సామ్రాజ్యవాదానికి బలవుతుంది స్త్రీలే
మహిళల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది
అందరినీ ఐక్యం చేస్తాం
ఐక్య పోరాటాలే పరిష్కారం : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
మహిళలపై హింస సాధారణ వార్తగా మారిన ఈ కాలం.. భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటిక అని ఐద్వా హెచ్చరిస్తోంది. బీజేపీ పాలనలో మహిళల భద్రత క్రమంగా క్షీణిస్తోందని, మనువాద భావజాలానికి అనుగుణంగా మహిళలను తిరిగి ఇంటికే పరిమితి చేసే ప్రయత్నాలు బలపడుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పేర్కొంటోంది. కులం-మతం పేరిట దాడులు, లైంగిక హింస పెరుగుతున్న వేళ, మహిళలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, చట్టాలే నేరస్తులకు అండగా నిలుస్తున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తూ, నేటి నుంచి (ఆదివారం) హైదరాబాద్‌లో ఐద్వా అఖిల భారత మహాసభలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలేతో..
నవతెలంగాణ ప్రతినిధి సలీమా ముఖాముఖి.
ప్రశ్న: ‘సామ్రాజ్యవాదంపై పోరాడతాం’ అంటున్నారు. అసలు సామ్రాజ్యవాదానికి మహిళలకు సంబంధం ఏంటీ?
జవాబు: కచ్చితంగా ఉంది. సామ్రాజ్య వాద దేశాలు అనుసరిస్తున్న విధానాలన్నీ మహిళలకు వ్యతిరేకమైనవే. వారి ఆధిపత్యం కోసం దేశాలపై దాడులు చేస్తున్నారు. వాళ్లు సృష్టిస్తున్న యుద్ధాల వల్ల ఎక్కువ శాతం నష్టపోతుంది మహిళలు, పిల్లలే. గాజాలో ఇది మనం కండ్లారా చూశాం. ఇజ్రాయిల్ చేసిన దాడుల వల్ల లక్షల మంది మహిళలు, పిల్లలు హింసకు గురయ్యారు. సామ్రాజ్యవాదుల దాడులు, యుద్ధాలు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాదు. చూస్తూ ఊరుకుంటే రేపు మనపై కూడా దాడి చేస్తారు. మన ప్రధాని మోడీ ప్రతి నిమిషం సామ్రాజ్యవాదులను ఎలా సంతోషపెట్టాలా అని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో రేపు ఎవ్వరూ మిగలరు. ఒక్క అదానీ, అంబానీ తప్ప. అందుకే మహిళలందరూ కలిసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఐద్వా పిలుపు ఇస్తుంది. సెమినార్లు పెట్టి అవగాహన కల్పిస్తుంది.
దేశంలో మహిళలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నారని కేంద్ర పాలకులు అంటున్నారు, ఇది ఎంత వరకు నిజం?
నిజం చెప్పాలంటే మహిళల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. లింగ వివక్ష, లైంగిక దాడులు, గృహహింస పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోతున్నారు. ఉపాధిలేక, పనులు లేక కుటుంబం గడవక చాలా మంది మహిళలు మైక్రోఫైనాన్స్(ప్రైవేట్ అప్పులు) దగ్గర అప్పులు తీసుకుంటున్నారు. వీటిపై ఇటీవలే ఐద్వా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సర్వే చేశాం. మహిళలు తాము తీసుకుంటున్న అప్పునకు 90 నుంచి 100 శాతం వడ్డీలు కడుతున్నారు. అవి కట్టలేక మరొక అప్పు చేస్తున్నారు. ఇలా అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. వీటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇండ్ల నుంచి పారిపోతున్నారు. అప్పులిచ్చిన వారి నుంచి అవ మానాలు, లైంగిక దాడులకు గురవుతున్నారు. ప్రభుత్వాలేమో ఈ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులకు సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు. అంటే ప్రజలను పట్టి పీడించేందుకు ప్రభుత్వాలే అండగా నిలబడుతున్నాయి. వీటిపై ఐద్వాగా రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో కూడా చర్చలు జరిపాం. వీళ్లకు ఇచ్చే సబ్సిడీలకు పరిమితులు విధించాలని డిమాండ్ చేశాం. మహిళలకు 4 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరాం.
సమస్యలపై మహిళలందరినీ ఏకం చేసేందుకు ఐద్వా ఉద్యమిస్తున్న తీరు?
తమ తమ సమస్యలను బట్టి కదులుతున్నారు. మహిళలు ముఖ్యంగా ఉపాధి, హింస, పౌష్టికాహర లోపంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు బీజేపీ పాలనలో మనుధర్మం, కులం, మతం పేరుతో కూడా దాడులకు గురవుతున్నారు. అలాగే పెరిగిపోతున్న ధరలు ఆందోళన కరంగా ఉన్నాయి. జీవనోపాధిపై, తీవ్రమ వుతున్న సమస్యలపై మహిళలు బయటకు వస్తు న్నారు. తమ గొంతు విప్పుతున్నారు. అయితే మోడీ సర్కార్ హిందూ, ముస్లిం అంటూ ప్రజలలో తేడాలు తీసుకొస్తూ మతో న్మాద రాజకీయాలు చేస్తుంది. ఇది మహిళలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందరం కలిసి పోరాటం చేస్తేనే మహిళల సమస్యలకు పరిష్కారమవుతాయి. ఈ చైతన్యాన్ని మహిళల్లో కల్పించేందుకు ఐద్వా కృషి చేస్తుంది. రాబోయే కాలంలో మన సమస్యలపై మహిళలందరూ కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరాన్ని ఐద్వా ఈ మహాసభల ద్వారా తెలియజేస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల ఏకీకరణ సాధ్యమా?
బీజేపీ మనుస్మృతి పేర మహిళ లను ఇంట్లోనే ఉంచాలని భావిస్తుంది. భర్తలకు సేవ చేసుకుంటే సరిపోతుంది అనే భావన తీసుకువస్తుంది. మహిళలు తమ సమస్యలపై గొంతు విప్పకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తుంది. అయితే రైతు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ మహిళలు బయటకు వచ్చి శ్రమిస్తే తప్ప బతుకు గడవదు. మరి వీళ్లంతా ఏం చేయాలి? బయట అడుగుపెడితే హింసిస్తున్నారు. ప్రజాప్రతి నిధులు కూడా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. నేరాలు చేసిన వాళ్లకు రక్షణ కల్పిస్తూ బాధితులను అవమానిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. వీటన్నింటిపై మహిళలకు అవగాహన కల్పించాలి. ఇప్పటికే ఐద్వా ఈ కృషి చేస్తుంది. రాబోయే కాలంలో ఈ కృషి మరింత పెంచాలి.
ఈ అఖిల భారత మహాసభల ముందున్న కర్తవ్యాలు?
ఐద్వా ముందు ప్రస్తుతం మూడు కర్తవ్యాలున్నాయి. ఒకటి నేను ముందే చెప్పినట్టు సామ్రాజ్యవానికి వ్యతిరేకంగా పోరాడటం. అలాగే మహిళలను అణచివేసేందుకు వాడుకుంటున్న మనువాదంపై ఉద్యమించడం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. మహిళలకు దేశంలో రక్షణ ఉండాలంటే వీటిపై పోరాటం చేయక తప్పదు. మహిళల హక్కులు కాపాడుకోవాలన్నా, ఉపాధి దొరకాలన్నా, కాలే కడుపునిండాలన్నా పోరాటం ఒక్కటే మార్గం. ఆ దిశగా ఈ అఖిల భారత మహాసభల్లో తీర్మానాలు చేసుకోబోతున్నాం. అందుకు అనుగుణంగా మా భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకుంటాం. ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేయబోతున్నాం.
ఏండ్లు గడుస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఎందుకు, దీనికి కారణాలేంటీ?
పాలకుల్లో చిత్తశుద్ది లేకపోవడం, మహిళంటే చిన్నచూపు. నారీ శక్తి వందన్ పేరుతో మహిళలకు 33 శాతం రిజర్వేన్లు ఇస్తు న్నామని మోడీ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారు. మహిళలను అడు గడుగునా మోసం చేస్తూనే ఉన్నారు. బిల్లు ఆమోదం పొందినా అమలుకు నోచుకోకుండా చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 2024 ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉండేది. మహిళా సమా నత్వం అనేది బీజేపీకి అస్సలు నచ్చదు. అందుకే రిజర్వేషన్ బిల్లుకు అడుగడుగునా మోకాలడ్డుతుంది. బిల్లు తీసుకురావడం కాదు దాన్ని అమలు చేయడం ముఖ్యం. బీజేపీ చేస్తున్న మోసాలను మహిళలకు అర్థం చేయించేందుకు ఐద్వాగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాం.



