Sunday, January 25, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశ పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని తెలిపారు. బండి సంజరుకు పంపిన నోటీసులో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్‌ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్‌ కుటుంబం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా రూ.వేల కోట్లు సంపాదించిందనీ, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్‌ చేశారంటూ ఈనెల 23న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయనపై సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని తెలిపారు.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను కేటీఆర్‌ తప్పుబట్టారు. డ్రగ్స్‌ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. తాను రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేశానని తెలిపారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని తన తరఫు న్యాయవాదులు నోటీసులో వివరించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఎంపీలూ వారి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, తనకు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -