Sunday, January 25, 2026
E-PAPER
Homeసోపతిఓట్ల తనిఖీ తమాషా దేఖో

ఓట్ల తనిఖీ తమాషా దేఖో

- Advertisement -

జుట్టుపోలుగాడు : (డప్పుకొడుతూ) విన్నోళ్లెవరో… విననోళ్లెవరో… ఉన్నోళ్లెవరో.. లేనోళ్లెవరో.. ఆడోళ్లు.. మగోళ్లు… అటుగానోళ్లు.. ఇటుగానోళ్లు.. అందరూ వినండహో… అయిదు రాష్ట్రాల్లో మనకు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నారు. అస్సాం, బెంగాల్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. త్వరలో అక్కడ పోలింగ్‌. అందుకని ఆయా రాష్ట్రాల్లో ఓట్ల తనిఖీ జోరుగా జరుగుతుందహో. అక్కడ ఓటున్నవారు వెంటనే తమ సొంతూళ్లకెళ్లి తమ ఓట్లు ఉన్నాయో లేవో తనిఖీ చేస్కొండహో… హెచ్చరిక.. హెచ్చరిక… హెచ్చరిక… మీకు గన్క ఓటు లేదనుకో ఇక మీరు పరాయి దేశస్థులవుతారహో… గందుకే మీ మూటాముల్లె సర్దుకుని వెంటనే మీమీ ఊళ్లకు వెళ్లండహో…(డప్పు)
కేేతిగాడు : ఓరే జట్టుపోలుగా వున్నపళాన మనకూ వీలను వాళ్ల వూళ్లకు వెళ్లమంటే ఎట్టాకుదురుద్దీ? వాళ్ల దగ్గర రానుబోను ఖర్చులుండాలా? యజమానులు సెలవు ఇవ్వాలా… ఎంతలేదన్నా జంటకు రానూపోనూ పదివేల రూపాయలు పైనే ఖర్చవుద్ది. నీవిస్తావా? నీ బాబు ఇస్తాడా..?
జుట్టుపోలుగాడు : ఒరే మావా కేతిగా… అయన్నీ నాకు తెల్వదు. పేపర్లో వచ్చినదాన్ని బట్టి నేను చెప్తున్నా.. మా నాయకులూ కూడా చెప్పారు..
కేేతిగాడు : ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా..?
జుట్టుపోలుగాడు : అమ్మమ్మమ్మా… అబ్బబ్బబ్బా… ఎక్కడ బడ్తే అక్కడ వుంటూ రెండేసి, మూడేసి ఓట్లు వుంచుకుంటూ, ఎవడికిబడ్తే వాడికి ఓట్లేస్తే మేం చూస్తూ ఊర్కోవాలా.. ఊరుకుంటామా..? అందుకే మేం ప్రత్యేకంగా ‘సర్‌’ తీసుకొచ్చాం. ఓట్ల తనిఖీ చేపట్టాం.
కేేతిగాడు : మీ తనిఖీ తగలెట్టా… అది అంతా తప్పులు తడక. రాహుల్‌ గాంధీ ఎన్నిసార్లు ఆధారాలతో సహా చూపాడు. బతికున్నోళ్లు చచ్చిపోయినట్టు తేల్చారు. ఇంటి నెంబరులేని ఒకే ఇంట్లో దాదాపు వందమంది ఓటర్లు ఉన్నట్లు చూపారు. అసలు ఆధార్‌తో సంబంధం లేకుండా ఓట్లు గల్లంతు చేసారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు మొడితే, ఆ తర్వాత ఆధార్‌ను ఒప్పుకున్నారు. అయినా మీకు సిగ్గులేదు. కోట్లకు కోట్లు ఓట్లు గల్లంతు చేస్తూనే వున్నారు.
జట్టుపోలుగాడు : ఇంతకీ ఏంటంటావేంటి నువ్వు?
కేతిగాడు: నేనేమంటాను. ఏది చేసినా ప్రజలకోసం న్యాయంగా చేయమంటాను.
జట్టుపోలుగాడు : మరెంతమంది ఇతర దేశస్థులు మనదేశంలోకి వచ్చినా వారికి అప్పనంగా ఓట్లిచ్చి మనదేశంలో మనం కలిపేసుకోవడమేనా..?
కేేతిగాడు : ఎవర్రా ఇతరదేశస్థులు?
జుట్టుపోలుగాడు: ముస్లింలు.
కేతిగాడు : ముస్లింలు ఇతర దేశస్థులని ఎవరు చెప్పారు?
జుట్టుపోలుగాడు : మా నాయకులు. హిందువులు మాత్రమే ఈ దేశం వాళ్లు. ముస్లింలు మనదేశంపై దండయాత్రలు చేసి మన గుళ్లు గోపురాలు పగలగొట్టి వాటిల్లోని బంగారం, నగలు దోచుకుపోయారు. గతంలోలాగా మనం అలా కళ్లప్పగించి చూస్తూ వుంటే, మన ఆడోళ్ల మెడలో మంగళసూత్రాలు కూడా వాళ్లు తెంచుకు పోతారంట తెలుసా…
కేేతిగాడు : వార్ని, పిచ్చిపిచ్చిగా ఎవడెలా మాట్లాడితే అలా నమ్మేయడమేనా..? కాస్త బుర్ర వుపయోగించవేరా..?
నీ బంగారక్క మెడలో పుస్తెలు ఎవరైనా అలా లాక్కుపోతారేరా? అయినా మన పొరుగింటి మహ్మద్‌, ఇస్మాయిల్‌, ఫాతిమా, షబనా అందరూ ముస్లింలే కదా. మనబోటి కష్టజీవులే కదా. మనందరం కలిసిమెలసి పనులు చేసుకుంటున్నాం కదా.. దావతుల్లో, పండుగల్లో కలసిమెలసి తింటున్నాం కదా.. మన పిల్లలు కలసిమెలసి ఆడుకుంటున్నారు. చదువుకుంటున్నారు. కదా.. ఇవన్నీ నిజమా..? కాదా..?
జుట్టుపోలుగాడు : నిజమే. మరి మా నాయకులు ఎందుకలా మాట్లాడుతున్నారు?
కేతిగాడు : వాళ్లకి ఓట్లు కావాలి. హిందూ ముస్లింలు ఎంత బాగా కొట్టుకుంటే వాళ్లకి అంత లాభం.
జుట్టుపోలుగాడు : ఎట్లా..?
కేతిగాడు : ఎక్కడైనా హిందువులెక్కువ వుంటారా.? ముస్లింలెక్కువ వుంటారా?
జుట్టుపోలుగాడు : హిందువులే.
కేతిగాడు : ఇద్దరి మధ్య గొడవలు పుట్టిచ్చి కొట్టుకుంటే మనుషులు హిందువులు, ముస్లింలుగా రెండు ముక్కలవుతారు. ‘ముస్లింలు పరదేశస్థులు. వాళ్ల వల్ల మన హిందువులకు చచ్చేంత ప్రమాదం వుంది. జాగ్రత్త’.. అని పదేపదే చెప్తే హిందువులు ఎవరికి ఓటేస్తారు? చెప్పినవారికి అవునా.. కాదా..?
జట్టుపోలుగాడు : నాకు అర్థం కావడం లేదు మావా.. అంతా తిరకాసుగా వుంది.
బంగారక్క : (వచ్చి) వుండుమావా.. వాడికి నే చెప్తా.. అరే జుట్టుపోలుగా.. నీ చాటింపు విని, ఇక్కడ పన్జేవాళ్లు వాళ్ల సొంత రాష్ట్రాలకెళ్లి, అక్కడ ఓటర్ల జాబితా చూసుకుని, ఓట్లు లేకపోతే అప్పుడేం చేయాలి?
జట్టుపోలుగాడు : ఓట్లు కావాలని అర్జీ పెట్టుకోవాలి. అప్పుడు తనిఖీ చేసి… జాబితాలో ఓట్లు ఎక్కిస్తారు.
బంగారక్క : అప్పటికీ ఎక్కలేదనుకో.. సపోజ్‌…
జుట్టుపోలుగాడు : (నీళ్లు నవులుతాడు).
బంగారక్క : వాళ్ల ఓట్లుండవు. పోతారు. ఆ తర్వాత వాళ్లు భారతీయులు కాదు. అంటే ఈ దేశస్థులు కాదు, పరాయి దేశస్థులు అన్నమాట. మీ నాయకుల భాషలో అంటే.. ముందే మీరు ఓట్లు తీసేసి, ఆ తర్వాత వాళ్లని పరాయి దేశస్థులని ముద్రవేసి వాళ్లని ఈ దేశం నుండి వెళ్లకొడ్తారన్నమాట. ఇది జరిగే పనేనా..? అరే జుట్టుపోలుగా.. సపోజ్‌ మనం బెంగాల్‌ వాళ్లమో, అస్సాం వాళ్లమో అయి వుంటే మనం ఉన్నపళాన మన కూలి డబ్బుల్తో ఆయా రాష్ట్రాలకెళ్లి మన ఓట్లను తనిఖీ చేయించుకోగలమా.. చెప్పు?
జుట్టు పోలుగాడు : అమ్మో.. ఎలా వెళ్లగలం? మన దగ్గర అన్ని డబ్బులెక్కడియ్యి?
కేతిగాడు : హమ్మయ్య. తిరకాసేంటో ఇప్పటికైనా అర్థమయిందిరా జుట్టుపోలుగా..
బంగారక్క : జాగ్రత్తగా వినండి.. కులమతాలు మనం సృష్టించుకున్నవే… ముందుగా మనందరం మనుషులం. ఎవరి రక్తమైనా ఎర్రగానే వుంటుంది. తల్లిపాలు ఎవరివైనా తెల్లగానే వుంటాయి. పొట్టకూటికోసం వలస వచ్చిన వారితో ఇలా నిర్దయగా ఆడుకోవడం ఎవ్వరికీ తగదు. పాలకులు ఇలా దుర్మార్గం చేస్తుంటే మనమే బుద్ది చెప్పాలి.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -