– హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ పండు రెడ్డి
– ప్రశంసిస్తున్న గ్రామస్తులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మారుమూల అటవీ ప్రాంతమైన మొద్దులుమడ గిరిజన గ్రామంలో నెలలు నిండిన గర్భిణీ దుర్గ కు సుఖప్రసవం జరిగేలా జోక్యం చేసుకుని బాధ్యత చూపిన సర్పంచ్ పండు రెడ్డి సేవలు ప్రశంసనీయం అవుతున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న మొద్దులుమడ గ్రామం నుంచి ఏ చిన్న అనారోగ్య మైనా 15 కిలోమీటర్లు దూరంలోని వినాయకపురం లేదా 30 కిలోమీటర్లు దూరంలోని అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ దూరం గ్రామస్తులకు భారమే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గర్భిణీ దుర్గ కు కాన్పు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అయితే విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం చేయకుండా మరో ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న సర్పంచ్ పండు రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందితో మాట్లాడి, అశ్వారావుపేట లోనే సురక్షితంగా సుఖప్రసవం జరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో “ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా” అని గ్రామస్తులకు ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టిన పండు రెడ్డి, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో ఆయన సేవలు మరింత ఆదర్శంగా నిలిచాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.



