Sunday, January 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఓట్‌ చోరీని ప్రతిఘటించాలి

ఓట్‌ చోరీని ప్రతిఘటించాలి

- Advertisement -

మోడీసర్కార్‌ను గద్దె దింపాలి
‘సర్‌’ పేరుతో మహిళలే లక్ష్యంగా ఓట్లు తొలగింపు
ప్రమాదంలో భారత రాజ్యాంగం : సర్‌పై ‘ఆవాజ్‌’ సదస్సులో మాజీ ఎంపీ సుభాషిణి అలీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తెస్తున్న ‘సర్‌’తో పేదల ఓట్లు తొలగింపబడతాయని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుభాషిణీ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్‌ చోరీకి సర్‌ను రాజమార్గంగా ఎంచుకున్నారనీ, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ‘సర్‌’ అమల్లోకి వస్తుందనీ, ఆ సమయంలో పేదలు తమ ఓటు హక్కును కచ్చితంగా కాపాడుకుని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పిలుపునిచ్చారు. ఆవాజ్‌ సౌత్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంతోష్‌నగర్‌లోని ఆలం ఖుంద్‌మెరి భవన్‌లో ‘సర్‌’పై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరై, మాట్లాడారు.

బీజేపీ పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందనీ, ఆస్థానాన్ని మనుస్మృతితో భర్తీ చేసేందుకు ఆపార్టీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ సమాన హక్కులు, జాతుల మధ్య సమానత్వం వంటి అంశాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమని వివరించారు. దానిలో భాగంగానే యజమానులు, కూలీలను విడగొట్టేలా కార్మిక చట్టాలను మార్చారని తెలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక మహిళాభ్యున్నతి కోసం ఏ ఒక్కచట్టాన్ని తేలేదని చెప్పారు. మొన్నటి వరకు హిందూ-ముస్లిం విభజన రాజకీయాలు చేసిన బీజేపీ, ఇప్పుడు మరో అడుగుముందుకేసి, నచ్చనివారి ఓట్లను జాబితాల్లోంచి తొలగించే కార్యక్రమానికి బీహార్‌ నుంచి శ్రీకారం చుట్టిందని చెప్పారు. దేశంలో మహిళలతో పాటు కార్మికులు, కర్షకులు సహా ప్రజలందరి హక్కులు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. మోడీ హయాంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసినవారు జైళ్ల నుంచి విడుదలై సన్మానాలు చేయించుకుంటున్నారనీ, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదంటూ బిల్కినోబాను కేసును ఉదహరించారు.

ఆశారాంబాపు వంటి వాళ్లు మైనర్‌ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే, వారిని బెయిల్‌పై విడుదల చేశారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారనీ, దానికోసం చట్టాలనే మారుస్తున్నారని చెప్పారు. దేశంలో నిత్యవసరవస్తువుల ధరలు పెరిగాయనీ, కేవలం రేషన్‌షాపుల్లో బియ్యం మాత్రమే ఇచ్చి, ఉప్పు, పప్పు, నూనెలు సహా అన్నింటి ధరలు పెంచేసేశారని వివరించారు. దేశంలో ఉపాధి, ఉద్యోగాలు లేవనీ, ఆదాయాలు పడిపోయాయయనీ, కొనుగోలు శక్తి సన్నగిల్లిందనీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా చైతన్యం కోసం హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా జాతీయ మహాసభల్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే ఐద్వా మహిళా ప్రదర్శన, బహిరంగసభల్లో పాతబస్తీ నుంచి పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఆవాజ్‌ నగర అధ్యక్షులు మహ్మద్‌ మహబూబ్‌ అలీ అధ్యక్షత వహించారు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, నగర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మమ్మ, శశికళ, ఆవాజ్‌ నగర కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌, జాయింట్‌ సెక్రటరీ మహ్మద్‌ అయూబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -