ముగ్ధశ్రీ, డి.వై స్వామి పేర్లతో బాలల కథలు రాస్తున్న పలుకుబడుల కవి ‘దోమల యాకస్వామి’. వత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. పలుకుబడుల మాగాణంలో ‘పస’ వున్న వాక్యం అతనిది. పల్లె పదాల్ని కవిత్వం చేస్తున్న పిలగాడు. రేబవలు కవిత్వమంత్రం జపిస్తున్న వాడు, కవిత్వవాక్యంపై పట్టు కోసం అవిరళ కషి సల్పుతున్న ఋషి. సాధారణంగానే పల్లె పదాలు కవిత్వ వాసనతో గుభాళిస్తయి. ఏ కాస్త ప్రతీకాత్మకంగా అల్లినా అద్భుతమైన కావ్య పుష్పమై వికసిస్తది. ప్రతీకాత్మక నేత చిక్కబడి అధివాస్తవికత ధోరణి పొడచూపుతున్న దిశలో తన కవిత్వవాక్యాన్ని సానబెడుతున్న ఛాయలు రోజురోజుకు పాకాన పడటం కనిపిస్తది.
”మాపటికి సప్పుల్లతోటొచ్చి / మిణుగురు పురుగులెక్క మిటకరిచ్చి/ కప్పల తోటి పాట పాడిచ్చేటోడు/ ఉడుకబోశి చెమటవట్టిన/ ఇల్లు మీద దుంకి/ ఒంటి కంటిన మైలదీసేటోడు” (కాటగలిసిండు)
అభివ్యక్తికి, ధారగా కురుస్తున్న కవిత్వలయకు అక్షరాలన్నీ తాళం వేస్తూ నాట్యం చేస్తయి. ‘వస్తువు’ను పట్టుకుందామను కున్న పాఠకులు ‘పదాల’ దరులవెంట పారాడుతుంటరు. ‘కాటగలిసింది’ మనిషి కాదు.. పల్లెనొదిలి పట్నం మీద ఎగబడి కురుస్తున్న ‘వాన’ అని తెలిసినప్పుడు కవిత్వ మర్మం తెలుసుకుంటున్న జ్ఞానులమైతం. వాక్యాన్ని పుటం పెడుతున్న తీరుకు ఆశ్చర్యం, అబ్బురపడుడు అటుంచి, తన నిరంతర సాధన కవిత్వానికో నూలుపోగులా అర్పిస్తున్న కాలాన్ని పొదివి పట్టుకుంటాం.
”సంసార సంద్రాన్ని ఈదలేని నావ/వికసించిన మొగ్గను చూసి/ నావికుడు వచ్చిండని సంబురపడ్డది / జుంటి తేనెలు పిలిచే తేనెటీగ / వికసించిన పుష్పాన్ని వశపరచుకున్నది/తోడుకొచ్చిన నీడ / అంటు కట్టిన జంట పక్షుల్ని / ఇంటి నుండి గెంటేసింది/ ఊతకర్రకు ఊగిసలాడే పండుటాకులు రెండు/ అంగిలిడిసి గంగలో కలిసినవి” (పెనవేసుకున్న బంధం)
రోజూ కనిపించే ‘వస్తువు’ కొత్తగా దశ్యమానమవటం, రోజూ పొందని అవ్యక్తానందానుభూతిని ఆస్వాదించటం ఒక అనుభవంగా మిగిలిపోతది. కొడుకుల చేత నిర్లక్ష్యం చేయబడ్డ తల్లిదండ్రుల రూపంతో పాటు, ప్రకతి ప్రతీకమానమవటం, సహజత్వాన్ని కోల్పోకుండా కవిత్వ తడిని నిలిపి వుంచటం గమనిస్తాం.
వైయక్తికత, ప్రకతి ధ్యానం నుండి క్రమంగా ‘వస్తువు’ సామాజికం కావడం కవిలోని పరిణామ దశను, పరిణితిని సావధానంగా వినిపించే తీతువు పిట్టొకటి ఆడాడనే గిరికీలు కొడుతాంటది. ‘వస్తువు’ ఏంటో దొరకబట్టుకుంటానికి ప్రయాస పడుతుంటం. కవిత్వమును ఆస్వాదించటమొక్కటే సంతప్తినివ్వదు. కవి ఏం చెపుతున్నాడో తెల్సుకునేందుకు కవిత్వ వాక్యాల వెంట పరుగులు బెడుతం. గాలం, ఎర, చేప, ఒడ్డు, ఆకలి, త్యాగం మొ.న పదాలు పరిచయమే అయినా రూప విక్రయం చెందిన కవిత్వ జవాన్ని అంది పుచ్చుకోవడం కాస్త సమయాన్ని తీసుకుంటది. ఆకాశం, నిచ్చెన, తేనెతెట్టె, పచ్చనాకులు, అద్దాల మేడ, బతుకు, నిగనిగ ల గుట్టు విప్పేందుకు సిద్ధమైతం. చీమలు, నక్కలు, గుడ్డేలుగులు, చావుదెబ్బలు, బడుగుజీవులు ఏం సందేశమిస్తున్నయో ఆరాతీస్తం. గడ్డిపరకలు, గొర్రెలు, మాంసం, మందు, వరద, రాత్రి వంటి సంకేతాలు కొంత తెలిసిన దశ్యాల్ని రూపు గట్టించడానికి ప్రయత్నం జేత్తయి. మురికి, తెల్ల కొంగలు, గుడ్డి దీపాలు, పథకాలు, వాగ్దానాలు, దింపుడు గల్లం దశాల్ని ఫ్రేముల్లో బంధిస్తూ వుంటయి. భుజాలు, కండువాలు, దండోర, మెతుకులు, మొఖాలు, అతుకులు, ఐదేండ్లు ‘వస్తువు’ను దగ్గరికి తీసుకొచ్చి నిలబెడుతయి. గెలుపు గుర్రాలు, గర్ర, సాదు జీవులు, బాంచెనగరి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతయో భయాన్ని గుండెల్లో దడదడగా ధ్వనింపజేత్తయి. గొంగళిపురుగు, గోడ, భావితరం ఒకానొక ఆశను చిగురింప జేత్తది.
కేవలం పదాలుగా పరిచయమైన అక్షరాలు ఎంతటి జ్ఞానశక్తిని నింపుకుని నవనవలాడుతూ గత, వర్తమానాల్ని శాసిస్తూ భవిష్యత్తు ‘కల’ ను కంటి ముంగటి బల్లిపాతరలా వ్యూహపు ఉచ్చుల్ని పేనుతదో ‘కవిత్వం’ రుచి చూపిస్తది. పదాల వెనుక దాగున్న అర్థాలు, నిగూఢతను రక్తి కట్టిస్తయి. అర్ధం చేసుకునేందుకు ఏదో ఒక దగ్గరి దారి కోసం వెతుక్కుంటూ అలసటను నెమరు వేస్తున్నప్పుడు పచ్చిక మైదానపు గరికపోస నిధిని తెరిచే తాళంచెవిని దొరుకబట్టిత్తది.. పలుకుబడులు అన్ని ప్రాంతాల వారిని అపరిచయీకరణకు గురి చేస్తుందనే సత్యదూరం కాని మాటలు వింటున్నప్పుడు ప్రతీకల్ని పొదువుకున్న నుడికారపు సొగసులు ఊరిస్తూ నీటిని తడిచేస్తున్నప్పుడు ఆత్రం ‘అధివాస్తవికత’ ఛాయలోకి చేరుకుంటున్న దశలో కవిత్వం ఒక పజిల్ ను తలపిస్తది. మెదడుకు మేతలా పనిజేత్తది. అర్ధం కాదని తప్పించుకోవడం, అలక్ష్యం చేయడం అంతమంచి పధ్ధతి కాదు. అన్వేషణ, కుతూహలం కవిత్వనిధిని దొరుకబట్టిత్తది. ”సాధనమున పనులు సమకూరు ధరలోన ‘ అని పాడుకుంటూ ముందుకు సాగిపోవడమే మిగిలిందిక!
‘దోమల యాకస్వామి’ కవిత్వం చిక్కబడిందని వేరే చెప్పనక్కర్లేదు. చిక్కదనమెంతో దక్కించుకునేందుకు -గొంగళి పురుగు’ కవితనొకసారి ఒంటినిండా పాకించుకుందాం. సీతాకోకచిలుకలా ఎగిరే రేపటి కాలాన్ని మందుగా పూసుకుని దద్దుర్లు తేలిన దేహానికి సాంత్వన చేకూర్చుకుందాం.
– బండారి రాజ్ కుమార్, 8919556560



