అధికారుల సమన్వయ ప్రయత్నం అవసరం
నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సమకూర్చాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
నవతెలంగాణ – ముషీరాబాద్
రైతులకు వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా అధికారుల సమన్వయ ప్రయత్నం అవసరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు లాభపడితేనే రాష్ట్రం బలపడుతుందన్నారు. ఆధునిక సాంకేతికతతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా వ్యవసాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సాయిల్ అనాలసిస్ ఆధారంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగం జరిగితే రైతుకు పెట్టుబడి తగ్గి లాభం పెరుగుతుందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే సమకూర్చి పంపిణీ చేస్తే రైతులు మోసపోవడం ఆగుతుందని చెప్పారు. పంట మార్పిడి, మైక్రో న్యూట్రియెంట్స్ వాడకం, నీటి పొదుపు పద్ధతులు రైతుకు భవిష్యత్ చూపిస్తాయని వివరించారు.
విశ్రాంత అధికారులు ఇంకా వ్యవసాయం పట్ల మక్కువతో రైతుల అభ్యున్నతికి పనిచేస్తుండటం అభినందనీయం అన్నారు. రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి విశ్రాంత అధికారులు సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మెన్ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విశ్రాంతి అధికారులు రిటైర్ అయినప్పటికీ సర్వీస్‌లో ఉన్న వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారుల పట్ల శ్రద్ధ చూపిస్తూ వారి నైపుణ్యాలను పెంచేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. అదేవిధంగా విశ్రాంత వ్యవసాయ అధికారులు రైతుల బాగుకు ప్రభుత్వానికి సమయానుగుణంగా తగు నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ విశ్రాంత అధికారుల సంఘం ప్రెసిడెంట్ రంగారెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం లాభదాయకం దిశగా చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


