కిన్నెర సిద్ధార్థ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
మాదిగ మఠం పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆది రాష్ట్ర జాంబవ ధర్మ సమాజ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ, రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏకు తిరుపతి అన్నారు. ఆదివారం ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మాదిగ మఠం పున్నర్ నిర్మాణం కోసం మోత్కూర్ ఐలయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ మఠం పునర్ నిర్మాణం మరియు జాంబవ ప్రతిష్టాపన కార్యక్రమాలు మార్చి 6 ,7, 8 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరవుతున్నారని అన్నారు. ఆది పురుష ధర్మ సమాజం మాదిగ,మాది ఉప కులాల సమగ్ర జ్ఞాన సంపాదనను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఆది పురాణాలు సామాజిక చరిత్రలను అధ్యయనం చేయడం ద్వారా సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. మాదిగ సమాజం ఆత్మగౌరవం ధైర్యం మానసిక వికాసంతో అభివృద్ధి సాధించే దిశగా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత ముత్యాలు రావు, కోశాధికారి కప్పర చంద్రశేఖర్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల నర్సింగరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



