గాలానికి కుచ్చిన ఎర
ఎవని కడుపో నింపడానికి
తన జీవితం త్యాగం జేత్తది
ఎరకు చిక్కిన చేప
ఒడ్డున పడి
రేపటిని అంతం చేసుకుంటది
అందని తేనెతెట్టె కోసం
బతకడం తెలువనోళ్లంతా
ఆకాశానికి నిచ్చెనలేత్తరు
మిషిన్లకు పుట్టిన పచ్చనాకులు
అద్దాలమేడల్లా నిగనిగలాడుతయి
గుట్టుగా దాచుకున్న చీమల సంపదను
గుడ్డేలుగులు దోసుక తింటయి
బడాయి నక్కల చావు దెబ్బలకు
బడుగు జీవులన్నీ వరుగులైతయి
గడ్డిపరకల కోసం
గొర్రెలన్నీ మాంసం కొట్టు కాడ
వరుస గడుతయి
రాత్రి పారిన మందు వరదలో
పంచిన పచ్చనాకులు కొట్టుకుపోతయి
మురికి వాసన పడని
తెల్ల కొంగలు
గరికపోసలు పట్టుకొని
వరుస కలుపుతయి
వెలిగే గుడ్డి దీపాలన్ని
చమురులేక చతికిలబడ్డప్పుడు
పానం లేని పథకాలకు
వాగ్దానాలే దింపుడు కళ్ళం జేత్తయి
ఐదేండ్లకు కొకసారి
అతుకులేసుకున్న మొఖాలన్నీ
మెతుకుల కోసం ఆరాట పడుతయి
బంధాల్ని బొందబెట్టే కండువలన్నీ
భుజాలనెక్కి దండోర ఏత్తయి
గెలిచిన గుర్రం గర్రతోటి విర్రవీగుతాంటె
సాదు జీవులన్నీ బాంచనగిరి జేత్తమని
చేతుల చేయ్యేత్తయి
గొంగళి పురుగొకటి గోడకు చుట్టుకొని
భావితరాన్ని నిలపడం కోసం
ప్రయత్నం జేత్తది



