Sunday, January 25, 2026
E-PAPER
Homeజాతీయంహడావుడిగా 'సర్‌'

హడావుడిగా ‘సర్‌’

- Advertisement -

సామాన్యులు ఓటు హక్కు కోల్పోయే ఛాన్స్‌: అమర్త్యసేన్‌
పశ్చిమబెంగాల్‌లో ఓటర్‌ జాబితా సవరణపై తీవ్ర అసంతృప్తి
ప్రజాస్వామ్య భాగస్వామ్యం దెబ్బతినే ప్రమాదం

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ (92 ఏండ్లు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్‌ ప్రక్రియను అత్యంత వేగంగా, హడావుడిగా, అనవసర తొందరపాటుతో నిర్వహిస్తున్నారన్నారు. దీని వల్ల ప్రజాస్వామ్య భాగస్వామ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బోస్టన్‌ నుంచి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా పారదర్శకంగా, తగినంత సమయం కేటాయించి చేయాల్సిన ప్రక్రియ. కానీ పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం సర్‌ ప్రక్రియ జరుగుతున్న తీరు చూస్తుంటే, అది చాలా లోపభూయిష్టంగా కనిపిస్తోంది. ఓటర్లు తమ అర్హతలను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించేందుకు తగినంత సమయాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వడం లేదు. ఇది ఓటర్లకు అన్యాయం చేయడమే అవుతుంది. అంతేకాదు ఇది భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉంది.” అని అమర్త్యసేన్‌ వివరించారు.

మా అమ్మ వయస్సు గురించి అడిగారు
సర్‌ నిర్వహిస్తున్న ఎన్నికల అధికారుల తీరును అమర్త్యసేన్‌ ఎండగట్టారు. ”కొన్ని సార్లు ఎన్నికల సంఘం అధికారులకే తగినంత సమయం లేనట్టు అనిపిస్తోంది” అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. ”నా సొంత నియోజకవర్గం శాంతినికేతన్‌. అక్కడ నా వ్యక్తిగత వివరాలు అన్నీ అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు నా అర్హతలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. నా పుట్టిన తేదీ నాటికి మా దివంగత అమ్మగారి వయస్సు ఎంత అని అడిగారు. వాస్తవానికి మా అమ్మ కూడా ఓటరుగా ఉంటే, ఆమె వివరాలు వారి వద్దే ఉంటాయి కదా” అని అమర్త్యసేన్‌ ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల మాటేమిటి?
అయితే సర్‌ ప్రక్రియ వల్ల ఏదైనా రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరుతుందా? అనే ప్రశ్నకు ఆయన తనదైన రీతిలో స్పందించారు. ”నేను ఎన్నికల నిపుణుడిని కాను. కానీ దీని వల్ల బీజేపీ ప్రయోజనం పొందుతుందని కొంత మంది అంటున్నారు. అది నిజమో, కాదో నాకు తెలియదు. కానీ ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఇలాంటి లోపభూయిష్టమైన పద్ధతులతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి. ఎవరు లాభపడతారు అనేది ముఖ్యం కాదు. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి” అని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు.

సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?
తన లాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని అమర్త్యసేన్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించిన చాలా మంది భారతీయుల లానే తనకు కూడా జనన ధ్రువీకరణ పత్రం (బర్త్‌ సర్టిఫికెట్‌) లేదన్నారు. అందుకే తన ఓటు హక్కు కోసం మరిన్ని ఇతర పత్రాలను సమర్పించాల్సి వచ్చిందని పేరొన్నారు. ‘సర్‌ కోసం కావాల్సిన పత్రాలు సమర్పించడానికి నా స్నేహితుల నుంచి నేను సాయం పొందాను. కానీ ఇలా సాయం చేసే స్నేహితులు లేని సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? వారి గురించి నాకు ఆందోళనగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన పత్రాల సమర్పణ అనేది సామాన్య ప్రజలకు పెద్ద సవాలుగా మారుతుంద’ని ఆయన అన్నారు. ”సమాజంలో వెనుకబడిన వర్గాలు, పేద ప్రజలు ఈ సర్‌ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పత్రాల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది” అని అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -