న్యూజిలాండ్‌తో భారత్ మూడో టీ20 నేడు
గువహటి : వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ ఇండియా.. హ్యాట్రిక్ విజయంతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. నాగ్‌పూర్, రాయ్ పూర్‌లో ఏకపక్ష విజయాలు సాధించిన సూర్యసేన నేడు గువహటి టీ20లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ భయమెరుగని బ్యాటింగ్ శైలితో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ప్రణాళికలు తలకిందులైతున్నాయి. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్ దంచికొట్టగా.. రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ శివమెత్తారు.
బ్యాటింగ్ లైనప్‌లో సంజు శాంసన్ ఒక్కడే తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. నేడు భారత బ్యాటర్ల విధ్వంసాన్ని నిలువరించటం కివీస్ బౌలర్లకు కఠిన సవాల్. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా నేడు ఆడనున్నాడు. అక్షర్ పటేల్ కోలుకుంటే హర్షిత్ రానాతో పాటు కుల్‌దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం కానున్నారు. న్యూజిలాండ్ బ్యాట్‌తో మెరుగ్గానే రాణిస్తున్నా.. బౌలింగ్ లైనప్ దీటుగా రాణించాల్సిన అవసరం ఉంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు న్యూజిలాండ్ నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం.



