Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన

విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన

- Advertisement -

పాల్గొననున్న సుమారు 400 మంది విద్యార్థులు
14 ఇంటర్ కళాశాలల భాగస్వామ్యం
నవతెలంగాణ – సదాశివపేట

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగాళా భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 14 ఇంటర్మీడియట్ కళాశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఫోక్ సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, నృత్యాలు, రంగోలి, మెహందీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సమకాలీన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా బాలికలు–బాలురులకు వేర్వేరుగా చెస్, క్యారమ్స్, పరుగు పోటీలు వంటి క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, వసతులపై అవగాహన కల్పించడం, రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులను డిగ్రీ కోర్సుల్లో చేర్చే విధంగా ప్రోత్సహించడమేనని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దోస్త్ అడ్మిషన్ విధానం, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా వివరించనున్నారు.

కళాశాలలో అందుబాటులో ఉన్న డిజిటల్ క్లాస్‌రూములు, డిజిటల్ లైబ్రరీ, జిమ్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, త్రాగునీటి సదుపాయం, విద్యుత్ వసతి, పరిపాలనా విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేసే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని తెలిపారు.

అలాగే ప్రభుత్వ ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్‌షిప్, సంతోర్ స్కాలర్‌షిప్, ప్రేమ్ జీ స్కాలర్‌షిప్ తదితర ఆర్థిక సహాయ పథకాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం. రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ప్రముఖులు హాజరవనున్నట్లు తెలిపారు.

కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వివిధ పోటీలు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం, అనంతరం 3 నుంచి 4 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశం మరియు వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ కళాశాల యాజమాన్యం భోజన సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ నెల 27న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేటలో నిర్వహించనున్న ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాశాల అభివృద్ధికి సహకరించాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగాళా భారతి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -