Sunday, January 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసింగరేణి విచ్ఛిన్నానికి బీఆర్‌ఎస్‌ కుట్ర

సింగరేణి విచ్ఛిన్నానికి బీఆర్‌ఎస్‌ కుట్ర

- Advertisement -

టెండర్ల వివాదంలో సీఎం బామ్మర్ది పేరిట తప్పుడు ప్రచారం
ఆ పార్టీ కోరితే 2014 నుంచి నేటి వరకు విచారణ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి విచ్ఛిన్నానికి బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం హైదరాబాద్‌ లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లపై వస్తున్న కథనాలను కొట్టి పారేశారు. బీఆర్‌ఎస్‌తో పాటు ఓ పత్రికాధిపతి అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరి కండ్లల్లో ఆనందం చూడాలని రాస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పత్రిక రాసిన కథనాన్ని రక్తి కట్టిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయడం, ఆ వెంటనే విచారణకు ఆదేశించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఆ పార్టీ కోరితే 2014 నుంచి నేటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కేటాయింపులపై విచారణకు ఆదేశించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లు, వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు గానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు గాని రావని భట్టి స్పష్టం చేశారు.

పారదర్శకంగా సేవలందించేందుకు సంస్థకు చెందిన బోర్డు స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థ విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారనీ, రాజకీయ జోక్యానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. నైని కోల్‌ బ్లాక్‌ టెండర్లలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బామ్మర్ది సుజన్‌రెడ్డికి చెందిన శోధా కన్‌స్ట్రక్షన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు సంబంధం ఉందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో డీజిల్‌ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణా నికి తెరలేపారన్న హరీశ్‌ రావు ఆరోపణలను ఆయన ఖండించారు. డీజిల్‌ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదనీ, 2022లోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమలుల్లోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధానంలో వచ్చిన మార్పులు, డీజిల్‌ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పద్ధతే అమల్లో ఉందని భట్టి తెలిపారు.

సైట్‌ విజిట్‌ నిబంధన మేం పెట్టింది కాదు
కాంట్రాక్ట్‌ ఇచ్చేటప్పుడు సైట్‌ విజిట్‌ అనేది మేం పెట్టిన కొత్త నిబంధన కాదన్నారు. 2018, 2021, 2023లో కోలిండియా అనుబంధ సంస్థ అయిన సెంట్రల్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇనిస్ట్టిట్యూట్‌ (సీఎంపీడీఐఎల్‌ ) రూపొందించిన సింగరేణి టెండర్‌ డాక్యుమెంట్‌లోనే ఉందని స్పష్టం చేశారు. అలాగే ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్‌ విభాగం, డిఫెన్స్‌ విభాగం, గుజరాత్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏండ్లుగా అమల్లో ఉందని గుర్తు చేశారు. సీఎంపీడీఐఎల్‌ నిబంధన మేరకే సింగరేణి సంస్థ 2018 నుంచి ఈ నిబంధనను పాటిస్తూ వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పొందుపర్చారన్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అనేక సంస్థలు అమలు చేస్తున్నాయని వివరించారు.

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
తనపై చేసిన ఆరోపణలు చేసిన పత్రిక వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు. లేనట్లయితే ఆ రాతలు వ్యక్తిత్వ హననం జరిగినవిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు. 40 ఏండ్లుగా రాజకీయాల్లో విలువలు కలిగి ఉన్న నా వ్యక్తిత్వంపై దాడి చేయడం బాదించిందని పేర్కొన్నారు. తప్పుడు రాతలతో సంస్థలోని కార్మికులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ”సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది” అని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని వారి చెమటని స్వయంగా చూశాననీ, గద్దలను, రాబందులను, పెద్దలను వాలనివ్వనని భట్టి అన్నారు. సంస్థను కాపాడేందుకు తమ ప్రభత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -