓట్ల తొలగింపు గురైన వాళ్లలో హిందూ మతంలోని మహిళలూ లక్షలాదిమంది ఉన్నారు.
భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువు లోపల ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాలను నింపని ఓటర్ల సంఖ్య అధికారికంగా ఆరు కోట్ల 30 లక్షల మంది, ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకుండాపోయారు. అడ్డదిడ్డమైన తొలగింపు ప్రక్రియ ఇలా ఉండగా, గత పార్లమెంటు ఎన్నికల కోసం లక్షల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పిచిన ఉదంతం, బెంగళూరు పార్లమెంట్ స్థానంలో బట్టబయలు అయిన సంగతి బహిరంగ రహస్యమే! రాబోయే సార్వత్రిక ఎన్నికలలోపు ఈ దేశ లౌకిక, ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి దేశ సార్వభౌమాధికారాన్ని దేశ విదేశీ కార్పొరేట్ వర్గాలకు ధారాదత్తం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లు తీసుకొచ్చి పనిగంటల్ని పెంచింది. వేతనాలు, హక్కుల గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేసింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు, కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పాకులాడుతోందనేది. నాలుగు రైతు వ్యతిరేక చట్టాలను వివిధ సంఘాల రైతాంగం తిప్పికొట్టిన మాదిరిగానే, బీజేపీ కూటమి అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత వివిధ వర్గాల ప్రజల మీద ఎంతైనా ఉంది. ఈ 77వ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజాకంటక విధానాలను ఎదురించాలి.
జూలకంటి రంగారెడ్డి
94900 98349



